
సాక్షి, హైదరాబాద్: జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆర్చరీ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ కాంస్య పతకం గెలిచింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఈ టోర్నీలో జ్యోతి సురేఖ 900 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానాన్ని సంపాదించింది. 18 మీటర్ల దూరం ఉన్న లక్ష్యంవైపు ఆయా ప్లేయర్లు 30 బాణాలను మూడుసార్లు చొప్పున సంధించారు.
నిర్ణీత 90 బాణాల తర్వాత సురేఖతోపాటు ఎలీసా రోనెర్ (ఇటలీ), అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా), ఆండ్రియా మునోజ్ (స్పెయిన్) 900 పాయింట్లు స్కోరు చేసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే పతకాల వర్గీకరణ కోసం కేంద్ర బిందువుపై కొట్టిన అత్యధిక షాట్‌లను లెక్కలోకి తీసుకున్నారు. ఫలితంగా ఎలీసా రోనెర్ (87)కు స్వర్ణ పతకం, అలెజాంద్రా (80) రజతం, జ్యోతి సురేఖ (79)కు కాంస్య పతకం ఖరారయ్యాయి.
ఉమామహేశ్‌కు నాలుగో స్థానం
న్యూఢిల్లీ: వరల్డ్ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ షూటర్ మద్దినేని ఉమామహేశ్ త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకున్నాడు. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఉమమహేశ్ 208.8 పాయింట్లు స్కోరు చేసి నాలుగో స్థానంలో నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment