
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్ధమాన ఆర్చర్ తానిపర్తి చికితకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్‌రావు(Jagan Mohan Rao) ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత ఆసియా జూనియర్ ఆర్చర్ కప్‌కు అర్హత సాధించింది. కోల్‌కతాలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో ఆకట్టుకొని ఆమె క్వాలిఫై అయింది.
మున్ముందు ఆమె శిక్షణ, ఇతర సన్నాహాల మొత్తం రూ.10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్‌షిప్‌ను తన వ్యక్తిగత హోదాలో అందజేస్తానని జగన్‌మోహన్‌రావు ప్రకటించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చికితకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయన చెప్పారు. ముందుగా రూ.50 వేల చెక్‌ను అందించిన ఆయన ప్రతీ నెలా రూ.15 వేల చొప్పున తమ ‘అక్షర’ విద్యాసంస్థల తరఫున ఇస్తానని ప్రకటించారు.
ఇది కూడా చదవండి
దుబాయ్: భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఐర్లాండ్‌తో సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటిన స్మృతి తాజా ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుంది.
ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాయంతో 249 పరుగులు చేసిన స్మృతి 738 ర్యాంకింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. ఈ సిరీస్‌లో స్మృతి కెప్టెన్‌గానూ ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ (773 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక బ్యాటర్ చమరి అటపట్టు (733 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో ఉంది.
భారత జట్టు తరఫున స్మృతి మాత్రమే టాప్–10లో చోటు దక్కించుకుంది. ఐర్లాండ్‌తో సిరీస్‌కు దూరమైన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్‌లో ఉండగా... కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్‌కు చేరింది. ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ ప్రతీక రావల్ 12 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక స్థానం మెరుగు పరుచుకొని నాలుగో ర్యాంక్‌లో నిలిచింది. ఆల్‌రౌండర్ల జాబితాలో దీప్తి 6వ స్థానంలో కొనసాగుతోంది.