నిష్క్రమించిన దిగ్గజం | Tennis Legend Roger Federer Bids Farewell To Game | Sakshi
Sakshi News home page

నిష్క్రమించిన దిగ్గజం

Published Sat, Sep 17 2022 12:55 AM | Last Updated on Sat, Sep 17 2022 12:55 AM

Tennis Legend Roger Federer Bids Farewell To Game - Sakshi

బరిలోకి దిగిన ప్రతిసారీ ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తూ వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ ఆటకు వీడ్కోలు పలకబోతున్నట్టు చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెన్నిస్‌ అభిమానులను దిగ్భ్రాంతి పరిచింది. వచ్చేవారం లండన్‌లో జరిగే లేవర్‌ కప్‌తో ఇక గ్రౌండ్‌నుంచి నిష్క్రమించబోతున్నానని ఆ ప్రకటన సారాంశం. నిజానికి ఇది ఊహిం చని పరిణామ మేమీ కాదు. ఆయన రేపో, మాపో ఆటకు గుడ్‌బై చెబుతాడని మూడు నాలుగేళ్లుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అభిమానులను కలవరపెడుతూనే ఉన్నాయి. వింబుల్డన్, ఆస్టేలియన్‌ ఓపెన్, యూఎస్‌ ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో ఫెదరర్‌కు గాయాలూ, శస్త్ర చికిత్సలూ రివాజయ్యాయి. పర్యవసానంగా అప్పుడప్పుడు ఆటకు విరామం ప్రకటించక తప్పలేదు. వాస్తవానికి నిరుడు జూలైకి ముందు 14 నెలలుగా అతను ఆడింది లేదు. ఆ నెలలో జరిగిన వింబుల్డన్‌ క్వార్టర్స్‌లో దారుణమైన ఓటమి చవిచూశాడు. అందుకే ఫెదరర్‌ ఏం చెబుతాడోనన్న సందేహం అభిమానులను నిత్యం వేధించేది. అలాగని టెన్నిస్‌లో అతనేమీ అత్యున్నత స్థానాన్ని అధిరోహించిన మేటి ఆటగాడు కాదు. టెన్నిస్‌ దిగ్గజ త్రయంలో ఫెదరర్‌తోపాటున్న రాఫెల్‌ నాదల్, జోకోవిచ్‌లిద్దరూ గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ రేస్‌లో అతన్నెప్పుడో అధిగమించారు. ఆ త్రయంలో అతనిది మూడో స్థానమే. కానీ ఎప్పుడూ అంకెలే వీక్షకుల్ని చకితుల్ని చేయలేవు. తన ఆటకు సృజనాత్మకతను జోడించడం, అందరూ కొట్టే షాట్లే అయినా ప్రతిసారీ తన ప్రత్యేకతను ప్రదర్శించడం, చురుకైన తన కదలికలతో వీక్షకుల్ని కట్టిపడేయడం ఫెదరర్‌కే సాధ్యం. ఆ కదలికల్లో ఒక్కటైనా అనవసరమైనది కనబడదు. తనవైపు దూసుకొచ్చిన బంతిని ప్రత్యర్థి అంచనాకు అందని రీతిలో కొట్టి వారితో తప్పులు చేయించడం, పాయింట్‌ సాధించడం అతనికి అలవోకగా అబ్బిన విద్య. బ్యాక్‌హ్యాండ్, ఫోర్‌హ్యాండ్‌ షాట్లు రెండింటికీ అతనే కేరాఫ్‌ అడ్రస్‌. ఫుట్‌వర్క్, అటాకింగ్‌ గేమ్‌ అతనికే సొంతం. ఒక్కోసారి కొన్ని షాట్లు విఫలం కావొచ్చుగాక... గెలుపోటములతో నిమిత్తం లేకుండా అవి మళ్లీ మళ్లీ నెమరేసుకునే దృశ్యాలుగానే ఎప్పటికీ మిగిలాయి. అందుకే ఆటలో ప్రత్యేక ప్రతిభ తన సొంతమని అతను చేసిన ప్రకటన ఎవరికీ అతిశయోక్తి అనిపించలేదు. 2002లోనే అతను టాప్‌–50 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించాడు. ఈ ఏడాది జూన్‌ వరకూ చెక్కు చెదరకుండా అక్కడే నిలిచాడు. పురుషుల టెన్నిస్‌లో 2004లో నంబర్‌ వన్‌ ప్లేయర్‌ అయ్యాడు. 2008 వరకూ నిరంతరాయంగా కొనసాగాడు. అనేకసార్లు మళ్లీ ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఎంచుకున్న రంగంలో ఏకాగ్రతతో పనిచేయడం, ఎదురయ్యే అవరోధాలను అధిగ మించేందుకు ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉండటం ఫెదరర్‌ ఆటలో కనబడుతుంది. ఈ లక్షణమే అతన్ని ఇప్పటికీ యోధుడిగా నిలిపింది. ఓడిన సందర్భాల్లో సైతం క్రీడాభిమానులు అతనికి నీరాజనాలు పట్టేలా చేసింది. 41 ఏళ్ల వయసంటే... దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవమంటే... 1,500కు మించిన మ్యాచ్‌లంటే ఏ క్రీడాకారుడికైనా నిష్క్రమించక తప్పని సమయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు సరికొత్త తారలు దూసుకొస్తుంటాయి. ఆటను కొత్తపుంతలు తొక్కిస్తుంటాయి. నాదల్, జోకోవిచ్‌ల సంగతలా ఉంచి హ్యూబర్ట్‌ హుర్కజ్‌లాంటి సరికొత్త మెరుపు ముందు ఫెదరర్‌ తలవంచక తప్పని సందర్భమూ వచ్చింది. అందుకే కావొచ్చు... తన శరీర సామర్థ్యంపై మదింపు వేసుకున్నాడు. తన పరిమితులేమిటో తెలుసుకున్నాడు.

ఫెదరర్‌ వదిలిపోతున్న వారసత్వం అత్యుత్తమమైనది. ఒక ఆటగాడు వ్యక్తిగా ఎలా ఉండాలో, ఎలాంటి ప్రమాణాలు పాటించాలో తన సద్వర్తన ద్వారా అతను చూపాడు. ఓటమి ఎదురైతే ప్రత్యర్థులపై నిప్పులు కక్కడం ఏ ఆటలోనైనా ఇప్పుడు రివాజు. గెలుపు సాధించినవారు విర్రవీగుతున్న ఉదంతాలూ లేకపోలేదు. ఇక టెన్నిస్‌లో ఓటమి ఎదురైతే సహనం కోల్పోయి రాకెట్లు విరగ్గొడుతున్నవారూ ఉంటున్నారు. ఎన్నడో కెరీర్‌ మొదట్లో ఫెదరర్‌ కూడా సహనం కోల్పోయిన సందర్భాలున్నాయి. కానీ అతి త్వరలోనే తన ప్రవర్తన మార్చుకున్నాడు. ప్రశాంతంగా, ఏకాగ్రతతో ఆడితే సత్ఫలితం సాధించడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. సేవా కార్యక్రమాల్లో సైతం ఎందరికో ఆదర్శప్రాయుడయ్యాడు. తన పేరిట ఉన్న ఫౌండేషన్‌ ద్వారా చదువుల్లో రాణించే నిస్సహాయ పిల్లలకు చేయూతనందించడం, ప్రకృతి వైపరీత్యాలు విరుచుకు పడినప్పుడు ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లతో విరాళాలు సేకరించి ఆపన్న హస్తం అందించడం అతని ప్రత్యేకత. ఆటాడుతున్నప్పుడు నాదల్, జొకోవిచ్‌లతో నువ్వా నేనా అన్న రీతిలో తలపడటం షరా మామూలే అయినా ఎప్పుడూ అవి వ్యక్తిగత వివాదాలుగా ముదరలేదు. చెప్పాలంటే ఆ ముగ్గురూ కలిసి టెన్నిస్‌కు కనీవినీ ఎరుగని జనాదరణను తెచ్చారు. ఆ ఆట స్థాయిని పెంచారు. జోకోవిచ్‌పై ఒక సందర్భంలో డోపింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనడానికి వెళ్లినప్పుడు వ్యాక్సిన్‌ వేయించుకోని కారణంగా ఆటంకాలెదురయ్యాయి. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడుతున్నప్పుడు కాలికి సమస్య ఏర్పడటంతో కొన్ని ఇంజెక్షన్లు తీసుకున్నానని నాదల్‌ ప్రకటించి వివాదంలో చిక్కుకున్నాడు. కానీ ఇలాంటి వివాదాలేవీ ఫెదరర్‌కు ఎదురుకాలేదు. టెన్నిస్‌ ప్రపంచంలో చివరంటా ధ్రువతారగా కొనసాగిన ఫెదరర్‌ మిగిల్చిన జ్ఞాపకాలు ఎన్నటికీ చెక్కుచెదరనివి. అభిమానులకు ఎప్పటికీ అపురూపమైనవి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement