మాజీ నంబర్ వన్కు మళ్లీ షాక్!
ప్రపంచ మాజీ నంబర్‌వన్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) వరుసగా రెండో ఏడాది యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టింది. మహిళల సింగిల్స్ విభాగంలో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో అనామక ప్లేయర్ చేతిలో ఇవనోవిచ్ పరాజయం పాలైంది. తొలి రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 89వ ర్యాంకర్, చెక్ రిపబ్లిక్ కు చెందిన డెనిసా అలెర్టోవా 6-7 (4/7), 1-6తో మాజీ నంబర్ వన్ ఇవనోవిచ్ పై నెగ్గి రెండో రౌండ్ కి దూసుకెళ్లింది. 2008లో ఫ్రెంచ్ నెగ్గిన తర్వాత ఇవనోవిచ్ మరో మేజర్ టోర్నీని నెగ్గలేదు. 2012లో క్వార్టర్స్, 2013లో నాలుగో రౌండ్ మాత్రమే యూఎస్ ఓపెన్లో ఆమె చెప్పుకోదగ్గ ప్రదర్శనలు.
మ్యాచ్ అనంతరం ఇవనోవిచ్ మాట్లాడుతూ... సాధ్యమైనంతగా తక్కువ తప్పిదాలు చేసేందుకు ప్రయత్నించినా తన వల్ల కావడం లేదని 28 ఏళ్ల సెర్బియా భామ చెప్పింది. 'గతేడాది గాయం కారణంగా ర్యాంకుల్లో దిగజారాను. ప్రస్తుతం 31ర్యాంక్ లో కొనసాగుతున్నాను. తొలి రౌండ్లో చివర్లో తప్పిదం కారణంగా ట్రై బ్రేకర్లో సెట్ కోల్పోయాను' అని ఇవనోవిచ్ వివరించింది.
మరోవైపు రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మోనికా పుయిగ్ (పోర్టోరికో) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. చైనా ప్లేయర్ సాయ్‌సాయ్ జెంగ్ 6-4, 6-2 తేడాతో పుయిగ్ పై సంచలన విజయం సాధించింది.