HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్‌కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్‌సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది.
కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది.
సుప్రీంకు చేరిన పంచాయితీ
2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్‌సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది.
అందుకే అనర్హత వేటు
ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్‌గా ఉన్నందున(కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది.
ఈసారికి మర్చిపోవాల్సిందే
ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు.
అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి.
చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్‌కప్ జట్టులో!
Comments
Please login to add a commentAdd a comment