Sreejesh
-
హెడ్ కోచ్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో...
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్‌కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్‌గా, రోహిత్‌ను వైస్ కెపె్టన్‌గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్‌లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను 19న జపాన్‌తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది. భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్‌జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్వీందర్, అన్మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్‌రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్. -
PR Sreejesh: జెర్సీ నంబర్ 16కు వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. శ్రీజేశ్కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు. ‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు. -
PR Sreejesh: అలా సాగిన ప్రయాణం.. చివరికి భారత అత్యుత్తమ గోల్ కీపర్‌గా..
ఆ అబ్బాయి ముందుగా అథ్లెటిక్స్ను ఇష్టపడ్డాడు.. అందుకే స్ప్రింట్స్‌తో మొదలు పెట్టాడు.. కానీ కొద్ది రోజులకే అది బోర్ కొట్టేసింది.. దాంతో లాంగ్‌జంప్ బాగుంటుందనుకొని సాధన చేశాడు..తర్వాత అదీ నచ్చలేదు. ఈసారి కొత్తగా ప్రయత్నిద్దామని వాలీబాల్ వైపు వెళ్లాడు.. తనకంటే పెద్దవారైన కజిన్స్లో ఎక్కువ మంది వాలీబాల్ ఆడుతుండటంతో అది ఆకర్షించింది. ఈసారీ అదే తంతు. ఇక్కడ కూడా తాను ఆశించిన ఆనందం దక్కలేదు. అతనొక్కడే కాదు.. కేరళలో చాలామందికి ఇది అనుభవమే!అక్కడ పిల్లలంతా ఏదో ఒక ఆట ఆడుతూనే ఉంటారు. అన్ని ఆటల్లో తమ ప్రయత్నమేదో చేస్తూనే ఉంటారు. ప్రొఫెషనల్స్‌గా మారాలనో, లేక పైస్థాయికి చేరి గొప్ప ఆటగాళ్లుగా గుర్తింపు పొందాలనో కాదు.. అక్కడి సంస్కృతి అలాంటిది. ఆటల్లో వారికి ఆనందం కనిపిస్తుంది. ఆ కుర్రాడు కూడా అలాగే అన్ని ప్రయత్నాలూ చేస్తూ చివరకు 12వ ఏట తన అసలు మజిలీకి చేరుకున్నాడు. క్రీడాపాఠశాలలో చేరిన తర్వాత అతను పీఈటీ సూచన మేరకు హాకీని ఎంచుకున్నాడు. హాకీ ఆడితే ఎక్కడా ఉద్యోగం కూడా రాదని కొందరు పెద్దలు చెప్పినా.. అతను పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికి ఆ ఆట నచ్చింది.కొన్నాళ్ల శిక్షణ తర్వాత హాకీలో తనకు గోల్ కీపింగ్ ఇంకా నచ్చింది. దాంతో పూర్తిస్థాయిలో గోల్ కీపర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సాగిన ప్రయాణం భారత అత్యుత్తమ గోల్ కీపర్‌గా, ప్రపంచ హాకీలో అత్యుత్తమ గోల్ కీపర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకునే వరకు సాగింది. అతనే పరట్టు రవీంద్రన్ (పీఆర్) శ్రీజేశ్. సుదీర్ఘకాలంగా భారత హాకీ వెన్నెముకగా ఉంటూ పలు గొప్ప విజయాల్లో భాగంగా ఉన్న శ్రీజేశ్ ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్ తర్వాత ఆట నుంచి తప్పుకోనున్నాడు. తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నాడు.శ్రీజేశ్లో ప్రతిభను గుర్తించిన కోచ్‌లు జయకుమార్, రమేశ్ కొలప్ప ముందుగా అతడిని హాకీ వైపు, ఆ తర్వాత పూర్తి స్థాయిలో గోల్ కీపింగ్‌ను ఎంచుకోవడం వైపు మళ్లించారు. తిరువనంతపురంలోని జీవీ రాజా స్పోర్ట్స్ స్కూల్ వారి కేంద్రం. అక్కడే ఓనమాలు నేర్చుకున్న శ్రీజేశ్ ఇప్పటికీ వారి పట్ల తన కృతజ్ఞతను చాటుతుంటాడు. ‘వారిద్దరు నాకు హాకీ నేర్పించారు. దాంతో పాటు ఇతర అంశాల వైపు మనసు మళ్లకుండా పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేలా చేశారు. అన్నింటినీ మించి వారు ఇచ్చిన ఒక సలహా నా కెరీర్ ఆసాంతం పాటించాను.గోల్ కీపర్ కష్టాన్ని ఎవరూ గుర్తించరు. ఒక జట్టు గెలుపు, ఓటముల మధ్య అతనుంటాడు. కానీ గెలిస్తే అందరిలో ఒకడిగా చూస్తారు. ఓడితే మాత్రం తప్పు మొత్తం అతనిదే అంటూ కీపర్‌ను విలన్‌గా మారుస్తారు అని చెప్పారు. ఇది నేనెప్పటికీ మరచిపోలేను’ అని శ్రీజేశ్ చెప్పుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్లో సహజంగానే అప్పుడప్పుడు వైఫల్యాలు ఉన్నా.. గోల్ కీపర్ స్థానంలో అడ్డుగోడలా నిలబడి శ్రీజేశ్ అందించిన విజయాలెన్నో! ముఖ్యంగా అతి కీలక సమయాల్లో కూడా భావోద్వేగాలను ప్రదర్శించకుండా ప్రశాంతంగా ఉండే అతని శైలి ఇలాంటి విజయాలకు కారణమైంది.జూనియర్‌గా సత్తా చాటి..భారత హాకీ జట్టులో దాదాపుగా ఆటగాళ్లందరూ జూనియర్ స్థాయిలో మంచి ప్రదర్శన తర్వాత సీనియర్‌కు ప్రమోట్ అయినవారే. శ్రీజేశ్ కూడా అలాంటివారిలో ఒకడు.16 ఏళ్ల వయసులో అతను ఇండియా అండర్–21 టీమ్‌లో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటించాడు. అంతకు ముందు జాతీయ స్థాయిలో పాఠశాలల కోసం నిర్వహించే నెహ్రూ కప్‌లో సత్తా చాటడంతో అతనికి ఆ అవకాశం దక్కింది. నాలుగేళ్ల పాటు భారత జూనియర్ జట్టు తరఫున నిలకడగా రాణించిన శ్రీజేశ్ భారత్ ఆసియా కప్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించి.. బెస్ట్ గోల్ కీపర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డునూ గెలుచుకున్నాడు. అయితే ఒకవైపు జూనియర్ టోర్నీల్లో ఆడుతూండగానే 18 ఏళ్ల వయసులో భారత సీనియర్ జట్టులోకి శ్రీజేశ్ ఎంపికయ్యాడు. 2006 దక్షిణాసియా (శాఫ్) క్రీడల్లో అతను మొదటిసారి భారత సీనియర్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు.పోటీని తట్టుకొని..శ్రీజేశ్ జట్టులోకి వచ్చేనాటికి ఇద్దరు సీనియర్ గోల్ కీపర్లు ఏడ్రియన్ డిసూజా, భరత్ ఛెత్రి టీమ్‌లో పాతుకుపోయారు. వారిని దాటి అవకాశం దక్కడం అంత సులువు కాదు. దాంతో అప్పుడప్పుడు ఒక్కో మ్యాచ్ దక్కడం మినహా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడే అవకాశమే రాలేదు. కానీ తన వంతు కోసం ఎదురు చూడటం మినహా ఏం చేయలేని పరిస్థితి. అయితే ప్రతి క్రీడాకారుడి కెరీర్లో ఒక కీలక మలుపు వస్తుంది. అలాంటి అవకాశం లభించినప్పుడు దానిని రెండు చేతులా సమర్థంగా ఒడిసిపట్టుకున్నవాడే పైకి ఎదుగుతాడు.శ్రీజేశ్కు అలాంటి చాన్స్ 2011లో చైనాలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను నిలువరించి అతను జట్టును గెలిపించాడు. దాంతో అందరి దృష్టీ అతనిపై పడింది. శ్రీజేశ్ గోల్ కీపింగ్ నైపుణ్యం గురించి కూడా ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది. ఎప్పుడూ భారత జట్టు మ్యాచ్ ఆడినా ప్రాధాన్య క్రమంలో తొలి అవకాశం శ్రీజేశ్కే దక్కేది. ఆ తర్వాతే మరో గోల్ కీపర్ ఎవరైనా ఉంటే సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగేవాడు.వరుస ఘనతలు..2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శనతో.. ఆడిన మూడు మ్యాచ్‌లనూ ఓడింది. దాంతో హాకీ ఇండియా సమూల మార్పులతో సిద్ధమైంది. సీనియర్లను వదిలి ఈ సంధి దశలో యువకులతో నిండిన టీమ్‌ను సిద్ధం చేసింది. వీరిలో అందరికంటే ముందు వరుసలో ఉన్న శ్రీజేశ్.. జట్టుకు కీలకంగా మారాడు. ఆపై అతని స్థాయిని పెంచిన టోర్నీ 2013 ఆసియా కప్ వచ్చింది. భారత్ రన్నరప్‌గా నిలిచిన ఈ టోర్నీలో బెస్ట్ గోల్ కీపర్‌గా అతను అవార్డు అందుకున్నాడు. తర్వాతి ఏడాది ఆసియా క్రీడల్లో మరో అద్భుత ప్రదర్శన అతడి నుంచి వచ్చింది.పాకిస్తాన్లో జరిగిన ఫైనల్లో అతను రెండు పెనాల్టీ స్ట్రోక్‌లను ఆపి జట్టుకు స్వర్ణపతకాన్ని అందించాడు. ఈ ప్రపంచ హాకీలో ప్రతిష్ఠాత్మక టోర్నీగా పరిగణించే చాంపియన్స్ ట్రోఫీలో శ్రీజేశ్ రెండుసార్లు అత్యుత్తమ గోల్ కీపర్‌గా నిలిచాడు. 2015 హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ పోటీల్లో మూడో స్థానం సాధించడంలో కూడా కీపర్‌గా అతనికి ప్రధాన పాత్ర. 33 ఏళ్ల భారత జట్టు సాధించిన తొలి అంతర్జాతీయ పతకం ఇదే కావడం విశేషం. ఈ టోర్నీలో శ్రీజేశ్ చూపించిన గోల్ కీపింగ్ ప్రదర్శన అసమానం. అసాధారణ రీతిలో కొన్ని పెనాల్టీ కార్నర్లు, స్ట్రోక్‌లను ఆపిన అతను పెనాల్టీ షూటౌట్లో నెదర్లండ్స్ వంటి నంబర్‌వన్ జట్టును నిలువరించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది.ఒలింపిక్స్ పతకాన్ని ముద్దాడి..భారత హాకీ చరిత్రలో నిస్సందేహంగా అత్యుత్తమ గోల్‌కీపర్‌గా శ్రీజేశ్ నిలుస్తాడు. పంజాబ్, హరియాణాలాంటి ఉత్తరాది జట్ల ఆటగాళ్లు శాసించే క్రీడలో ఒక కేరళ ఆటగాడు ఎదిగిన తీరు ఎంతో ప్రత్యేకం. 18 ఏళ్ల కెరీర్, 300కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు, నాలుగు ఒలింపిక్స్ అసాధారణం. చాంపియన్స్ ట్రోఫీలో రెండు రజతాలు, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు, కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రెండు రజతాలు, ఆసియా కప్‌లో రజతం, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో నాలుగు స్వర్ణాలు, రజతం గెలుచుకున్న భారత జట్లలో శ్రీజేశ్ సభ్యుడు. కానీ ఎన్ని గెలిచినా ఒక ఆటగాడి కల ఒలింపిక్స్ పతకం. 2016 రియో ఒలింపిక్స్‌లో శ్రీజేశ్ కెప్టెన్సీలో జట్టు క్వార్టర్ ఫైనల్ వరకు రాగలిగింది.అయితే అసలు అద్భుతం 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జరిగింది. మన ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో కాంస్యం సాధించి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టుకు ఒలింపిక్స్‌లో పతకాన్ని అందించారు. ఇక్కడా శ్రీజేశ్దే ప్రధాన పాత్ర. జర్మనీతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో అతని గోల్ కీపింగ్‌ను చూస్తే ఈ పతకం విలువేమిటో తెలుస్తుంది. తమకంటే సీనియర్లు ఎంతో మంది సాధించలేని పతకాన్ని గెలుచుకున్న ఆనందం దక్కించుకున్న శ్రీజేశ్.. ఇప్పుడు పారిస్ ఒలింపిక్స్‌తో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొని రిటైర్ కాబోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తరఫున అర్జున, ఖేల్‌రత్న పురస్కారాలు పొందిన శ్రీజేశ్ పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకున్నాడు. అతని ఘనతలకు కేరళ ప్రభుత్వం తగిన గౌరవాన్నిస్తూ ఎర్నాకుళంలోని అతని స్వస్థలం కిజకంబాలమ్లో ఒక రోడ్డుకు ‘ఒలింపియన్ శ్రీజేశ్ రోడ్’ అని పేరు పెట్టడం విశేషం. – మొహమ్మద్ అబ్దుల్ హాది -
భారత హాకీ క్రీడాకారులకు అంతర్జాతీయ పురస్కారాలు
Harmanpreet Singh, Gurjit Kaur Win FIH Awards: అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) స్టార్స్ అవార్డ్స్ 2020-21లో భారత్ ఆధిపత్యం చెలాయించింది. పురుషులు, మహిళల విభాగాల్లో నలుగురు క్రీడాకారులు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. వీరితో డ్రాగ్ ఫ్లికర్స్ హర్మన్ ప్రీత్ సింగ్, గుర్జిత్ కౌర్‌లు "ప్లేయర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను గెలుచుకోగా.. పీఆర్ శ్రీజేష్, సవితా పునియాలు "ఉత్తమ గోల్ కీపర్ ఆఫ్ ది ఇయర్" అవార్డులను దక్కించుకున్నారు. కాగా, భారత పురుషుల, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌లో అబ్బురపడే ప్రదర్శనతో అలరించిన సంగతి తెలిసిందే. పురుషుల జట్టు 41 సంవత్సరాల ఒలింపిక్ పతకాల కరువుకు తెరదించుతూ.. జర్మనీపై 5-4 గోల్స్‌తో విజయం సాధించి కాంస్య పతకం నెగ్గింది. మహిళల జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. చదవండి: ఒమన్‌లో తుఫాను బీభత్సం.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లపై ప్రభావం..! -
రాజీవ్ ఖేల్‌రత్న: హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరు నామినేట్
న్యూఢిల్లీ: రాజీవ్ ఖేల్‌రత్న అవార్డ్‌కు హాకీ గోల్‌కీపర్ శ్రీజేష్ పేరును నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. అదే విధంగా.. హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైం అవార్డుకు డాక్టర్ ఆర్పీ సింగ్, సంగాయి ఇబెంహాల్ పేర్లను ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి బీజే కరియప్ప, సీఆర్ కుమార్ పేర్లను నామినేట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్ సింగ్, వందనా కటారియాతో పాటు నవజోత్ కౌర్ పేర్లను ప్రతిపాదించింది. చదవండి: 2 డజన్లకు పైగా పతకాలు.. రోడ్డు పక్కన చిప్స్ అమ్ముతూ -
‘ఖేల్‌రత్న’కు శ్రీజేశ్
న్యూఢిల్లీ: భారత పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ పేరును... దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న’కు నామినేట్ చేస్తున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది. మరోవైపు మిడ్‌ఫీల్డర్ చింగ్లెన్సనా సింగ్, ఫార్వర్డ్ ఆకాశ్ దీప్ సింగ్... మహిళా జట్టు డిఫెండర్ దీపిక పేర్లను ‘అర్జున అవార్డు’కు ప్రతిపాదించారు. ఆర్పీ సింగ్, సందీప్ కౌర్ పేర్లను జీవితసాఫల్య పురస్కారం ‘ధ్యాన్‌చంద్’ అవార్డుకు... బల్జీత్ సింగ్, బీఎస్ చౌహాన్, రమేశ్ పథానియా పేర్లను ‘ద్రోణాచార్య’ అవార్డులకు నామినేట్ చేశారు. 2006లో దక్షిణాసియా క్రీడల్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన శ్రీజేశ్ ఇప్పటివరకు 200 కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం... 2018 ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన భారత జట్లకు శ్రీజేశ్ గోల్‌కీపర్‌గా వ్యవహరించాడు. రెండు ప్రపంచకప్‌లలో, రెండు ఒలింపిక్స్‌లో కూడా అతను పాల్గొన్నాడు. -
‘మన సైనికుల కోసం పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తాం’
బెంగళూరు: ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ అన్నాడు. మలేసియాలో వచ్చే నెల 20 నుంచి 30 జరగనున్న టోర్నమెంట్ లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. కశ్మీర్ లోని ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ కు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ ఘటన గురించి ప్రస్తావించకుండానే శ్రీజేష్ పలు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ హాకీ టీమ్ చేతిలో ఓడిపోయి భారత సైనికులను నిరాశ పరచాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. ‘భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే అందరూ ఆసక్తిగా చూస్తారు. మేము వందశాతం కష్టపడతాం. ఓడిపోయి మన సైనికులను నిరుత్సాహపరచం. దేశ సరిహద్దులో ఎదురుకాల్పుల్లో ప్రాణాలర్పించిన సైనికుల కోసమేనా గెలుస్తామ’ని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పాకిస్థాన్ హాకీ జట్టు ప్రస్తుతం దిగువస్థాయి ఆటతీరు కనబరుస్తోందని, తొలిసారిగా ఒలింపిక్స్ కు అర్హత సాధించలేకపోయిందని తెలిపాడు. అయితే తనదైన రోజున ఏ జట్టునైనా ఓడించే సత్తా పాక్ టీమ్ ఉందన్నాడు. ఆసియన్ చాంపియన్స్ ట్రోఫిలో మలేసియా, కొరియా జట్లను తక్కువగా అంచనా వేయడానికి లేదని శ్రీజేష్ పేర్కొన్నాడు. -
శ్రీజేష్‌కు భారత హాకీ పగ్గాలు
మహిళల జట్టుకు సుశీలా చాను నాయకత్వం న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత పురుషుల, మహిళల జట్లను హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా ప్రకటించారు. సర్దార్ సింగ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి సీనియర్ గోల్ కీపర్ శ్రీజేష్‌కు నాయకత్వం అప్పగించారు. అయితే తుది జట్టులో మాత్రం తను చోటు దక్కించుకున్నాడు. ఇటీవలి చాంపియన్స్ ట్రోఫీలో శ్రీజేష్ నేతృత్వంలోనే భారత్ రజతం సాధించింది. సునీల్ వైస్‌కెప్టెన్‌గా ఉంటాడు. ‘కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో సర్దార్ ఒలింపిక్స్‌లో విశేషంగా రాణిస్తాడని నమ్ముతున్నాను. కెప్టెన్సీ నుంచి తప్పుకునే నిర్ణయం సర్దారే తీసుకున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తరహా ఆటతీరునే ఒలింపిక్స్‌లోనూ ప్రదర్శిస్తాం’ అని కోచ్ ఓల్ట్‌మన్స్ తెలిపారు. అలాగే జట్ల ప్రకటనతో పాటు ఆటగాళ్ల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ హాకీ బృందానికి దేశం తరఫున, ప్రధాని మోదీ తరఫున శుభాకాంక్షలు అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రీడా మంత్రి విజయ్ గోయల్, అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు లియాండ్రో నెగెరే, బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సాయ్ డీజీ ఇంజేటి శ్రీనివాస్, ఐఓఏ ప్రధాన కార్యదర్శి, రాజీవ్ మెహతా, మాజీ హాకీ ఒలింపియన్స్ పాల్గొన్నారు. రీతూ రాణిపై వేటు: మరోవైపు మహిళల జట్టుకు చాలాకాలంగా కెప్టెన్‌గా కొనసాగుతున్న రీతూ రాణిపై ఊహించినట్టుగానే వేటు పడింది. సుశీలా చాను తన స్థానంలో సారథిగా వ్యవహరించనుంది. క్రమశిక్షణాచర్యల కింద రీతూపై హాకీ ఇండియా చర్యలు తీసుకుంది. 1980 మాస్కో గేమ్స్‌లో చివరిసారిగా మహిళల జట్టు ఒలింపిక్స్‌లో పాల్గొంది. పురుషుల జట్టు: శ్రీజేష్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్, రూపిందర్‌పాల్, కొతజిత్ సింగ్, సురేందర్, మన్‌ప్రీత్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్కే ఉతప్ప, డానిష్ ముజ్తబా, దేవిందర్ వాల్మీకి, ఎస్వీ సునీల్, ఆకాశ్‌దీప్, చింగ్లెన్సన, రమణ్‌దీప్, తిమ్మయ్య. మహిళల జట్టు: సుశీలా చాను (కెప్టెన్), నవ్‌జ్యోత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, మోనిక, నిక్కీ ప్రధాన్, అనురాధ దేవి, సవిత, పూనమ్ రాణి, వందన, దీపికా, నమిత, రేణుకా యాదవ్, సునీత లక్రా, రాణి రాంపాల్, ప్రీతి దూబే, లిలిమ మింజ్. -
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
-
హాకీ కెప్టెన్ ను మార్చేశారు..
న్యూఢిల్లీ: వచ్చే నెలలో బ్రెజిల్ లో జరుగనున్న రియో ఒలింపిక్స్ కు వెళ్లే భారత హాకీ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకూ పురుషుల హాకీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న సర్దార్ సింగ్ ను ఆ పదవి నుంచి తప్పిస్తూ హాకీ ఇండియా(హెచ్ఐ) నిర్ణయం తీసుకుంది. వెటరన్ ఆటగాడైన సర్దార్ సింగ్ ను రియో స్క్వాడ్ లో ఎంపిక చేయగా, కెప్టెన్సీని నుంచి తొలగించారు. అతని స్థానంలో 28 ఏళ్ల శ్రీజేష్ రవీంద్రను కెప్టెన్ గా నియమించారు. ఈ మేరకు మంగళవారం రియోకు వెళ్లే 16 మందితో కూడిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లను హాకీ ఇండియా ప్రకటించింది. తాజా ఎంపికలో డిఫెండర్ బరిందర్ లక్రాకు చోటు దక్కలేదు. బరిందర్ గాయపడటంతో అతని స్థానంలో సురిందర్ కుమార్ కు అవకాశం కల్పించారు. మరోవైపు ఎస్ వి సునీల్ వైస్ కెప్టెన్ గా నియమించారు. ఇదిలా ఉండగా, మహిళల హాకీ జట్టు నుంచి రీతూ రాణిని తొలగించారు.చాలాకాలంగా భారత మహిళ హాకీ జట్టుకు కెప్టెన్ గా చేస్తున్న రీతూనూ రియోకు వెళ్లే జట్టులో స్థానం కల్పించలేదు. గత కొంతకాలంగా రీతూ ప్రదర్శనతో పాటు ప్రవర్తన కూడా సరిగా లేకపోవడంతో ఆమెపై వేటు వేశారు. రీతూ స్థానంలో సుశీల్ చానుకు కెప్టెన్ గా నియమించారు. భారత పురుషుల హాకీ స్క్వాడ్ ; శ్రీజేష్ రవీందర్(కెప్టెన్), ఎస్ వి సునీల్( వైస్ కెప్టెన్), హర్మన్ ప్రీత్ సింగ్, రూపేందర్ పాల్ సింగ్, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, మన్ ప్రీత్ కుమార్, సర్దార్ సింగ్, వీఆర్ రఘునాథ్, ఎస్ కే ఉతప్ప, దనిష్ ముజ్ తాబా, దేవేందర్ వాల్మికీ, అక్షదీప్ సింగ్, చింగ్లేన్ సానా సింగ్, రమణ్ దీప్ సింగ్, నిఖి తిమ్మయ్య స్టాండ్ బై: ప్రదీప్ మోర్, వికాష్ దాహియా భారత మహిళల హాకీ స్క్వాడ్: సుశీల్ చాను(కెప్టెన్), దీపికా(వైస్ కెప్టెన్), దీప్ గ్రీస్ ఎక్కా, నమితా తొప్పో, సునీతా లక్రా, నవజోత్ కౌర్, మోనికా, రేణుకా యాదవ్, లిలిమా మింజ్, అనురాధా దేవి, పూనమ్ రాణి, వందనా కటారియా, ప్రీతి దుబే, నిక్కీ ప్రధాన్ స్టాండ్ బై: రజని ఎతిమార్పు, లాల్ రౌత్ ఫెలీ