శరీరాన్ని విల్లులా వంచుతూ వాల్ట్‌పై ఆమె చేసే విన్యాసాలకు ప్రపంచం అచ్చెరువొందింది.. ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చినప్పుడు అభిమానగణం జేజేలు కొట్టింది.. బ్యాలెన్స్ బీమ్‌పై ఆ అమ్మాయి ఆట క్షణాల పాటు అందరి గుండెలు ఆగిపోయేలా చేసిన ఘట్టాలు ఎన్నో! ఆమె బరిలోకి దిగితే చాలు పతకాల పంట పండుతుంది... ఎవరికీ సాధ్యం కాని రికార్డులు కొత్తగా వచ్చి చేరతాయి. ఇదీ అదీ అని లేకుండా తన ఆటతో 27 ఏళ్ల వయసులోనే జిమ్నాస్టిక్స్ ప్రపంచంలో అన్ని ఘనతలను అందుకున్న ఆ స్టార్ పేరే సిమోన్ బైల్స్! దశాబ్దకాలానికి పైగా జిమ్నాస్టిక్స్ అంటే ఆమె మాత్రమే అనేలా గుర్తింపు తెచ్చుకోవడం బైల్స్‌కు మాత్రమే చెల్లింది. కేవలం 4 అడుగుల 8 అంగుళాల ఎత్తుతోనే బైల్స్ సంచలనాలు సృష్టించగలిగింది.
పారిస్ ఒలింపిక్స్ తర్వాత ‘సిమోన్.. నేను మీ అమ్మను. నన్ను క్షమించవా! గతం మరిచి నన్ను ఒక్కసారైనా కలుస్తావని ఆశిస్తున్నా..’ ఒక 52 ఏళ్ల మహిళ ఆవేదనతో బహిరంగంగా వెల్లడించిన కోరిక ఇది. ఆమె ఎవరో కాదు. దిగ్గజ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్‌కు కన్నతల్లి షెనాన్. 27 ఏళ్ల తర్వాత ఆమెకు ఇప్పుడు కూతురు గుర్తుకొచ్చింది. ఇన్నేళ్లలో ఆమె బైల్స్‌ను ఏ ఒక్క రోజూ గుర్తుచేసుకున్న పాపాన పోలేదు. పసిగుడ్డుగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్లిపోయింది.
తాత పెంపకంలో..
షెనాన్ నలుగురు పిల్లల్లో బైల్స్ మూడో సంతానం. అయితే మరో పాప పుట్టాక షెనాన్ ఆల్కహాల్‌కు, డ్రగ్స్‌కు బానిసైంది. నలుగురు పిల్లలను అనాథాశ్రమంలో వదిలేసి వెళ్లిపోయింది. కొంతకాలం వరకు ఈ నలుగురు పిల్లల ఆచూకీ ఎవరికీ తెలియలేదు. ఎట్టకేలకు బైల్స్ తాత రాన్ (తల్లి షెనాన్ తండ్రి)కి వారి గురించి సమాచారం అందింది. దాంతో రాన్, ఆయన రెండో భార్య నెలీ కలసి బైల్స్, ఆమె చెల్లెలు ఏడ్రియాను, ఇద్దరు పెద్ద పిల్లలను రాన్ సోదరి దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇప్పటికీ వారినే బైల్స్ తన అమ్మానాన్నలుగా పిలుస్తుంది.
సాధనమున పనులు..
జిమ్నాస్టిక్స్‌లో బైల్స్ దిగ్గజంగా ఎదగడం వరకు రాన్, నెలీ ఎంతో ప్రోత్సహించారు. ఆరేళ్ల వయసులో టెక్సస్‌లో తమ ఇంటి సమీపంలో వారు సరదాగా సెలవుల్లో సిమోన్‌ను జిమ్నాస్టిక్స్‌లో చేర్పించారు. కానీ ఆమె ఆ వయసులోనే ఆటపై అమితాసక్తి కనబరుస్తూ ఒక్క క్లాస్‌కు కూడా గైర్హాజరు కాలేదు. అనారోగ్యంతో ఇంట్లో కూర్చోమని చెప్పినా సరే వెళ్లాల్సిందేనని పట్టుబట్టేది. తర్వాత ఆమెను పూర్తి స్థాయిలో జిమ్నాస్టిక్స్ శిక్షణ వైపు మళ్లించారు. ఎనిమిదేళ్ల వయసులో అమెరికాలో ప్రముఖ కోచ్‌లలో ఒకరైన ఐమీ బూర్మన్ వద్ద ట్రైనింగ్ మొదలు పెట్టిన బైల్స్ మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు బైల్స్ స్కూల్ చదువుకు గుడ్‌బై చెప్పి హోమ్ స్కూలింగ్ వైపు మళ్లింది.
జూనియర్‌గా రాణించి..
బూర్మన్ శిక్షణలో రాటుదేలిన బైల్స్ జూనియర్ స్థాయిల్లో పోటీల్లో పాల్గొంటూ తన సత్తాను ప్రదర్శించేందుకు సిద్ధమైంది. ‘అమెరికన్ క్లాసిక్స్’ టోర్నీల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, అనీవెన్ బార్స్.. ఇలా జిమ్నాస్టిక్స్‌లో ఉండే వేర్వేరు ఈవెంట్లన్నింటిలోనూ బైల్స్ విన్యాసాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఈ క్రమంలో అమెరికా జాతీయ జూనియర్ టీమ్‌లోనూ ఎంపికైంది. నిలకడైన ప్రదర్శనతో 16 ఏళ్ల వయసులో తొలిసారి యూఎస్ తరఫున సీనియర్ స్థాయి పోటీల్లో ఆడే అవకాశం బైల్స్‌కు దక్కింది. ఇటలీలో జరిగిన టోర్నీలో అమెరికా టీమ్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. అయితే కొద్ది రోజులకే జరిగిన మరో టోర్నీలో బైల్స్ కాలి మడమకు గాయం కావడంతో పోటీల్లో విఫలమైంది. కానీ కోలుకొని మళ్లీ జాతీయ పోటీల్లో సత్తా చాటిన బైల్స్‌కు మరో మహదావకాశం దక్కింది. అమెరికా తరఫున తొలిసారి వరల్డ్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు ఎంపికైన బైల్స్ కెరీర్ అప్పటి నుంచి శిఖరానికి చేరింది.
విశ్వ వేదికలపై..
బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్.. బెల్స్ ఖాతాలో 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం చేరాయి. ప్రతి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఇదే తరహా ప్రదర్శన. నానింగ్, గ్లాస్గో, దోహా, స్టట్‌గార్ట్, ఆంట్‌వెర్ప్.. 2013–23 మధ్య వరల్డ్ చాంపియన్‌షిప్ వేదిక మారినా, బైల్స్ ప్రదర్శనలో అదే జోరు కొనసాగింది. ఆరు చాంపియన్‌షిప్స్‌లో కలిపి ఏకంగా 23 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు. ఇక మిగిలింది మరో విశ్వ క్రీడా వేదిక ఒలింపిక్స్‌ను జయించడమే! ఇక్కడా బైల్స్ తన అద్భుత ఆటను ప్రదర్శించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 4 స్వర్ణాలు, 1 కాంస్యంతో ఆల్ రౌండర్‌గా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్ సమయానికి స్టార్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన బైల్స్ 24 ఏళ్ల వయసులో తనపై ఉన్న అంచనాల ఒత్తిడిని తట్టుకోలేక టీమ్ ఫైనల్ పోటీ నుంచి తప్పుకుంది. అయితే ఈ క్రీడల్లోనూ ఆమె ఒక రజతం, ఒక కాంస్యం గెలవగలిగింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌కు వచ్చే సరికి మళ్లీ అన్ని రకాలుగా సన్నద్ధమై, 3 స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.
అనితరసాధ్యం..
జిమ్నాస్టిక్స్‌లోని అత్యంత కఠినమైన ఈవెంట్లలోనూ అలవోకగా మార్కులు కొట్టేయడం బైల్స్‌కు మాత్రమే సాధ్యమైంది. మూడు విభాగాలు వాల్ట్, బ్యాలెన్స్ బీమ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్‌లలో ‘బైల్స్’ పేరు మీదే ప్రత్యేక అంశాలు ఉండటం ఆమె గొప్పతనానికి నిదర్శనం. అతి ఎక్కువ కాఠిన్య స్థాయి, ప్రమాద తీవ్రత ఉన్న ఈ ఎక్సర్‌సైజ్‌లను ప్రపంచంలో బైల్స్ తప్ప మరే జిమ్నాస్ట్ ప్రదర్శించలేదు. తన కెరీర్ మంచిస్థితిలో ఉన్న దశలో అమెరికా జిమ్నాస్టిక్స్ టీమ్ ఫిజీషియన్ ల్యారీ నాసెర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయంలో వెల్లడించి బైల్స్ వార్తల్లోకెక్కింది. మూడేళ్ల పాటు సహచర జిమ్నాస్ట్ స్టేసీ ఎర్విన్‌తో డేటింగ్ చేసిన బైల్స్.. గత ఏడాది అమెరికన్ ఫుట్‌బాల్ ప్లేయర్ జొనాథన్ ఓవెన్స్‌ను పెళ్లి చేసుకుంది. ఇప్పటికే మూడు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న బైల్స్.. 2028లో సొంతగడ్డపై జరిగే ఒలింపిక్స్‌లో మరిన్ని విజయాలు అందుకునే అవకాశం ఉంది. – మొహమ్మద్ అబ్దుల్ హాది
Comments
Please login to add a commentAdd a comment