ఎన్నాళ్లకెన్నాళ్లకు... | After six years into the mix ana ivanovic | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

Published Wed, Jun 3 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఆరేళ్ల తర్వాత సెమీస్‌లోకి ఇవనోవిచ్  
సఫరోవా తొలిసారి  
ఫ్రెంచ్ ఓపెన్


 పారిస్ : అంచనాలకు మించి రాణించిన ‘సెర్బియా సుందరి’ అనా ఇవనోవిచ్... ‘చెక్ రిపబ్లిక్ చిన్నది’ లూసీ సఫరోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 6-3, 6-2తో 19వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)పై గెలుపొందగా... 13వ సీడ్ సఫరోవా 7-6 (7/3), 6-3తో 21వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)ను ఓడించింది.

  2008లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న ఇవనోవిచ్ ఆ తర్వాత మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయింది. ఆరేళ్ల నిరీక్షణ తర్వాత తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇవనోవిచ్ అద్భుత ఆటతీరుతో ఫామ్‌లోకి రావడం విశేషం. 75 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఇవనోవిచ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. ముఖ్యంగా ఆమె సంధించిన ఫోర్‌హ్యాండ్ షాట్‌లకు స్వితోలినా వద్ద జవాబు లేకపోయింది.

తొలి సెట్ ఆరంభంలో రెండుసార్లు స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇవనోవిచ్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రేక్షకుల గ్యాలరీలో తన ప్రియుడు, జర్మనీ ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యుడు బాస్టియన్ ష్వాన్‌స్టీగర్ చూస్తుండగా ఇవనోవిచ్ తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. రెండో సెట్‌లోనూ ఈ సెర్బియా బ్యూటీ తన హవా కొనసాగించింది. రెండో గేమ్‌లో, ఐదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇవనోవిచ్ అదే ఊపులో సెట్‌ను దక్కించుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.

  మరోవైపు ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ మరియా షరపోవా (రష్యా)పై తాను సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ సఫరోవా మరోసారి అద్భుత ఆటతీరును ప్రదర్శించింది. గతేడాది ఇదే టోర్నీలో సెరెనా విలియమ్స్‌ను ఓడించి వెలుగులోకి వచ్చిన ముగురుజా దూకుడుకు పగ్గాలు వేస్తూ సఫరోవా తన కెరీర్‌లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. తొలి సెట్‌లో 10 నిమిషాలపాటు సాగిన పదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను నిలబెట్టుకున్నా... చివరకు టైబ్రేక్‌లో సఫరోవా పైచేయి సాధించింది.

రెండో సెట్‌లోని ఆరో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సఫరోవా ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెమీఫైనల్లో స్థానాన్ని సంపాదించింది. గురువారం జరిగే  సెమీస్‌లో ఇవనోవిచ్‌తో సఫరోవా ఆడుతుంది. ముఖాముఖి రికార్డులో సఫరోవా 5-3తో ఆధిక్యంలో ఉండటం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement