PR Sreejesh: అలా సాగిన ప్రయాణం.. చివరికి భారత అత్యుత్తమ గోల్‌ కీపర్‌గా.. | Parattu Ravindran (PR) Sreejesh Success Story In Hockey In Telugu | Sakshi
Sakshi News home page

PR Sreejesh Success Story: అలా సాగిన ప్రయాణం.. చివరికి భారత అత్యుత్తమ గోల్‌ కీపర్‌గా..

Published Sun, Aug 4 2024 12:59 AM | Last Updated on Sun, Aug 4 2024 6:56 PM

Parattu Ravindran (PR) Sreejesh Success Story In Hockey Sports News

ఆ అబ్బాయి ముందుగా అథ్లెటిక్స్‌ను ఇష్టపడ్డాడు.. అందుకే స్ప్రింట్స్‌తో మొదలు పెట్టాడు.. కానీ కొద్ది రోజులకే అది బోర్‌ కొట్టేసింది.. దాంతో లాంగ్‌జంప్‌ బాగుంటుందనుకొని సాధన చేశాడు..తర్వాత అదీ నచ్చలేదు. ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని వాలీబాల్‌ వైపు వెళ్లాడు.. తనకంటే పెద్దవారైన కజిన్స్‌లో ఎక్కువ మంది వాలీబాల్‌ ఆడుతుండటంతో అది ఆకర్షించింది. ఈసారీ అదే తంతు. ఇక్కడ కూడా తాను ఆశించిన ఆనందం దక్కలేదు. అతనొక్కడే కాదు.. కేరళలో చాలామందికి ఇది అనుభవమే!

అక్కడ పిల్లలంతా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు. అన్ని ఆటల్లో తమ ప్రయత్నమేదో చేస్తూనే ఉంటారు. ప్రొఫెషనల్స్‌గా మారాలనో, లేక పైస్థాయికి చేరి గొప్ప ఆటగాళ్లుగా గుర్తింపు పొందాలనో కాదు.. అక్కడి సంస్కృతి అలాంటిది. ఆటల్లో వారికి ఆనందం కనిపిస్తుంది. ఆ కుర్రాడు కూడా అలాగే అన్ని ప్రయత్నాలూ చేస్తూ చివరకు 12వ ఏట తన అసలు మజిలీకి చేరుకున్నాడు. క్రీడాపాఠశాలలో చేరిన తర్వాత అతను పీఈటీ సూచన మేరకు హాకీని ఎంచుకున్నాడు. హాకీ ఆడితే ఎక్కడా ఉద్యోగం కూడా రాదని కొందరు పెద్దలు చెప్పినా.. అతను పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ఆ ఆట నచ్చింది.

కొన్నాళ్ల శిక్షణ తర్వాత హాకీలో తనకు గోల్‌ కీపింగ్‌ ఇంకా నచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో గోల్‌ కీపర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సాగిన ప్రయాణం భారత అత్యుత్తమ గోల్‌ కీపర్‌గా, ప్రపంచ హాకీలో అత్యుత్తమ గోల్‌ కీపర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునే వరకు సాగింది. అతనే పరట్టు రవీంద్రన్‌ (పీఆర్‌) శ్రీజేశ్‌. సుదీర్ఘకాలంగా భారత హాకీ వెన్నెముకగా ఉంటూ పలు గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న శ్రీజేశ్‌ ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత ఆట నుంచి తప్పుకోనున్నాడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.

శ్రీజేశ్‌లో ప్రతిభను గుర్తించిన కోచ్‌లు జయకుమార్, రమేశ్‌ కొలప్ప ముందుగా అతడిని హాకీ వైపు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో గోల్‌ కీపింగ్‌ను ఎంచుకోవడం వైపు మళ్లించారు. తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్‌ స్కూల్‌ వారి కేంద్రం. అక్కడే ఓనమాలు నేర్చుకున్న శ్రీజేశ్‌ ఇప్పటికీ వారి పట్ల తన కృతజ్ఞతను చాటుతుంటాడు. ‘వారిద్దరు నాకు హాకీ నేర్పించారు. దాంతో పాటు ఇతర అంశాల వైపు మనసు మళ్లకుండా పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేలా చేశారు. అన్నింటినీ మించి వారు ఇచ్చిన ఒక సలహా నా కెరీర్‌ ఆసాంతం పాటించాను.

గోల్‌ కీపర్‌ కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఒక జట్టు గెలుపు, ఓటముల మధ్య అతనుంటాడు. కానీ గెలిస్తే అందరిలో ఒకడిగా చూస్తారు. ఓడితే మాత్రం తప్పు మొత్తం అతనిదే అంటూ కీపర్‌ను విలన్‌గా మారుస్తారు అని చెప్పారు. ఇది నేనెప్పటికీ మరచిపోలేను’ అని శ్రీజేశ్‌ చెప్పుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో సహజంగానే అప్పుడప్పుడు వైఫల్యాలు ఉన్నా.. గోల్‌ కీపర్‌ స్థానంలో అడ్డుగోడలా నిలబడి శ్రీజేశ్‌ అందించిన విజయాలెన్నో! ముఖ్యంగా అతి కీలక సమయాల్లో కూడా భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండే అతని శైలి ఇలాంటి విజయాలకు కారణమైంది.

జూనియర్‌గా సత్తా చాటి..
భారత హాకీ జట్టులో దాదాపుగా ఆటగాళ్లందరూ జూనియర్‌ స్థాయిలో మంచి ప్రదర్శన తర్వాత సీనియర్‌కు ప్రమోట్‌ అయినవారే. శ్రీజేశ్‌ కూడా అలాంటివారిలో ఒకడు.16 ఏళ్ల వయసులో అతను ఇండియా అండర్‌–21 టీమ్‌లో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటించాడు. అంతకు ముందు జాతీయ స్థాయిలో పాఠశాలల కోసం నిర్వహించే నెహ్రూ కప్‌లో సత్తా చాటడంతో అతనికి ఆ అవకాశం దక్కింది. నాలుగేళ్ల పాటు భారత జూనియర్‌ జట్టు తరఫున నిలకడగా రాణించిన శ్రీజేశ్‌ భారత్‌ ఆసియా కప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి.. బెస్ట్‌ గోల్‌ కీపర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డునూ గెలుచుకున్నాడు. అయితే ఒకవైపు జూనియర్‌ టోర్నీల్లో ఆడుతూండగానే 18 ఏళ్ల వయసులో భారత సీనియర్‌ జట్టులోకి శ్రీజేశ్‌ ఎంపికయ్యాడు. 2006 దక్షిణాసియా (శాఫ్‌) క్రీడల్లో అతను మొదటిసారి భారత సీనియర్‌ టీమ్‌ తరఫున బరిలోకి దిగాడు.

పోటీని తట్టుకొని..
శ్రీజేశ్‌ జట్టులోకి వచ్చేనాటికి ఇద్దరు సీనియర్‌ గోల్‌ కీపర్లు ఏడ్రియన్‌ డిసూజా, భరత్‌ ఛెత్రి టీమ్‌లో పాతుకుపోయారు. వారిని దాటి అవకాశం దక్కడం అంత సులువు కాదు. దాంతో అప్పుడప్పుడు ఒక్కో మ్యాచ్‌ దక్కడం మినహా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశమే రాలేదు. కానీ తన వంతు కోసం ఎదురు చూడటం మినహా ఏం చేయలేని పరిస్థితి. అయితే ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లో ఒక కీలక మలుపు వస్తుంది. అలాంటి అవకాశం లభించినప్పుడు దానిని రెండు చేతులా సమర్థంగా ఒడిసిపట్టుకున్నవాడే పైకి ఎదుగుతాడు.

శ్రీజేశ్‌కు అలాంటి చాన్స్‌ 2011లో చైనాలో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి అతను జట్టును గెలిపించాడు. దాంతో అందరి దృష్టీ అతనిపై పడింది. శ్రీజేశ్‌ గోల్‌ కీపింగ్‌ నైపుణ్యం గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడూ భారత జట్టు మ్యాచ్‌ ఆడినా ప్రాధాన్య క్రమంలో తొలి అవకాశం శ్రీజేశ్‌కే దక్కేది. ఆ తర్వాతే మరో గోల్‌ కీపర్‌ ఎవరైనా ఉంటే సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగేవాడు.

వరుస ఘనతలు..
2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో.. ఆడిన మూడు మ్యాచ్‌లనూ ఓడింది. దాంతో హాకీ ఇండియా సమూల మార్పులతో సిద్ధమైంది. సీనియర్లను వదిలి ఈ సంధి దశలో యువకులతో నిండిన టీమ్‌ను సిద్ధం చేసింది. వీరిలో అందరికంటే ముందు వరుసలో ఉన్న శ్రీజేశ్‌.. జట్టుకు కీలకంగా మారాడు. ఆపై అతని స్థాయిని పెంచిన టోర్నీ 2013 ఆసియా కప్‌ వచ్చింది. భారత్‌ రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో బెస్ట్‌ గోల్‌ కీపర్‌గా అతను అవార్డు అందుకున్నాడు. తర్వాతి ఏడాది ఆసియా క్రీడల్లో మరో అద్భుత ప్రదర్శన అతడి నుంచి వచ్చింది.

పాకిస్తాన్‌లో జరిగిన ఫైనల్లో అతను రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను ఆపి జట్టుకు స్వర్ణపతకాన్ని అందించాడు. ఈ  ప్రపంచ హాకీలో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణించే చాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీజేశ్‌ రెండుసార్లు అత్యుత్తమ గోల్‌ కీపర్‌గా నిలిచాడు. 2015 హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్స్‌ పోటీల్లో మూడో స్థానం సాధించడంలో కూడా కీపర్‌గా అతనికి ప్రధాన పాత్ర. 33 ఏళ్ల భారత జట్టు సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో శ్రీజేశ్‌ చూపించిన గోల్‌ కీపింగ్‌ ప్రదర్శన అసమానం. అసాధారణ రీతిలో కొన్ని పెనాల్టీ కార్నర్‌లు, స్ట్రోక్‌లను ఆపిన అతను పెనాల్టీ షూటౌట్‌లో నెదర్లండ్స్‌ వంటి నంబర్‌వన్‌ జట్టును నిలువరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.

ఒలింపిక్స్‌ పతకాన్ని ముద్దాడి..
భారత హాకీ చరిత్రలో నిస్సందేహంగా అత్యుత్తమ గోల్‌కీపర్‌గా శ్రీజేశ్‌ నిలుస్తాడు. పంజాబ్, హరియాణాలాంటి ఉత్తరాది జట్ల ఆటగాళ్లు శాసించే క్రీడలో ఒక కేరళ ఆటగాడు ఎదిగిన తీరు ఎంతో ప్రత్యేకం. 18 ఏళ్ల కెరీర్, 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు ఒలింపిక్స్‌ అసాధారణం. చాంపియన్స్‌ ట్రోఫీలో రెండు రజతాలు, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, కాంస్యం, కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు రజతాలు, ఆసియా కప్‌లో రజతం, ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో నాలుగు స్వర్ణాలు, రజతం గెలుచుకున్న భారత జట్లలో శ్రీజేశ్‌ సభ్యుడు. కానీ ఎన్ని గెలిచినా ఒక ఆటగాడి కల ఒలింపిక్స్‌ పతకం. 2016 రియో ఒలింపిక్స్‌లో శ్రీజేశ్‌ కెప్టెన్సీలో జట్టు క్వార్టర్‌ ఫైనల్‌ వరకు రాగలిగింది.

అయితే అసలు అద్భుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జరిగింది. మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో కాంస్యం సాధించి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించారు. ఇక్కడా శ్రీజేశ్‌దే ప్రధాన పాత్ర. జర్మనీతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అతని గోల్‌ కీపింగ్‌ను చూస్తే ఈ పతకం విలువేమిటో తెలుస్తుంది. తమకంటే సీనియర్లు ఎంతో మంది సాధించలేని పతకాన్ని గెలుచుకున్న ఆనందం దక్కించుకున్న శ్రీజేశ్‌.. ఇప్పుడు పారిస్‌ ఒలింపిక్స్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని రిటైర్‌ కాబోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న పురస్కారాలు పొందిన శ్రీజేశ్‌ పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకున్నాడు. అతని ఘనతలకు కేరళ ప్రభుత్వం తగిన గౌరవాన్నిస్తూ ఎర్నాకుళంలోని అతని స్వస్థలం కిజకంబాలమ్‌లో ఒక రోడ్డుకు ‘ఒలింపియన్‌ శ్రీజేశ్‌ రోడ్‌’ అని పేరు పెట్టడం విశేషం. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement