భారత గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ గౌరవార్థం హాకీ ఇండియా నిర్ణయం
న్యూఢిల్లీ: భారత దిగ్గజ గోల్‌కీపర్ శ్రీజేశ్ ఇకపై హాకీ మైదానంలో కనిపించడు. అలాగే అతని జెర్సీ నంబర్ 16 కూడా కనిపించదు. గోల్‌పోస్ట్ ముందు ప్రత్యర్థులకు అడ్డుగోడలా నిలబడి భారత జట్టుకు విశేష సేవలందించిన శ్రీజేశ్ ఘనకీర్తికి గుర్తుగా ఆ జెర్సీకి అతనితోపాటే రిటైర్మెంట్ ఇవ్వాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ) నిర్ణయించింది. బుధవారం ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు.
శ్రీజేశ్‌కు రూ. 25 లక్షల నగదు పురస్కారం చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్ టిరీ్క, భోళానాథ్ సింగ్‌లు మాట్లాడుతూ శ్రీజేశ్‌ను ఆకాశానికెత్తారు. ఆధునిక భారత హాకీకి అతనొక దేవుడని కితాబిచ్చారు. భారత సీనియర్ పురుషుల జట్టులో 16వ నంబర్ జెర్సీని ఎవరికీ కేటాయించబోమని భోళానాథ్ చెప్పారు.
‘శ్రీజేశ్ త్వరలోనే జూనియర్ భారత జట్టు కోచ్‌గా వెళతారు. ఘనమైన కెరీర్‌కు అతను వీడ్కోలు పలికితే ... హాకీ ఇండియా అతని ఘనకీర్తికి గుర్తుగా జెర్సీ నంబర్ 16కు రిటైర్మెంట్ ఇచ్చింది. అయితే ఇది సీనియర్ స్థాయికే పరిమితం. జూనియర్ జట్టులో 16వ జెర్సీ యథాతథంగా కొనసాగుతుంది’ అని ఆయన వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment