'పచ్చిక' పండగొచ్చింది | Wimbledon tournament from today | Sakshi
Sakshi News home page

'పచ్చిక' పండగొచ్చింది

Published Mon, Jul 3 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM

'పచ్చిక'  పండగొచ్చింది

'పచ్చిక' పండగొచ్చింది

నేటి నుంచి వింబుల్డన్‌ టోర్నీ
బరిలో ముర్రే,, నాదల్, జొకోవిచ్‌
మహిళల సింగిల్స్‌లో ఒస్టాపెంకోపై చూపు


లండన్‌: సోమవారం నుంచి ప్రారంభం కానున్న వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్‌ సాధించాలని మాజీ చాంపియన్, రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) బరిలోకి దిగుతున్నాడు. గతేడాది ఇదే టోర్నీ సెమీస్‌లో మిలోస్‌ రావ్‌నిక్‌ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాక దాదాపు అందరూ ఫెడెక్స్‌ పని అయిపోయిందని భావించారు. అయితే ఈ ఏడాది కాలంలో తనను ఇబ్బంది పెడుతున్న మొకాలి గాయానికి సర్జరీ చేసుకుని కొత్త శక్తి యుక్తులు సంతరించుకుని తను మునుపటి ఫెడరర్‌ను గుర్తుకు తెస్తున్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్వితీయ ఆటతీరుతో ఫెడరర్‌ చెలరేగిపోయి ఏకంగా చాంపియన్‌గా నిలిచాడు. దీంతో తన గ్రాండ్‌స్లామ్‌ సంఖ్య 18కి పెంచుకున్నాడు.

మరోవైపు తనకెంతో ఇష్టమైన వింబుల్డన్‌కు మెరుగ్గా సిద్ధమయ్యేందుకు ఫ్రెంచ్‌ ఓపెన్‌కు సైతం డుమ్మా కొట్టాడు. ఇప్పటికే ఏడుసార్లు విజేతగా నిలిచి పీట్‌ సంప్రాస్‌ (అమెరికా)తో సమంగా నిలిచిన ఫెడెక్స్‌.. రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఈ టైటిల్‌ను సాధించాలని భావిస్తున్నాడు. ప్రస్తుత ఫామ్‌ చూస్తే ఈ టోర్నీలో ఫెడరర్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగనున్నాడు. మరోవైపు తన సమకాలీకులు ప్రపంచ నం.1 ఆండీ ముర్రే (బ్రిటన్‌), నోవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) ఫామ్‌లో లేకపోవడం.. రఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మొకాలి గాయంతో ఇబ్బంది పడుతుండడం దృష్ట్యా ఫెడెక్స్‌ ఈసారి టైటిల్‌ సాధిస్తాడని తన అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది గ్రాస్‌ కోర్టులపై చెలరేగిన ఫెడరర్‌.. హాలే టెన్నిస్‌ టైటిల్‌ను తొమ్మిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. ముర్రే, జొకోవిచ్, నాదల్‌ ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్నారిని వాకు కోలుకుంటే తన ప్రత్యర్థులుగా పరిగణిస్తానని ఫెడరర్‌ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్‌ డొల్గొపొలోవ్‌తో వింబుల్డన్‌ పోరును ఫెడెక్స్‌ ప్రారంభించనున్నాడు.

మరోవైపు రికార్డుస్థాయిలో 10 ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు సాధిం చిన నాదల్‌.. వింబుల్డన్‌లో మాత్రం అంతంత మాత్రంగానే రాణించాడు. ఇప్పటివరకు 15 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించి ఆల్‌టైమ్‌ హైలో రెండోస్థానంలో ఉన్న నాదల్‌.. వింబుల్డన్‌లో మాత్రం రెండుసార్లు మాత్రమే విజేతగా నిలిచాడు. చివరగా 2010లో విజేతగా నిలిచిన స్పెయిన్‌స్టార్‌.. గత ఐదేళ్లలో ప్రిక్వార్టర్‌ దశను దాటడంలో విఫలమయ్యాడు. మరోవైపు ఓ వైపు మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న నాదల్‌.. గ్రాస్‌ కోర్టుపై ఎలా రాణిస్తాడో చూడాలి. తొలిరౌండ్‌లో తను జాన్‌ మిల్‌మాన్‌ (ఆస్ట్రేలియా)తో నాదల్‌ తలపడనున్నాడు.

మరోవైపు ప్రపంచ నం.1, ముర్రేకు ఈ ఏడాది కలసి రాలేదు. ఇప్పటివరకు ఎనిమిది టోర్నీలు ఆడగా.. కేవలం దుబాయ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో విజేత నిలవడం మినహా మిగతా టోర్నీలో ఘోరంగా విఫలమయ్యాడు. ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్‌ ఓపెన్లలో వరుసగా ప్రిక్వార్టర్స్, సెమీస్‌లో వెనుదిరిగాడు. ఇటీవల జరిగిన క్వీన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షిప్‌లో ప్రపంచ 90వ ర్యాంకర్, జోర్డాన్‌ థాంప్సన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో తొలిరౌండ్‌లోనే ఓటమిపాలయ్యాడు. దీంతో సొంతగడ్డపై జరుగుతున్న గ్రాండ్‌స్లామ్‌లో సత్తాచాటాలని ముర్రే భావిస్తున్నాడు. తొలి రౌండ్‌లో అలెగ్జాండర్‌ బుబ్లిక్‌ (రష్యా)తో ముర్రే ఆడనున్నాడు.

మరోవైపు మూడుసార్లు చాంపియన్, ప్రపంచ మాజీ నం.1. నోవాక్‌ జొకోవిచ్‌ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇటీవల ఈస్ట్‌బోర్న్‌లో జరిగిన సన్నాహక టోర్నీలో విజయం సాధించడం జొకో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందనడంలో సందేహం లేదు. జనవరిలో దోహా ఓపెన్‌ నెగ్గిన తర్వాత సెర్బియన్‌ స్టార్‌ గెలిచిన టోర్నీ ఇదే కావడం విశేషం. మరోవైపు ఏడాది నుంచి నం.1 స్థానానికి దూరమైన జొకోవిచ్‌.. ఈసారి సత్తా చాటా ఎలాగైనా తన ర్యాంకును దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. తొలిరౌండ్‌లో మర్టిన్‌ క్లిజాన్‌ (స్లొవేకియా)తో జొకోవిచ్‌ తలపడనున్నాడు.


అందిరి చూపు ఒస్టాపెంకోపైనే..
మహిళల సింగిల్స్‌ విభాగంలో అందరి దృష్టి జెలీనా ఒస్టాపెంకో(లాత్వియా)పైనే కేంద్రీకృతమైంది. స్టార్‌ ప్లేయర్లకు షాకిస్తూ ఫ్రెంచ్‌ ఓపెన్‌ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన ఒస్టాపెంకోను వింబుల్డన్‌లో ఫేవరెట్‌గా భావిస్తున్నారు. రోలాండ్‌ గారోస్‌ విజయం గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఒస్టాపెంకోపై ఎంతైనా ఉంది. మరోవైపు సెరెనా విలియమ్స్‌ (అమెరికా), మరియా షరపోవా (రష్యా)తదీతర స్టార్‌ ప్లేయర్ల గైర్హాజరీతో ఈసారి చాంపియన్‌గా ఎవరు నిలుస్తారనో ఆత్రుత అభిమానుల్లో నెలకొంది. నం.1 ర్యాంకుతోపాటు తొలి గ్రాండ్‌స్లామ్‌ను త్రుటిలో కోల్పోయిన సిమోనా హాలెప్‌ (రొమేనియా) ఈసారి ఎలాగైనా తొలి గ్రాండ్‌స్లామ్‌ను నెగ్గాలని కృతనిశ్చయంతో ఉంది.

రోలాండ్‌ గారోస్‌లో తొలిరౌండ్‌లోనే ఓటమిపాలై ఓపెన్‌ శకంలో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ తొలిరౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన మొదటి ప్రపంచ నం.1 ప్లేయర్‌గా అపఖ్యాతి మూట గట్టుకున్న ఏంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ) ఈసారి తన సత్తాచాటాలని భావిస్తోంది. తొలిరౌండ్‌లో అలెగ్జాండ్రా సాస్నోవిచ్‌ (బెలారస్‌)తో ఒస్టాపెంకో, మరినా ఎరాకోవిచ్‌ (న్యూజిలాండ్‌)తో హెలెప్, ఇరినా పాల్కని (అమెరికా)తో కెర్బర్‌ తలపడనున్నారు. మరోవైపు పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), ప్రపంచ మాజీ నం.1, విక్టోరియన్‌ అజారెంకా (డెన్మార్క్‌), వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా), కరోలనా ప్లిస్కోవా (చెక్‌రిపబ్లిక్‌) ఉఇఉఉలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మ్యాచ్‌లు సా.4 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌ సెలెక్ట్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement