సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్‌గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది.
కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్‌లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్‌తో హైదరాబాద్ విజయం ఖాయమైంది.
ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్‌లో లీగ్ దశలో ఐదు మ్యాచ్‌ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్‌తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్‌లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్‌కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్‌లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్‌లో ‘ప్లేట్’ డివిజన్‌కు పడిపోయాయి.
2022–23 సీజన్‌లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్‌లలో తొలి మ్యాచ్‌ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. వచ్చే సీజన్‌లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి.
‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు...
‘ప్లేట్’ డివిజన్‌లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్‌లో 56 వికెట్లతో టాపర్‌గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్‌ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు.
దీంతో పాటు వచ్చే సీజన్‌లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment