డాన్... ఆ పేరులోనే ప్రపంచాన్ని శాసిస్తున్న భావన వినిపిస్తుంది! ఈ డాన్ కూడా అలాగే చేశాడు. సుదీర్ఘకాలం పాటు బ్యాడ్మింటన్ ప్రపంచంపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఎందరు పోటీకొచ్చినా.. ఎందరు ప్రయత్నించినా అతడిని పడగొట్టలేకపోయారు. సాధించిన ఘనతలు, రికార్డులు చూస్తే అతని తిరుగులేని ఆట కళ్ల ముందు కనిపిస్తుంది. టీనేజర్‌గా దూసుకొచ్చి దాదాపు రెండు దశాబ్దాల పాటు విజయాలకు చిరునామాగా మారిన ఆల్‌టైమ్ బ్యాడ్మింటన్ గ్రేట్ లిన్ డాన్. షటిల్‌ను చైనా నడిపించిన కాలం నుంచి ఇతర దేశాల షట్లర్ల జోరు పెరిగే దాకా.. ఎక్కడా ఆటలో వన్నె తగ్గని వీరుడతను.
బ్యాడ్మింటన్ ప్రపంచంలో 9 టోర్నమెంట్‌లను అత్యుత్తమమైనవిగా భావిస్తారు. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ప్రపంచ కప్, థామస్ కప్, సుదిర్మన్ కప్, సూపర్ సిరీస్ మాస్టర్స్ ఫైనల్స్, ఆల్ ఇంగ్లండ్ ఓపెన్, ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్... సూపర్ గ్రాండ్‌స్లామ్‌గా వ్యవహరించే వీటన్నింటిని గెలుచుకున్న తొలి, ఏకైక ఆటగాడు లిన్ డాన్ మాత్రమే.
28 ఏళ్ల వయసు వచ్చే సరికే అతను సాధించిన ఈ ఘనత.. డాన్ స్థాయి ఏమిటో చూపిస్తుంది. ఇన్నేళ్లలో మరే ఆటగాడికి సాధ్యం కాని రీతిలో అతను ప్రదర్శించిన ఆట డాన్‌ను బాడ్మింటన్ దిగ్గజంగా మార్చింది. ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకున్న ఏకైక షట్లర్ డాన్ మాత్రమే. 2008లో బీజింగ్‌లో సొంత అభిమానుల సమక్షంలో పసిడి సాధించిన అతను 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ కనకాన్ని సొంతం చేసుకున్నాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడం కూడా అసాధారణ రికార్డే! మొత్తంగా అంతర్జాతీయ పోటీల్లో 666 విజయాలు, 66 టైటిల్స్ లిన్ డాన్ దిగ్గజ హోదాకు చిరునామాగా నిలిచాయి.
సుదీర్ఘకాలం సత్తా చాటుతూ..
అద్భుతమైన ఫిట్‌నెస్, పదునైన ఆటతో సుదీర్ఘ కాలం పాటు డాన్ బ్యాడ్మింటన్‌ను శాసించగలిగాడు. సరిగ్గా చెప్పాలంటే వేర్వేరు దశకాల్లో అతను భిన్నమైన ప్రత్యర్థులతో తలపడుతూ అన్ని సమయాల్లోనూ తనదైన ముద్ర చూపించాడు. ఉదాహరణకు డాన్‌ను ఎదుర్కొన్న భారత షట్లర్లను చూస్తే అతని ఆట ఏమిటో అర్థమవుతుంది. తన 17 ఏళ్ల వయసులో 2001లో అతను పుల్లెల గోపీచంద్‌కు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. తన కెరీర్ అత్యుత్తమంగా సాగుతున్న 2000 మధ్యకాలంలో అనూప్ శ్రీధర్, అరవింద్ భట్‌లాంటి వారితో తలపడ్డాడు. ఆ దశాబ్దం చివర్లో పారుపల్లి కశ్యప్‌నూ ఓడించాడు.
2010 దాటాక భారత స్టార్ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, సాయిప్రణీత్‌లను డాన్ ఎదుర్కొన్నాడు. ఇక 2018కి వచ్చేసరికి భారత యువ ఆటగాడు లక్ష్య సేన్‌తోనూ కోర్టులో పోటీ పడ్డాడు. అటాకింగ్‌కి మారు పేరుగా డాన్ తన ప్రత్యర్థులపై చెలరేగాడు. పదిసార్లు షటిల్ గాల్లోకి లేస్తే తొమ్మిదిసార్లు డాన్ జంప్ చేసి స్మాష్ కొట్టడం సహజం. అదే అతని శైలి అంటూ మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ కితాబు ఇచ్చాడు. బాడ్మింటన్‌లో లిన్ డాన్ అత్యుత్తమ ఆటగాడు అన్నది మరో మాటకు తావులేని స్టేట్‌మెంట్! టెన్నిస్‌లోనైనా కొన్నిసార్లు కొందరు ఆటగాళ్ల గురించి చర్చ సాగుతుంది. కానీ ఇక్కడ అలాంటి అవకాశమే లేదు అని అరవింద్ భట్ చెప్పాడు.
సంగీతం నుంచి షటిల్ వరకు..
చిన్నతనంలో పియానో బాగా వాయించడం చూసి తల్లిదండ్రులు డాన్‌ను సంగీతంలోనే కొనసాగమని ప్రోత్సహించారు. అయితే అతను మాత్రం దానిని సరదాకే పరిమితం చేసి బ్యాడ్మింటన్ రాకెట్ పట్టాడు. అతనిలోని సహజ ప్రతిభ ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే దూసుకుపోయేలా చేసింది. చైనా ప్రభుత్వ అధీనంలో పనిచేసే ఆర్మీ స్పోర్ట్స్ టీమ్ దృష్టి డాన్‌పై పడిన తర్వాత మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తన రాకను ఘనంగా చాటిన డాన్ ఆ తర్వాత అదే జోరుతో అద్భుతాలు చేశాడు. వరుస విజయాలతో 21 ఏళ్లకే తొలిసారి ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా నిలిచాడు.
చిరకాల ప్రత్యర్థితో..
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యంత ఆసక్తికరమైన, సమ ఉజ్జీల సమరాలు అంటే.. లిన్ డాన్ – లీ చోంగ్ వీ (మలేసియా) మధ్య జరిగిన మ్యాచ్‌ల గురించే చెప్పాలి. ఒక తరం పాటు వీరిద్దరి మధ్య సాగిన పోటీ షటిల్ అభిమానులకు ఆనందాన్ని పంచింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ వంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఈ ఇద్దరి మధ్య సాగిన హోరాహోరీ మ్యాచ్‌ల గురించి ఎంత చెప్పినా తక్కువే.
పోలిస్తే లీ చోంగ్ వీ అత్యధిక అంతర్జాతీయ విజయాలు (732), అత్యధిక వారాలు వరల్డ్ నంబర్‌వన్ (348) ఘనత సాధించాడు. ప్రతిభ, సాంకేతికపరంగా చూస్తే డాన్ కంటే చోంగ్ వీ ఎంతో ముందుంటాడు. కానీ కోర్టులోకి దిగేసరికి మాత్రం డాన్ ఒక్కసారిగా పూనకం వచ్చినవాడిలా మారిపోతాడు అనేది పుల్లెల గోపీచంద్ అభిప్రాయం. నిజంగానే ఓవరాల్ రికార్డు అలాగే ఉంది. వీరిద్దరూ 40 సార్లు తలపడగా లిన్ డాన్ 28–12తో ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే ఈ అంకెలు చూస్తే అంతా ఏకపక్షంగా కనిపించినా.. వాస్తవం అది కాదు.
ఒక్కో పాయింట్ కోసం, సుదీర్ఘ ర్యాలీలతో వీరిద్దరూ పోరాడిన తీరు ఆయా మ్యాచ్‌లను అద్భుతాలుగా నిలిపాయి. వీరిద్దరి మధ్య జరిగిన 2012 ఒలింపిక్స్ ఫైనల్ మ్యాచ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే అత్యుత్తమ మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. మరో చర్చ లేకుండా లిన్ డాన్ మాత్రమే బ్యాడ్మింటన్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు అంటూ లీ చోంగ్ వీ చేసిన ప్రశంస డాన్ ప్రతిభకు అందిన సర్టిఫికెట్‌గా చెప్పొచ్చు. ఈ ఏడాది మే నెలలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తమ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఒకేసారి ఈ ఇద్దరు స్టార్లను చేర్చడం విశేషం.
కోర్టులోనే ప్రేమ..
బ్యాడ్మింటన్‌లో సహచర క్రీడాకారిణి గ్జి గ్జింగ్‌ఫాంగ్‌తో ఏడేళ్ల పాటు డేటింగ్ చేసిన అనంతరం డాన్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. గ్జింగ్‌ఫాంగ్ కూడా రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంతో పాటు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించింది. మాడ్రిడ్‌లో జరిగిన 2006 వరల్డ్ చాంపియన్‌షిప్ సింగిల్స్ పురుషుల, మహిళల విభాగాల్లో వీరిద్దరూ విజేతలుగా నిలిచాక ప్రేమబంధం మరింత బలపడింది. ఆటలో ఏ స్థాయికి ఎదిగినా చదువులో కూడా డాన్ చురుగ్గా ఉండేవాడు.
కెరీర్‌లో ఉచ్ఛ దశలో ఉన్న సమయంలోనే అతను హువాఖియో యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. తద్వారా ఆటగాడిగా ఉంటూనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తొలి చైనా ప్లేయర్‌గా నిలిచాడు. 2012లో రెండోసారి ఒలింపిక్స్ పతకం గెలిచాక లిన్ డాన్ బయోగ్రఫీ వచ్చింది. ‘అన్‌టిల్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్’ పేరుతో వచ్చిన ఈ పుస్తకం ఎంతో మంది యువకులకు స్ఫూర్తిగా నిలిచి అత్యంత ఆదరణ పొందింది.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
చదవండి: భారత మహిళలకు చేజారిన విజయం
Comments
Please login to add a commentAdd a comment