
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ 326
విదర్భ రెండో ఇన్నింగ్స్ 56/2
రంజీ ట్రోఫీ
నాగ్‌పూర్: సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (232 బంతుల్లో 136; 13 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విదర్భతో జరుగుతున్న మాŠయ్‌చ్‌లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకోగలిగింది. ఓవర్‌నైట్ స్కోరు 90/2తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు చివరకు 91.4 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది.
తన్మయ్ ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లు మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. హిమతేజ (64 బంతుల్లో 31; 3 ఫోర్లు), వరుణ్ గౌడ్ (55 బంతుల్లో 24; 2 ఫోర్లు), రాహుల్ బుద్ధి (43 బంతుల్లో 26; 3 ఫోర్లు), తనయ్ త్యాగరాజన్ (24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ చామా మిలింద్ (38; 8 ఫోర్లు) తలా కొన్ని పరుగులు చేశారు.
వీరందరితోనూ తన్మయ్ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా... హర్‡్ష, ఆకాశ్, పార్థ్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 19.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 56 పరుగులు చేసింది. ధ్రువ్ షొరే (23), ఆదిత్య (5) ఔట్ కాగా... అథర్వ తైడె (20 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో మొహమ్మద్ సిరాజ్, రక్షణ్ రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విదర్భ... హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది.
మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు... జట్టు ఆటతీరును ప్రశంసించారు. ఈ సీజన్‌లో 4 సెంచరీలు, 2 హాప్‌సెంచరీలు సాధించిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్‌కు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ రూ. 1 లక్షనగదు బహుమతిని ప్రకటించారు. ఈ సీజన్‌లో 33 వికెట్లు తీసిన తనయ్ త్యాగరాజన్, కెప్టెన్ చామా మిలింంద్, టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్‌ను జగన్‌మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment