థీమ్‌ నిష్క్రమణ  వింబుల్డన్‌ టోర్నీ | Dominic theme out of Wimbledon tournament | Sakshi

థీమ్‌ నిష్క్రమణ  వింబుల్డన్‌ టోర్నీ

Published Wed, Jul 4 2018 1:32 AM | Last Updated on Wed, Jul 4 2018 1:32 AM

Dominic theme  out of  Wimbledon tournament - Sakshi

లండన్‌: గత నెలలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి రన్నరప్‌గా నిలిచిన డొమినిక్‌ థీమ్‌ వింబుల్డన్‌ టోర్నమెంట్‌లో మాత్రం తొలి రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ ఆస్ట్రియా ఆటగాడు మార్కోస్‌ బగ్ధాటిస్‌ (సైప్రస్‌)తో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 4–6, 5–7తో రెండు సెట్‌లను చేజార్చుకొని మూడో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో థీమ్‌ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) 4–6, 3–6, 4–6తో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. మరోవైపు రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఐదో సీడ్‌ డెల్‌పొట్రో (అర్జెంటీనా) రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో నాదల్‌ 6–3, 6–3, 6–2తో డూడీ సెలా (ఇజ్రాయెల్‌)పై, జ్వెరెవ్‌ 7–5, 6–2, 6–0తో డక్‌వర్త్‌ (ఆస్ట్రేలియా)పై, డెల్‌పొట్రో 6–3, 6–4, 6–3తో గొజోవిక్‌ (జర్మనీ)పై గెలిచారు. 

క్విటోవా ఇంటిముఖం... 
మహిళల సింగిల్స్‌లో 2011, 2014 చాంపియన్, ఎనిమిదో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. బెలారస్‌ అమ్మాయి సస్నోవిచ్‌ 6–4, 4–6, 6–0తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–2, 7–5తో బ్రాడీ (బ్రిటన్‌)పై, టాప్‌ సీడ్‌ సిమోనా హాలెప్‌ (రొమేనియా) 6–2, 6–4తో కురిమి  (జపాన్‌)పై గెలిచారు.  

ఫెడరర్‌ రికార్డు బద్దలు 
వరుసగా అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లు ఆడిన ప్లేయర్‌గా స్పెయిన్‌ ఆటగాడు ఫెలిసియానో లోపెజ్‌ కొత్త రికార్డు నెలకొల్పాడు. స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌ (వరుసగా 65) పేరిట ఉన్న ఈ రికార్డును వరుసగా 66వ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతోన్న లోపెజ్‌ బద్దలు కొట్టాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో లోపెజ్‌ 6–3, 6–4, 6–2తో డెల్‌బోనిస్‌ (అర్జెంటీనా)పై గెలిచాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement