ఇవనో'విన్'
♦ ఆరేళ్ల తర్వాత క్వార్టర్స్‌లోకి
♦ నాలుగో రౌండ్‌లో మకరోవాపై గెలుపు
♦ నాలుగో సీడ్ బెర్డిచ్ బోల్తా
♦ నిషికోరి ముందంజ
♦ ఫ్రెంచ్ ఓపెన్
పారిస్ : కొన్నేళ్ల క్రితం ఎర్రమట్టి కోర్టులో దుమ్ము రేపి ఆ తర్వాత వెనుకబడి పోయిన సెర్బియా స్టార్ అనా ఇవనోవిచ్ మళ్లీ గాడిలో పడింది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో రౌండ్‌లో ఏడో సీడ్ ఇవనోవిచ్ 7-5, 3-6, 6-1తో తొమ్మిదో సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో 2007లో రన్నరప్‌గా నిలిచిన ఈ సెర్బియా బ్యూటీ 2008లో చాంపియన్‌గా అవతరించింది.
ఆ తర్వాత ఈ టోర్నీలో ఇవనోవిచ్ కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. తాజా విజయంతో ఇవనోవిచ్ ఈ టోర్నీలో ఆరేళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఈ మాజీ నంబర్‌వన్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీనే ఎదురైంది. ఆరంభంలో 0-2తో వెనుకబడిన ఇవనోవిచ్ ఆ తర్వాత వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి 3-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో వర్షం రావడంతో దాదాపు రెండు గంటలపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది.
వర్షం వెలిశాక ఇవనోవిచ్ జోరు పెంచి తొలి సెట్‌ను సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్‌లో మకరోవా మెరిసింది. ఇవనోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో ఇవనోవిచ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. పదునైన షాట్‌లు సంధించడంతోపాటు మకరోవా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి సెట్‌ను 6-1తో కైవసం చేసుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది.
గంటా 39 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇవనోవిచ్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు 30 విన్నర్స్ షాట్‌లు కొట్టింది. క్వార్టర్ ఫైనల్లో 19వ సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్)తో ఇవనోవిచ్ తలపడుతుంది. మరో నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్వితోలినా 6-2, 7-6 (11/9)తో 29వ సీడ్ అలీజా కార్నె (ఫ్రాన్స్)ను ఓడించింది. గంటా 54 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వితోలినా ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. స్వితోలినాతో ముఖాముఖి రికార్డులో ఇవనోవిచ్ 6-0తో ఆధిక్యంలో ఉంది.
సోంగా సంచలనం
పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలనం నమోదైంది. నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. 14వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 6-3, 6-2, 6-7 (5/7), 6-3తో బెర్డిచ్‌ను బోల్తా కొట్టించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-3, 6-4, 6-2తో గబాష్‌విలి (రష్యా)పై గెలిచాడు. ఈ విజయంతో నిషికోరి తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో నాలుగుసార్లు ఈ టోర్నీలో ఆడిన అతను ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అంతేకాకుండా 82 ఏళ్ల తర్వాత ఓ జపాన్ ప్లేయర్ ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరాడు. చివరిసారి 1931, 1933లో జపాన్ నుంచి జిరో సతో ఈ ఘనత సాధించాడు.
నేటి ప్రిక్వార్టర్స్ మధ్యాహ్నం గం. 2.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం