ఒకే పార్శ్వంలో ముర్రే, నాదల్
మరోవైపు ఫెడరర్, జొకోవిచ్ ∙ వింబుల్డన్ టోర్నీ ‘డ్రా’ విడుదల
లండన్: అంతా అనుకున్నట్లు జరిగితే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)... ఈసారి తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలంటే సెమీఫైనల్లో తొలుత మాజీ చాంపియన్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)ను దాటాల్సి ఉంటుంది. ఈ ఇద్దరూ ఒకే పార్శ్వంలో ఉండటంతో సెమీఫైనల్లో తలపడే అవకాశముంది.
మరో పార్శ్వంలో రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఉన్నారు. దాంతో వీరిద్దరూ సెమీఫైనల్లోనే అమీతుమీ తేల్చుకునే చాన్స్ ఉంది. సోమవారం మొదలయ్యే ఈ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)తో ముర్రే... మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)తో జొకోవిచ్... డల్గొపలోవ్ (ఉక్రెయిన్)తో ఫెడరర్... జాన్ మిల్‌మన్ (ఆస్ట్రేలియా)తో నాదల్ ఆడతారు.
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ విజేత షరపోవా (రష్యా) గైర్హాజరీలో పలువురు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో ఆడనుంది. క్వార్టర్ ఫైనల్లో ఆమెకు ఫ్రెంచ్, యూఎస్ ఓపెన్ మాజీ విజేత స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) ఎదురయ్యే అవకాశముంది.
మహిళల డబుల్స్‌లో 13వ సీడింగ్ పొందిన సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం) ద్వయం తొలి రౌండ్‌లో నవోమి ఒసాకా (జపాన్)–షుయె జాంగ్ (చైనా) జోడీతో ఆడుతుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట డస్టిన్ బ్రౌన్–మిషా జ్వెరెవ్ (జర్మనీ) జోడీతో... లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) జోడీ నోల్–ఒస్వాల్డ్ (ఆస్ట్రియా) జంటతో... దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం ఎడ్మండ్ (బ్రిటన్)–సుసా (పోర్చుగల్) జంటతో... జీవన్ నెదున్‌చెజియాన్ (భారత్)–డొనాల్డ్‌సన్ (అమెరికా) జోడీ క్లార్క్–విల్లీస్ (బ్రిటన్) జంటతో తలపడతాయి.