తనది.. ఎదురు లేని బాణం! | The Success Story Of Deepika Kumari The All Time Great In Indian Archery | Sakshi
Sakshi News home page

తనది.. ఎదురు లేని బాణం!

Published Sun, Jul 7 2024 1:04 AM | Last Updated on Sun, Jul 7 2024 11:44 AM

The Success Story Of Deepika Kumari The All Time Great In Indian Archery

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలు.. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలు.. వరల్డ్‌ కప్‌లో స్వర్ణం, కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు స్వర్ణాలు, ఆసియా క్రీడల్లో కాంస్యం, 18 ఏళ్ల వయసులోనే తొలి సారి వరల్డ్‌ నంబర్‌ వన్‌ ర్యాంక్‌.. ఇదీ ఆమె బయోడేటా. ఇక మిగిలింది ఒలింపిక్స్‌ పతకమే. గతంలో మూడు ప్రయత్నాలు ఆమెకు తగిన ఫలితాన్నివ్వలేదు. 

కానీ  ఇప్పుడు మరింత శ్రమతో, పట్టుదలతో నాలుగోసారి ఒలింపిక్స్‌ సమరానికి ఆమె సిద్ధమైంది. దేశంలోనే వెనుకబడిన ఒక ప్రాంతం నుంచి వచ్చే దేశం గర్వించేలా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటిన ఆమె పేరే దీపికా కుమారి. భారత ఆర్చరీకి సంబంధించి ఆల్‌టైమ్‌ గ్రేట్‌. ఎన్నో విజయాలు,  మరెన్నో రికార్డులు, ఘనతలతో విలువిద్యలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని దీపికా ప్రస్థానం అసాధారణం, ఎందరికో స్ఫూర్తిదాయకం.

దీపికాకు ఆర్చరీ అనే ఒక క్రీడ ఉంటుందనే విషయం కూడా చిన్నప్పుడు తెలీదు. సహజంగానే ఆమె నేపథ్యమే అందుకు కారణం. దేశంలోని వెనుకబడిన రాష్ట్రాల్లో ఒకటైన జార్ఖండ్‌ నుంచి ఆమె వచ్చింది. రాంచీకి సమీపంలోని రాతూ చట్టీ అనే గ్రామం స్వస్థలం. తండ్రి ఆటోడ్రైవర్‌ కాగా, తల్లి నర్సుగా పని చేస్తోంది. కుమ్మరి కుటుంబ నేపథ్యం కారణంగా అప్పుడప్పుడు ఆ పనుల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేది.

చాలామంది పిల్లల్లాగే రాళ్లతో చెట్ల పైనున్న పళ్లను కొట్టడం లాంటి అల్లరి పనులు తనూ చేసేది. దీనివల్ల ఒక్కసారిగా విల్లు ఆమె చేతికి వచ్చేయలేదు. ఆ కుటుంబానికి చెందిన సమీప బంధువు ఒకరికి ఆర్చరీపై మంచి అవగాహన ఉంది. రాళ్లు విసరడంలో కూడా దీపికా కచ్చితత్వం ఆయనను ఆకర్షించింది.

దాంతో ఈమెను సానబెట్టవచ్చనే ఆలోచన వచ్చింది. అయితే సహజంగానే తండ్రి నవ్వి ఊరుకున్నాడు. నేనేంటీ, నా కూతురికి ఆటలేంటీ అంటూ వదిలేశాడు. అయితే అప్పటికే ఆర్చరీలో శిక్షణ పొందుతున్న దీపికా కజిన్‌ ఈ విషయంలో ఒప్పించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న అర్జున్‌ ముండా భార్య మీరా ముండా ఒక ఆర్చరీ కోచింగ్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. దీపికాను అక్కడకు తీసుకెళ్లి చేర్పించారు. అప్పుడు ఆమె వయసు 11 ఏళ్లు. అక్కడే అసలైన ఆర్చరీ ఆటపై ఆమెకు అవగాహన ఏర్పడింది.

2024,వరల్డ్‌ కప్‌ సిల్వర్‌ మెడల్‌తో, 2018, వరల్డ్‌ కప్‌ గోల్డ్‌ మెడల్‌తో..

టాటా అండదండలతో మలుపు..
ఆర్చరీలో ఓనమాలు నేర్చుకున్న తర్వాత దీపికా తర్వాతి మజిలీ మరో పెద్ద కేంద్రానికి మారింది. జంషెడ్‌పూర్‌లో ఉన్న టాటా ఆర్చరీ అకాడమీ దేశంలోనే అత్యుత్తమ శిక్షణ  కేంద్రం. టాటా అండదండలు, ఆర్థిక సహకారంతో ఎంతోమంది గొప్ప ఆర్చర్లుగా ఎదిగారు. ప్రతిభ ఉంటే చాలు అన్ని రకాల అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు లభించడమే కాదు, ఆటగాళ్లకు స్టైపెండ్‌ కూడా లభిస్తుంది. దీపికాకు ఇంతకంటే కావాల్సిందేముంది అనిపించింది.

తన ఆటతో అందరినీ ఆకట్టుకున్న ఆమెకు అదే సొంతిల్లు అయింది. అక్కడ మొదలైన గెలుపు ప్రస్థానం మళ్లీ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా సాగిపోయింది. టాటా అకాడమీ సభ్యురాలిగానే మరింత పదునెక్కిన దీపికా ఆట గొప్ప విజయాలను అందించింది. అంతర్జాతీయ జూనియర్, యూత్‌ స్థాయిల్లో పతకాలు సాధించడంతో అందరి దృష్టీ ఆమెపై పడింది.

అన్నీ ఘనతలే..
2010.. న్యూఢిల్లీలో ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్‌ క్రీడలు. సొంతగడ్డపై ప్రతి క్రీడాంశంలోనూ భారత ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన ఇస్తారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇదే జాబితాలో ఆర్చరీ ఫలితాలు కూడా చర్చకు తెర తీశాయి. 16 ఏళ్ల దీపికా రికర్వ్‌ విభాగంలో రెండు స్వర్ణాలతో మెరిసి తన రాకను ఘనంగా చాటింది. అటు వ్యక్తిగత, ఇటు టీమ్‌ ఈవెంట్లలో పసిడి పతకాలు ఆమె ఖాతాలో చేరాయి. రెండేళ్ల తర్వాత తొలి వరల్డ్‌ కప్‌ మెడల్‌తో ఆమె మెరిసింది.

వరుస విజయాలు దీపికాను అందరికంటే అగ్రభాగాన నిలబెట్టాయి. ఫలితంగా ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన అధికారిక ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె మొదటిసారి నంబర్‌ వన్‌గా నిలిచింది. కనీస సౌకర్యాలు కూడా లేని గ్రామం నుంచి వచ్చి కొరియా, చైనాలాంటి ఆర్చర్లతో పోటీ పడి శిఖరాన నిలిచిన క్షణం అందరూ గర్వపడేలా చేసింది. ఈ ఘనత సాధించిన రోజున తండ్రి శివ్‌చరణ్‌ చూపించిన ఆనందం, ఆయన సంబరం మాటల్లో చెప్పలేనిది.

భర్త అతాను దాస్‌తో, తల్లిదండ్రులతో..

అవార్డులు, రివార్డులు..
దీపికా ఘనతలకు సహజంగానే అన్ని వైపుల నుంచి గుర్తింపు, ప్రోత్సాహకాలు లభించాయి. అంతర్జాతీయ వేదికల్లో విజయాలు సాధించిన ఒక ప్లేయర్‌గా మాత్రమే ఆమెను అంతా చూడలేదు. పేద కుటుంబం, వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఆమెను స్ఫూర్తిగా తీసుకునేలా ఉన్న కెరీర్‌ చాలామందికి దిశను చూపించింది.

ముఖ్యంగా అమ్మాయిల కోణంలో చూస్తే ఆమె ఎదిగిన తీరు అసాధారణం. ప్రతిభ, పోరాటతత్వం, కష్టపడే లక్షణం ఉంటే విజయాలు కచ్చితంగా వస్తాయని దీపికా నిరూపించింది. వరల్డ్‌ నంబర్‌వన్‌గా ఎదిగిన ఏడాదే 2012లో కేంద్ర ప్రభుత్వం క్రీడా పురస్కారం అర్జునతో ఆమెను గౌరవించింది. ఆ తర్వాత ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు కూడా ఆమె చెంతకు చేరింది. 20 ఏళ్ల వయసులోనే పలు ఘనతలు సాధించిన దీపికాకు ప్రఖ్యాత ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ‘30 అండర్‌ 30’లో చోటు కల్పించి ఆమె ప్రత్యేకతను ప్రపంచానికి చూపించింది.

అన్నింటినీ మించి ఆమె కెరీర్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన డాక్యుమెంటరీ. దీపికా విజయగాథను పెద్ద స్థాయికి తీసుకెళ్లి చూపించాలనే సంకల్పంతో ఉరాజ్‌ బహల్, షా బహల్‌ అనే రూపకర్తలు దీపికా కెరీర్‌పై ప్రత్యేక డాక్యుమెంటరీని తయారు చేశారు. ‘లేడీస్‌ ఫస్ట్‌’ పేరుతో వచ్చిన ఈ అద్భుత డాక్యుమెంటరీలో ఆమె జీవితం, పోరాటం, విజయాల గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని పలు నగరాల్లో దీనిని ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే ప్రదర్శించడం విశేషం.

ఒకే ఒక లక్ష్యంతో..
ఐదేళ్ల క్రితం పారిస్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌లో మూడు విభాగాల్లో (వ్యక్తిగత, మిక్స్‌డ్, టీమ్‌) విభాగాల్లో దీపికా మూడు స్వర్ణాలు గెలుచుకుంది. ఇలా వరల్డ్‌ కప్‌లో ట్రిపుల్‌ గోల్డ్‌ సాధించడం ఆర్చర్‌ సత్తాకు ఉదాహరణ. కానీ తన సుదీర్ఘ కెరీర్‌లో 13వ సారి ఇలాంటి ఫీట్‌ను నమోదు చేసి అరుదైన ఆర్చర్ల జాబితాలో దీపికా  పేరు లిఖించుకుంది. ఇలా ఎన్నో రికార్డులు ఆమె ఖాతాలో చేరినా, ఒలింపిక్స్‌ పతకం మాత్రం ఇంకా లోటుగానే ఉంది.

వరుసగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లలో ఆమె పాల్గొంది. మెగా ఈవెంట్‌కు ముందు ఫామ్‌లో ఉండి, ఒక దశలో నంబర్‌వన్‌గా కూడా ఉండి అంచనాలు రేపినా, దురదృష్టవశాత్తూ వేర్వేరు కారణాలతో ఆమెకు పతకం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి  నాలుగో ప్రయత్నంలో కల నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ఇందులో ఆమెకు భర్త అతాను దాస్‌ అండగా నిలుస్తున్నాడు. సహచర ఆర్చర్, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ రజత పతక విజేత అతాను దాస్‌ను నాలుగేళ్ల క్రితం దీపికా పెళ్లి చేసుకుంది.

వీరికి వేదిక పేరుతో ఒక పాప ఉంది. సహజంగానే అమ్మగా మారిన తర్వాత ఆటకు కొంత విరామం ఇచ్చింది. ఇక ఆమె కెరీర్‌ ముగిసినట్లు అనిపించింది. అయితే రెట్టింపు సాధనతో కొన్నాళ్ల క్రితమే మళ్లీ బరిలోకి దిగి దీపికా సత్తా చాటింది. ముందుగా జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయాలతో పాటు ఇప్పుడు ఒలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. పారిస్‌పై ఆమె ఎక్కు పెట్టే బాణం సరైన లక్ష్యాన్ని చేరాలని ఆశిద్దాం. – మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement