చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ ఫైనల్ తర్వాత బహుమతి ప్రదానోత్సవం జరుగుతోంది.. విజేతగా నిలిచిన అరవింద్ చిదంబరం వేదిక మీదకు వచ్చాడు. అతను ట్రోఫీ తీసుకున్న తర్వాత కోచ్ ఆర్‌బీ రమేశ్‌ను కూడా శిష్యుడిని అభినందించేందుకు వేదికపైకి పిలిచారు. అక్కడికి వచ్చిన రమేశ్ అనూహ్యంగా చేసిన ఒక పని అందరినీ ఆశ్చర్యపరచింది. పసివాడిని ఎత్తుకున్నట్లుగా అరవింద్‌ను వేదికపైనే రెండు చేతులతో పైకి ఎత్తుకొని ఆయన తన ఆనందాన్ని ప్రదర్శించారు.
తన శిష్యులు విజయాలు సాధించడం రమేశ్‌కు కొత్త కాదు. ప్రజ్ఞానంద, వైశాలి తదితర గ్రాండ్‌మాస్టర్లను తీర్చిదిద్దిన ద్రోణాచార్యుడు ఆయన. కానీ అరవింద్‌పై చూపించిన ఆ అభిమానానికి ప్రత్యేక కారణం ఉంది. దాదాపు దశాబ్దం కిందట తన కోచింగ్ కేంద్రం ‘గురుకుల్’లో చేరిన కుర్రాళ్లలో అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు తెచ్చుకొని అనూహ్యంగా తెర వెనక్కి వెళ్లిన అరవింద్ ఇప్పుడు మళ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటాడు. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్న టోర్నీలో విజేతగా నిలిచిన 25 ఏళ్ల అరవింద్..పెద్ద విజయాల కోసం పోటీలో ఉన్నానని నిరూపించుకున్నాడు.
అగ్రశ్రేణి ఆటగాళ్లను ఓడించి..
దాదాపు 11 ఏళ్ల కిందట చెన్నైలో గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ ఓపెన్ టోర్నమెంట్ జరిగింది. ఎంతో మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో 14 ఏళ్ల అరవింద్ చిదంబరం విజేతగా నిలిచాడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా కూడా అతను నిలిచాడు. ఆ సమయంలో అతను గ్రాండ్‌మాస్టర్ కాదు కదా.. కనీసం ఇంటర్నేషనల్ మాస్టర్ కూడా కాదు. టైటిల్‌ను గెలిచే క్రమంలో అరవింద్ నలుగురు గ్రాండ్‌మాస్టర్లు, ఇద్దరు ఇంటర్నేషనల్ మాస్టర్లను ఓడించాడు. అప్పుడే అతని ప్రదర్శనపై ప్రత్యేక ప్రశంసలు కురిశాయి. విదేశీ మీడియా కూడా ఎవరీ ప్రతిభావంతుడు అంటూ వాకబు చేసింది. టోర్నీ జరుగుతున్న సమయంలోనే అరవింద్‌లోని ప్రత్యేక ప్రతిభ గురించి దిగ్గజ ప్లేయర్ సుసాన్ పొల్గర్‌కు కోచ్ రమేశ్ వివరించారు. ఈ కుర్రాడు వచ్చే ఆరు నెలల్లో గ్రాండ్‌మాస్టర్ అవుతాడు చూడండి అని ఆయన చెప్పారు. అయితే పొల్గర్ దీనిని నమ్మలేదు. మహా అయితే ఇంటర్నేషనల్ మాస్టర్ మాత్రమే కాగలడని, అంత వేగంగా ఎదగలేడని ఆమె అభిప్రాయ పడింది. కానీ చెన్నై ఓపెన్‌లో విజయంతో తొలి జీఎం నార్మ్‌ను అందుకున్న అరవింద్ సరిగ్గా ఆరు నెలలు తిరిగేలోపే గ్రాండ్‌మాస్టర్ కావడం విశేషం.
ప్రతికూలతలను దాటి..
చెస్ కెరీర్‌లో అరవింద్ ప్రస్థానం చాలా కష్టంగా సాగింది. మూడేళ్ల వయసులోనే అతను తండ్రిని కోల్పోయాడు. ఎల్‌ఐసీ ఏజెంట్ అయిన తల్లి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి అతడిని పెంచింది. మధురైకి చెందిన అరవింద్ చెస్‌పై ఆసక్తి చూపించడంతో ఆమె తన స్థాయిలో∙ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. ఆమె నమ్మకాన్ని నిలబెడుతూ అరవింద్ జాతీయ స్థాయిలో మంచి విజయాలు సాధించాడు. 12 ఏళ్ల వయసులోనే జాతీయ అండర్–19 చాంపియన్‌గా నిలిచిన అతను.. అండర్–14 వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో స్థానం దక్కించుకున్నాడు. అయితే మరింత పైకి ఎదగాలంటే సరైన ప్రణాళిక, శిక్షణ అవసరం. ఇలాంటి సమయంలో అరవింద్‌లో నైపుణ్యాన్ని గుర్తించిన కోచ్ రమేశ్ చెన్నైకి వస్తే తాను శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. దాంతో అతను చెన్నై చేరాడు. అక్కడ రమేశ్ అతనికి చెస్‌లో ఉచితంగా శిక్షణ ఇవ్వగా.. చెస్ క్రీడాకారులకు అడ్డా అయిన వేలమ్మాళ్ స్కూల్ యాజమాన్యం కూడా అతడి నుంచి ఎలాంటి ఫీజు తీసుకోకుండా అడ్మిషన్ ఇచ్చింది. ఓఎన్‌జీసీ కూడా స్కాలర్‌షిప్ ఇవ్వడంతో అరవింద్ ఆట ముందుకు సాగి మంచి విజయాలు వచ్చాయి.
జీఎం హోదాను అందుకొని..
అంతర్జాతీయ స్థాయిలో అగ్రశ్రేణి చెస్ ప్లేయర్‌గా ఎదగాలంటే ప్రతిభ మాత్రమే సరిపోదు, తగినన్ని అవకాశాలు కూడా రావాలి. దాని కోసం పెద్ద సంఖ్యలో విదేశాల్లో టోర్నీలు ఆడాల్సి ఉంటుంది. అందుకు తగిన ఆర్థిక స్తోమత కూడా అవసరం. ఆ స్థితిలో అరవింద్ సహజంగానే ఇబ్బంది పడ్డాడు. అండర్–19లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన తర్వాత భారత చెస్ సమాఖ్య తమ ఖర్చులతో రెండో టోర్నీలకు పంపించింది. ఇంకా గ్రాండ్‌మాస్టర్‌గా కూడా మారని ఇలాంటి దశలో మరో వైపు రమేశ్ కూడా తన ప్రయత్నాలు కొనసాగించాడు. సరిగ్గా ఆ సమయంలో అతనికి సుసాన్ పొల్గర్ కూడా సహకరించింది. దాంతో చెస్ బేస్ అనే వెబ్‌సైట్ కొన్ని రోజుల వ్యవధిలో ఫండ్ రైజర్‌తో 10 వేల డాలర్లు సేకరించి అరవింద్‌కు అందించింది. దీనిని వాడుకున్న అతను టోర్నీల్లో వరుస విజయాలు సాధించి కొన్ని నెలల వ్యవధిలోనే గ్రాండ్‌మాస్టర్ హోదాను అందుకున్నాడు.
ఒత్తిడిలో చిత్తయి..
వేగంగా దూసుకొచ్చి జీఎంగా మారిన తర్వాత అరవింద్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దురదృష్టవశాత్తు అతను ఒక్కసారిగా ఒత్తిడి పెంచుకొని ఆందోళనకు గురయ్యాడు. అంచనాలను అందుకోలేకపోతే ఎలా అనే భయం అతడిని వెంటాడింది. దాంతో వరుస ఓటములు పలకరించాయి. చాలా సందర్భాల్లో తన స్థాయికి తగినట్లుగా కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయాడు. సుదీర్ఘ కాలం పాటు ఒకే రేటింగ్ (2640) వద్ద ఆగిపోయాడు. తనతో పాటు ఆటను ప్రారంభించి, ఒక దశలో తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆటగాళ్లంతా ముందుకు వెళ్లిపోవడం కూడా అతడిని కలవరపెట్టింది. దీని నుంచి బయటకు రావడానికి అరవింద్‌కు చాలా సమయం పట్టింది. అయితే ఇప్పుడు పాతికేళ్ల వయసులో సరైన దిశలో అతని ప్రస్థానం మళ్లీ మొదలైంది.
కీలక విజయంతో సత్తా చాటి..
నిజానికి ఎంతోమంది అగ్రశ్రేణి ప్లేయర్లు పాల్గొన్న చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో తనకు అవకాశం దక్కుతుందని ముందుగా అతనూ ఊహించలేదు. కానీ ఒకసారి అడుగు పెట్టాక స్పష్టంగా తన ఆటేంటో అతను అందరికీ చూపించాడు. ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతున్న అర్జున్ ఇరిగేశి, విదిత్ గుజరాతీ, లెవాన్ అరోనియన్, పర్హామ్ మఘ్‌సూద్‌లూలను దాటి అరవింద్ విజేతగా నిలవడం విశేషం. టోర్నీ చివరి దశకు వచ్చే సరికి టైటిల్ ఖాయమనుకున్న అర్జున్‌ను ఓడించడంతో అరవింద్ అగ్రస్థానం ఖాయమైంది. గత కొంతకాలంగా పెరిగిన ఆత్మవిశ్వాసమే అందుకు కారణమని అతను చెప్పాడు. ఇటీవల అత్యుత్తమంగా 2720 రేటింగ్‌ను కూడా అందుకొన్న అరవింద్ రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టైటిల్స్ గెలవడం ఖాయం.
మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment