వెదురుతో చేసిన విల్లు, బాణాలు.. అడవిలో సరదాగా పోటీలు.. చెట్టుకు కట్టిన మూటను సరిగ్గా గురి చూసి కొడితే బహుమతిగా బెల్లం..15 ఏళ్ల వయసు వచ్చే సరికి కూడా అతనికి అదే జీవితం.. ఏనాడూ అతను తన విలువిద్యతో ఊరు దాటగలనని, అంతర్జాతీయ స్థాయికి చేరగలనని ఊహించలేదు. కానీ ఆ కుర్రాడి అపార ప్రతిభకు అనూహ్యమైన గుర్తింపు లభించింది. దొరికిన అరుదైన అవకాశాన్ని ఒడుపుగా అంది పుచ్చుకున్న అతను తన తరంలో ఆర్చరీ క్రీడకు ఏకైక చిరునామాగా నిలిచాడు.
సరైన మార్గనిర్దేశనంతో అతను ఏకంగా ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగాడు. మన దేశంలో ఆర్చరీ అప్పుడే తొలి అడుగులు వేస్తున్న సమయంలో టార్చ్ బేరర్‌గా మారి తర్వాతి రోజుల్లో భారత్‌లో ఆర్చరీ అభివృద్ధికి ఒక ఆటగాడిగా దారి చూపించాడు. ఒక దశలో ఆ క్రీడలో అతని పేరు మినహా ఇంకెవరినీ.. సాధారణ క్రీడాభిమాని గుర్తు పట్టలేని స్థాయికి చేరిన ఆ వ్యక్తి లింబా రామ్. అతిసాధారణ గిరిజన నేపథ్యం నుంచి ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు పొందిన ఆర్చర్.
1987.. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి బియ్యాల పాపారావు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో ‘సాయ్’లో వేర్వేరు క్రీడాంశాల్లో శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ‘సాయ్’లో ఒక రకమైన ప్రత్యేక టైమ్‌టేబుల్‌తో పాటు అక్కడ శిక్షణ కోసం ఎంపికయ్యేందుకు దాదాపు ఒకే తరహా పద్ధతిలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. అంతా బాగానే ఉన్నా ఏదైనా కొత్తగా ప్రయత్నించాలనేది పాపారావు ఆలోచన.
సహజ ప్రతిభను వెలుగులోకి తెచ్చి తగిన రీతిలో శిక్షణ ఇస్తే సాధారణ నేపథ్యం ఉన్నవారు కూడా సత్తా చాటగలరనేది ఆయన నమ్మకం. అందుకే ఆయన దృష్టి్ట గిరి పుత్రులపై పడింది. వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం మహబూబాబాద్‌కి చెందిన వ్యక్తి కావడంతో వారి గురించి ఆయనకు అవగాహన ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ‘స్పెషల్ ఏరియా గేమ్స్’ పేరుతో కొత్త తరహా సెలక్షన్స్‌కి శ్రీకారం చుట్టారు.
ఆర్చరీలో కూడా ఇదే తరహాలో సెలక్షన్స్ జరిగాయి. అప్పటి వరకు అడవిలో విల్లు, బాణాలతో వేటకే పరిమితమైనవారికి ఇలా ఓపెన్ సెలక్షన్స్ ద్వారా అవకాశం లభించింది. కొందరు మిత్రులు ఇచ్చిన సమాచారంతో లింబా రామ్ కూడా దీనికి హాజరయ్యాడు. అతనిలోని సహజ ప్రతిభను అధికారులు గుర్తించి వెంటనే ఎంపిక చేశారు. అక్కడినుంచి లింబా రామ్ ప్రయాణం ఢిల్లీలోని ‘సాయ్’ కేంద్రానికి సాగింది. అది ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే వరకు చేరింది.
అడవి బిడ్డ నుంచి ఆర్చర్‌గా..
రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లా సరాదీత్ గ్రామం లింబా రామ్ స్వస్థలం. ఐదుగురు సంతానంలో అతనొకడు కాగా, తండ్రి వ్యవసాయ కూలీ. వారి కుటుంబం ‘అహారి’ అనే గిరిజన తెగకు చెందింది. పేదరికం కారణంగా లింబా రామ్.. తన సోదరుల్లాగే కూలీ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ.. స్నేహితులతో కలసి సరదాగా వేటకు కూడా వెళ్లేవాడు. పుట్టినప్పుడు తల్లిదండ్రులు ‘అర్జున్ రామ్’ అనే పేరు పెట్టారు. అయితే చిన్న వయసులో ఒకసారి తీవ్ర అనారోగ్యానికి గురైన అతను దాదాపు మృత్యువుకు చేరువగా వెళ్లాడు.
అదృష్టవశాత్తు కోలుకోవడంతో అర్జున్ అనే పేరు తీసేసి స్థానిక దేవత పేరు మీద ‘లింబా’ అని చేర్చారు. అలా ఆ పేరులోంచి అర్జునుడు పోయినా.. ఆ తర్వాత భవిష్యత్తులో అతను అభినవ అర్జునుడిలా బాణాలు సంధిస్తూ విలువిద్యలో నేర్పరి కావడం దైవానుగ్రహమే కావచ్చు! వెదురు బాణాలతో వేటాడటం, స్థానికంగా కొన్ని పోటీల్లో పాల్గొనడం మినహా ఆర్చరీ అనే ఒక అధికారిక క్రీడ ఉందని, అందులో విజయాలు సాధించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవచ్చనే విషయం అప్పటికి లింబా రామ్‌కి అసలు తెలీదు. అయితే ‘సాయ్’ సెలక్షన్స్ అన్నీ మార్చేశాయి.
సరైన చోట, సరైన శిక్షణతో..
స్పోర్ట్స్ అథారిటీ కేంద్రంలో కొత్త విద్యార్థిగా చేరిన లింబా రామ్‌కి అక్కడి ప్రపంచం అంతా కొత్తగా అనిపించింది. అప్పటి వరకు వెదురు విల్లుకే పరిమితమైన అతని చేతికి తొలిసారి ఆధునిక విల్లు, బాణాలు వచ్చాయి. భారత కోచ్ ఆరెస్ సోధీ పర్యవేక్షణలో శిక్షణ మొదలైంది. రష్యా కోచ్ అలెగ్జాండర్ నికొలయ్ జట్టుకి కోచ్‌గా కొత్త తరహా శిక్షణ కార్యక్రమాలను తీసుకొచ్చాడు. ‘నువ్వు ఈ ఆట కోసమే పుట్టావురా’ అంటూ సోధీ చెప్పిన మాట లింబా రామ్‌లో స్ఫూర్తి నింపి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ ఎంపికకు కారణమైన పాపారావు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని లింబా రామ్‌ని ప్రోత్సహించారు.
దాని ఫలితాలు కొన్ని నెలలకే కనిపించాయి. బెంగళూరులో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో విజేతగా నిలవడంతో లింబా రామ్‌పై అందరి దృష్టీ పడింది. ఆ తర్వాతా అదే జోరును కొనసాగించిన అతను సంవత్సరం తిరిగే లోపే జాతీయ స్థాయి సీనియర్ చాంపియన్‌గా కూడా మారాడు. దాంతో 16 ఏళ్ల వయసులోనే భారత ఆర్చరీ టీమ్‌లో లింబా రామ్‌కి చోటు దక్కింది. అప్పటి నుంచి దాదాపు దశాబ్ద కాలం పాటు భారత ఆర్చరీపై తనదైన ముద్ర వేసిన అతను ఎన్నో ఘనతలను తన ఖాతాలో లిఖించుకున్నాడు.
ప్రపంచ రికార్డు కూడా..
1989లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఆర్చరీ ప్రపంచ చాంపియన్ షిప్ తొలిసారి లింబా రామ్‌కి అంతర్జాతీయ వేదికపై గుర్తింపును అందించింది. ఈ ఈవెంట్‌లో అతను క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్లగలిగాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆసియన్ కప్‌లో చక్కటి ప్రదర్శనతో లింబా ఆకట్టుకున్నాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించడంతో పాటు టీమ్ ఈవెంట్‌లో భారత్‌కి రజతం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు.
తర్వాతి ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌కి నాలుగో స్థానం దక్కడంలో అతనిదే ప్రధాన భూమిక. మరో రెండేళ్ల తర్వాత జరిగిన ఆసియన్ ఆర్చరీ చాంపియన్ షిప్ లింబా రామ్ కెరీర్‌లో అత్యుత్తమ దశ. బీజింగ్‌లో జరిగిన ఈ పోటీల వ్యక్తిగత విభాగంలో అతను స్వర్ణం సాధించడంతో పాటు 358/360 స్కోరుతో అప్పటి ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. 1995లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ ఆర్చరీ చాంపియన్ షిప్‌లో కూడా అతను ఒక స్వర్ణం, ఒక రజతంతో మెరిశాడు. కెరీర్ చివర్లో కుర్రాళ్ల మధ్య మరోసారి జాతీయ చాంపియన్‌గా నిలిచి లింబా తన ఆటను ముగించాడు.
అచ్చిరాని మెగా ఈవెంట్..
ప్రతి క్రీడాకారుడి కెరీర్‌లో ఒలింపిక్స్ పతకం సాధించడం ఒక కల. లింబా రామ్‌కి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చినా పతకం మాత్రం దక్కలేదు. ‘ట్రిపుల్ ఒలింపియన్’గా గుర్తింపు తెచ్చుకున్నా, మూడుసార్లూ నిరాశే ఎదురైంది. 16 ఏళ్ల వయసులో తొలిసారిగా 1988 సియోల్ ఒలింపిక్స్‌లో ఆడినా.. అందులో అతని అనుభవరాహిత్యం కనిపించింది. 1992 బార్సిలోనా సమయంలోనైతే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు. తాజా వరల్డ్ రికార్డుతో అతనిపై మంచి అంచనాలూ ఉన్నాయి. తనపై మెడల్ గురించి ఉన్న ఒత్తిడిని అతను అధిగమించలేకపోయాడు. ‘నువ్వు పతకం గెలవడం ఖాయం.
ఇక్కడి నుంచే మెడలో పతకంతో తీసుకెళ్లి భారత్‌లో మా భుజాలపై ఊరేగిస్తాం’ అంటూ ఫెడరేషన్ అధికారులు పదే పదే చెబుతూ వచ్చారు. చివరకు అక్కడ నిరాశే ఎదురైంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్ సమయంలో కూడా ఆటగాడిగా మెరుగైన స్థితిలోనే ఉన్నా.. ఒలింపిక్స్ కొద్ది రోజుల ముందు ఫుట్‌బాల్ ఆడుతున్న అతని భుజానికి తీవ్ర గాయమైంది. దాని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయాడు. లింబా రామ్ ఘనతను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అర్జున, పద్మశ్రీ పురస్కారాలతో అతనిని గౌరవించింది. ఈతరం ఆధునిక ఆటగాళ్ల ప్రదర్శనలతో పోలిస్తే లింబా రామ్ సాధించిన విజయాలు తక్కువగా అనిపించవచ్చు. కానీ భారత్‌లో ఆర్చరీకి గుర్తింపు తెచ్చి కొత్త బాట చూపించినవాడిగా అతని పేరు ఎప్పటికీ నిలిచిపోంది.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment