Indian Tennis Player Leander Paes Inspirational Journey in Telugu - Sakshi
Sakshi News home page

Leander Paes: ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి.. బతకడం కష్టమన్నారు.. అయినా

Published Mon, Dec 26 2022 7:10 PM | Last Updated on Mon, Dec 26 2022 7:35 PM

Indian Tennis Player Leander Paes Inspirational Journey in Telugu - Sakshi

Leander Paes Inspirational Journey: 1996 ఆగస్టు 3.. భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయమైన రోజు.. ఒలింపిక్స్‌లో పతకం గురించి ఎదురు చూసి చూసి ఇక మనకు రాదులే అనుకొని నిట్టూర్చిన ఒక తరం క్రీడాభిమానులకు సుదినం.. ఒలింపిక్స్‌ వేదికపై జాతీయ జెండా ఎగురవేసేందుకు నేనున్నానంటూ ఒక్కడు దూసుకొచ్చాడు.. 16 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ను చేర్చాడు. వ్యక్తిగత విభాగంలోనైతే 44 ఏళ్ల తర్వాత భారత ఆటగాడి పేరు వినిపించింది. మెగా వేదికపై విజయంతో తానేంటో చూపించిన అతని పేరు లియాండర్‌ పేస్‌! ఈ విజయంతో ఆగిపోకుండా ఆ తర్వాతా.. ఏళ్ల పాటు భారత టెన్నిస్‌కు పర్యాయపదంలా నిలిచిన స్టార్‌...

వరుసగా మూడు ఒలింపిక్స్‌లలో కనీసం ఒక్క పతకం కూడా సాధించలేని మన దేశం.. అసలు ఒలింపిక్స్‌ అంటే మనవి కావు, మనకు ఎలాగూ పతకాలు గెలిచే అవకాశమే లేదు.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అనుకుంటున్న సమయం.. ఎప్పుడో 1980లో హాకీలో పతకం వచ్చింది. ఆ తర్వాత 1984, 1988, 1992.. క్యాలెండర్‌ మారింది కానీ కనీసం కంచు మోత కూడా వినిపించలేదు. భారత్‌కు మిగిలింది రిక్త హస్తమే.. సరిగ్గా చెప్పాలంటే ఒక తరం మొత్తం ఒలింపిక్స్‌ పతకం గురించి ఆలోచించడమే మానేసింది. ఇలాంటి సమయంలో వచ్చిన ఒలింపిక్స్‌ పతకం భారత క్రీడలకు కొత్త ఊపిరి పోసింది. అప్పటినుంచి ప్రతి ఒలింపిక్స్‌లో భారత్‌ వరుసగా ఏదో ఒక పతకం గెలుస్తూనే వచ్చింది. 


టీనేజర్‌ నుంచి వెటరన్‌ వరకు..

1990లో టీనేజర్‌గా పేస్‌.. డేవిస్‌ కప్‌ డబుల్స్‌ మ్యాచ్‌లో సీనియర్‌ సహచరుడు జీషాన్‌ అలీతో కలసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 47 ఏళ్ల వయసు వచ్చే వరకు అదే ఉత్సాహం, అదే జోరు.. పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్‌.. దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్నాడు. 

అలుపు లేని ఆటసారి
18 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌.. ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్‌ టైటిల్స్‌.. ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకున్న రికార్డులు మరో ఎత్తు. ఫిట్‌నెస్‌ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజుల్లేవు.. ఇదెలా సాధ్యం ఈ మనిషికి? మూడు పదులు దాటగానే కెరీర్‌ చరమాంకంలోకి వచ్చిందని చాలా మంది భావించే ఆటలో 47 ఏళ్ల వయసు వచ్చినా గ్రాండ్‌గా ఆడి చూపించిన అద్భుతం పేరే లియాండర్‌ పేస్‌. అతను తొలి డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన రోజు నుంచి ఆఖరి ప్రొఫెషనల్‌ మ్యాచ్‌ ఆడే వరకు చూస్తే టెన్నిస్‌లో తరం మారిపోయింది.

అతను వచ్చే సమయానికి ఎడ్‌బర్గ్, బెకర్, లెండిల్‌ లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్‌ కెరీర్‌ సాగింది. ఆపై ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్‌ రాకెట్‌ మాట్లాడింది. కెరీర్‌లో ఎక్కువ భాగం డబుల్స్‌లోనే అయినా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను (ఆ)హాశ్చర్యంతో చూశారు భారత క్రీడాభిమానులు. కానీ టెన్నిస్‌లాంటి వ్యక్తిగత క్రీడలో 30 ఏళ్లు సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది. 

అట్లాంటాతో అంబరాన...
1990లో పేస్‌.. జూనియర్‌ వింబుల్డన్, 1991లో యూఎస్‌ ఓపెన్‌ గెలిచి వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు కూడా అతను ఇంత కాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్‌ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 ఒలింపిక్స్‌లో అతని వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్‌ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్స్‌ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్‌.. ఆ తర్వాత తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వచ్చాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్స్‌ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్‌ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్‌ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్‌ కూడా ఉంది. 


డేవిస్‌ కప్‌ సూపర్‌ స్టార్‌

పేస్‌కు సంబంధించి ప్రతి భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్‌ కప్‌ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే ‘వాలి’ బలం రెట్టింపు అయిపోయినట్లు.. భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్‌ ఆటతీరు కూడా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోర్నీల సంగతి ఎలా ఉన్నా.. దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్‌ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్‌ పతకం తర్వాత లియాండర్‌ ఆడిన అన్ని డేవిస్‌కప్‌ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంతటి ఆటగాడైనా సరే.. తన వీరోచిత ప్రదర్శనతో పేస్‌.. డేవిస్‌ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. హెన్రీ లెకాంటే, ఇవాన్‌సెవిక్, టిమ్‌ హెన్మన్, వేన్‌ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్‌ ర్యాంక్‌ల్లో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచ్చిన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే. 1993లో డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌లో భారత్‌ సెమీస్‌కు చేరడంలో పేస్‌దే కీలక పాత్ర. 

మృత్యువుతో పోరాడి..
2003లో వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆడుతున్న సమయంలో కోర్టు అటు వైపు నుంచి బంతి పేస్‌ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్‌ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లుకమ్మాయి. శరీరంపై నియంత్రణ కోల్పోయి.. నిలబడేందుకు భాగస్వామి మార్టినా నవ్రతిలోవాను ఆసరాగా చేసుకున్నాడు. అది బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్‌ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకునేందుకు కూడా మార్టినా సిద్ధమైంది. దాన్నుంచి కోలుకున్న తర్వాత పేస్‌ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు. 


ప్రస్థానం సాగిస్తూ...

పేస్‌ ఆటతీరు భీకరమైన సర్వీస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్‌లో కూడా అతను వాలీలు, డ్రాప్‌ షాట్‌లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్‌ వద్ద పేస్‌ ఆట తన పార్ట్‌నర్‌ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్‌.. కుర్రాళ్ల ఆటగా మారిపోయిన కొత్త తరంలో కూడా పేస్‌ నెట్‌ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ మాజీ సహచరుడు మహేశ్‌ భూపతి ప్రశంసించడం అతని ఆటలో పదునును చూపించింది. రాడ్‌లేవర్‌ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్‌ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్‌.. వేర్వేరు భాగస్వాములతో కలసి 100కు పైగా మ్యాచుల్లో డబుల్స్‌ బరిలోకి దిగాడు. ఆటను పిచ్చిగా ప్రేమించిన పేస్‌ ఏ స్థాయిలోనైనా చివరి వరకు ఆడుతూనే వచ్చాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్‌ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. (క్లిక్ చేయండి: మేరీ కోమ్‌.. బాక్సింగ్‌ రింగ్‌ను శాశించిన ఉక్కు మహి)

- మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement