
రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో టీమిండియా యువ సంచలనం, హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ తన అద్బుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్లేట్ గ్రూప్‌లో భాగంగా సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ మెరుపు సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 111 బంతులు ఎదుర్కొన్న వర్మ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలతో తిలక్ వర్మ అదరగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సిక్కింపై ఇన్నింగ్స్ 198 పరుగుల తేడాతో హైదరాబాద్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సిక్కిం.. హైదరాబాద్ బౌలర్ల దాటికి తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్ బౌలర్లలో త్యాగరాజన్ 6 వికెట్లతో సిక్కి పతనాన్ని శాసించగా.. మిలాంద్ 4 వికెట్లతో చెలరేగాడు.
అనంతరం హైదరాబాద్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 463/4 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తిలక్‌తో పాటు ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (137; 125 బంతుల్లో) కూడా సెంచరీతో సత్తాచాటాడు. అనంతరం 384 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సిక్కిం 186 పరుగులకు ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ ఈ ఏడాది రంజీ సీజన్‌లో మూడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
చదవండి: #ShoaibMalikSaniamirza: ఎల్లలు లేని ప్రేమ: స్వర్గాన్ని నరకంగా మార్చిందెవరు? ఆ రెండూ క్లిష్టమైనవే!
Comments
Please login to add a commentAdd a comment