Raphael Nadal
-
పక్కింట్లో చూసి బాధపడితే ఎలా?
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో మరోసారి తిరుగులేని ఆట ప్రదర్శిస్తూ 12వ సారి టైటిల్ నెగ్గడంతో స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 18కి చేరింది. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా రోజర్ ఫెడరర్ సాధించిన 20 గ్రాండ్‌స్లామ్‌ల ఘనతను సమం చేసేందుకు అతను రెండు ట్రోఫీల దూరంలో మాత్రమే ఉన్నాడు. ఆ రికార్డును అందుకునే అవకాశాలపై అడిగిన ప్రశ్నకు నాదల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘మన పొరుగున ఉండేవారి ఇల్లు మన ఇంటికంటే పెద్దదిగా ఉందని, వారింట్లో గార్డెన్ మనకంటే బాగుందని, వాళ్ల ఇంట్లో టీవీ మనింట్లో ఉన్న దానికంటే పెద్దదిగా ఉందని అస్తమానం అసహనంతో ఉండలేం కదా? నేను జీవితాన్ని ఆ దృష్టితో చూడను. దాని కోసం నేను ఉదయాన్నే లేచి వెళ్లి సాధన చేయను. ఫెడరర్ రికార్డును స్ఫూర్తిగా తీసుకోవడంలో తప్పు లేదు. కానీ దానిని ఎలాగైనా సాధించాలనే పిచ్చి మాత్రం నాకు లేదు’ అని స్పెయిన్ స్టార్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. -
సరిలేరు నీకెవ్వరు!
ఎర్రమట్టి కోర్టులపై తనకు తిరుగులేదని స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి నిరూపించాడు. టెన్నిస్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో 12వసారి సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో గతేడాది ఫలితమే పునరావృతం అయింది. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాదీ డొమినిక్ థీమ్‌ను ఓడించి నాదల్ చాంపియన్‌గా నిలిచాడు. పారిస్: ఊహించిన ఫలితమే వచ్చింది. ఎలాంటి అద్భుతం జరగలేదు. మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు తానేనని రాఫెల్ నాదల్ మళ్లీ చాటి చెప్పాడు. ఈ స్పెయిన్ స్టార్ రికార్డుస్థాయిలో 12వ సారి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ రాఫెల్ నాదల్ 6–3, 5–7, 6–1, 6–1తో నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 3 గంటల ఒక నిమిషంపాటు జరిగిన ఈ తుది సమరంలో నాదల్ మూడు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. 38 విన్నర్స్ కొట్టిన అతడు 31 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు థీమ్ ఏడు ఏస్‌లు సంధించి, నాదల్ సర్వీసును రెండుసార్లు బ్రేక్ చేయగలిగాడు. 31 విన్నర్స్ కొట్టిన అతడు 38 అనవసర తప్పిదాలు చేశాడు. విజేత రాఫెల్ నాదల్కు ట్రోఫీతోపాటు 23 లక్షల యూరోలు (రూ. 18 కోట్ల 8 లక్షలు), రన్నరప్ థీమ్‌కు 11 లక్షల 80 వేల యూరోలు (రూ. 9 కోట్ల 27 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. వేర్వేరు టోర్నమెంట్లలో నాలుగుసార్లు క్లే కోర్టులపై నాదల్‌ను ఓడించిన రికార్డు కలిగిన డొమినిక్ థీమ్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు వచ్చేసరికి మాత్రం చేతులెత్తేస్తున్నాడు. గతేడాది వరుసగా మూడు సెట్లలో ఓడిపోయిన థీమ్‌కు ఈసారి మాత్రం ఒక సెట్‌ను గెలిచిన సంతృప్తి మిగిలింది. ఫైనల్ తొలి సెట్లో థీమ్ ఐదో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ వెంటనే థీమ్ సర్వీస్‌ను నాదల్ బ్రేక్ చేసి స్కోరును 3–3తో సమం చేశాడు. ఎనిమిదో గేమ్‌లో మరోసారి థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఆఖరికి 12వ గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి థీమ్ సెట్‌ను 7–5తో దక్కించుకున్నాడు. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉన్న నాదల్ ఒక్కసారిగా విజృంభించాడు. థీమ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పూర్తి నియంత్రణతో ఆడుతూ మూడో సెట్లో ఒక గేమ్, నాలుగో సెట్లో ఒక గేమ్ కోల్పోయి గెలుపు ఖాయం చేసుకున్నాడు. ►1 టెన్నిస్ చరిత్రలో ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీని అత్యధికంగా 11 సార్లు గెలిచిన రికార్డు ఆస్ట్రేలియా క్రీడా కారిణి మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) పేరిట ఉంది. తాజా టైటిల్‌తో ఈ రికార్డును నాదల్ బద్దలు కొట్టాడు. ►6 నాదల్ 12 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ (2005, 2006, 2007, 2008, 2010, 2011, 2012, 2013, 2014, 2017, 2018, 2019) సాధించగా.... ఆరుసార్లు వేర్వేరు ప్రత్యర్థులపై గెలిచాడు. ఫైనల్స్‌లో ఫెడరర్‌పై నాలుగుసార్లు, జొకోవిచ్, థీమ్‌లపై రెండుసార్లు, రాబిన్ సోడెర్లింగ్, మరియానో పుయెర్టా, డేవిడ్ ఫెరర్, వావ్రింకాలపై ఒక్కోసారి గెలిచాడు. ►93 ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య. బరిలోకి దిగాక కేవలం రెండుసార్లు మాత్రమే నాదల్ (2009లో సోడెర్లింగ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లో; 2015లో జొకోవిచ్ చేతిలో క్వార్టర్ ఫైనల్లో) ఓడిపోయాడు. ►18 ఓవరాల్‌గా నాదల్ గెలిచిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ (12 ఫ్రెంచ్; 3 యూఎస్ ఓపెన్, 2 వింబుల్డన్, 1 ఆస్ట్రేలియన్ ఓపెన్). అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన రికార్డు ఫెడరర్ (20) పేరిట ఉంది. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో 82 టైటిల్స్ సాధించాడు. 12వసారి ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని అందుకుంటున్న అనుభూతిని మాటల్లో వర్ణించలేను. ఫైనల్లో ఓడిపోవడం ఎంత బాధ కలిగిస్తుందో తెలుసు. ఏనాటికైనా నువ్వు (థీమ్) ఈ టైటిల్ సాధిస్తావు. – నాదల్ -
ఫెడరర్‌పై నాదల్‌దే పైచేయి
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–2తో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై అలవోకగా గెలిచి ఈ టోర్నీలో 12వసారి ఫైనల్‌కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెడరర్‌తో ఇప్పటివరకు తలపడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించడం విశేషం. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఆరుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయగా... నాదల్ కేవలం 19 మాత్రమే చేశాడు. రెండో సెమీస్ నేటికి వాయిదా.... టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెట్‌ను థీమ్ 6–2తో నెగ్గగా... రెండో సెట్‌ను జొకోవిచ్ 6–3తో దక్కించుకున్నాడు. మూడో సెట్లో థీమ్ 3–1తో ఆధిక్యంలో ఉన్నపుడు వర్షం రావడంతో మ్యాచ్‌ను శనివారానికి వాయిదా వేశారు. -
ఫెడరర్ x నాదల్
పారిస్: తమ విజయ పరంపర కొనసాగిస్తూ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ (స్పెయిన్) 6–1, 6–1, 6–3తో ఏడో సీడ్ నిషికోరి (జపాన్)ను... మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–6 (7/4), 4–6, 7–6 (7/5), 6–4తో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)ను ఓడించారు. ఫ్రెంచ్ ఓపెన్‌లో వీరిద్దరు తలపడనుండటం 2011 తర్వాత ఇదే తొలిసారి కానుంది. ఓవరాల్‌గా వీరి ద్దరు ఫ్రెంచ్ ఓపెన్‌లో ఐదుసార్లు తలపడగా... ఐదుసార్లూ నాదల్‌నే విజయం వరించింది. మహిళల సిం గిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొహనా కొంటా (బ్రిటన్) 6–1, 6–4తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. 1983లో జో డ్యూరీ తర్వాత ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. -
క్వార్టర్స్‌లో ఫెడరర్, నాదల్
పారిస్: మూడేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొంటున్న మాజీ విజేత రోజర్ ఫెడరర్... రికార్డుస్థాయిలో 12వసారి ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న రాఫెల్ నాదల్... సెమీఫైనల్లో అమీతుమీ తేల్చుకునే దిశగా మరో అడుగు వేశారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 37 ఏళ్ల ఫెడరర్ 6–2, 6–3, 6–3తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై గెలుపొందగా... నాదల్ 6–2, 6–3, 6–3తో యువాన్ ఇగ్నాసియో లొండెరో (అర్జెంటీనా)ను ఓడించాడు. ఈ గెలుపుతో ఫెడరర్ 1991 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. 1991లో అమెరికా దిగ్గజం జిమ్మీ కానర్స్ 39 ఏళ్ల వయసులో యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరాడు. మంగళవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో తమ ప్రత్యర్థులపై గెలిస్తే ఫెడరర్, నాదల్ సెమీఫైనల్లో తలపడతారు. 5 గంటల 9 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 7–6 (8/6), 5–7, 6–4, 3–6, 8–6తో ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్ విభాగంలో పెట్రా మార్టిక్ (క్రొయేషియా), మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), జొహన కొంటా (బ్రిటన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మార్టిక్ 5–7, 6–2, 6–4తో కయి కనెపి (ఎస్తోనియా)పై నెగ్గగా... వొండ్రుసోవా 6–2, 6–0తో 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)ను బోల్తా కొట్టించింది. జొహన కొంటా 6–2, 6–4తో డొనా వెకిచ్ (సెర్బియా)పై గెలిచి ఫ్రెంచ్ ఓపెన్‌లో 36 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. చివరిసారి బ్రిటన్ తరఫున జో డ్యూరీ 1983లో ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–మరియస్ కోపిల్ (రొమేనియా) జంట 6–1, 5–7, 6–7 (8/10)తో దుసాన్ లాజోవిచ్–టిప్సరెవిచ్ (సెర్బియా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
మూడో రౌండ్లో నాదల్
పారిస్: డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో నాదల్ 6–1, 6–2, 6–4తో యానిక్ మాడెన్ (జర్మనీ)పై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–4, 6–3, 6–4తో ఆస్కార్ ఒట్టె (జర్మనీ)పై, ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 4–6, 6–4, 6–4, 6–4తో సోంగా (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–0, 6–3, 7–5తో డెలియన్ (బొలీవియా)పై గెలిచారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–1, 7–6 (7/3)తో సోరిబెస్ (స్పెయిన్)పై, రెండో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–2తో కుకోవా (స్లొవేకియా)పై, 12వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–4తో మినెల్లా (లక్సెంబర్గ్)పై గెలిచారు. దివిజ్ జంట శుభారంభం: పురుషుల డబుల్స్ విభాగంలో భారత డబుల్స్ స్టార్ ఆటగాళ్లు దివిజ్ శరణ్, రోహన్ బోపన్న జోడీలు శుభారంభం చేశాయి. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో దివిజ్–డెమోలైనర్ (బ్రెజిల్) ద్వయం 6–3, 4–6, 6–2తో ఫక్సోవిక్స్ (హంగేరి)–లిండ్‌స్టెడ్ (స్వీడన్) జోడీపై... బోపన్న–మరియస్ కోపిల్ (రొమేనియా) జంట 6–3, 7–6 (7/4)తో ఆరో సీడ్ మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)–క్లాసెన్ (దక్షిణాఫ్రికా) జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరాయి. -
రాఫెల్ నాదల్ ఖాతాలో 34వ మాస్టర్స్ సిరీస్ టైటిల్
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తొలి టైటిల్‌ను సాధించాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్లో నాదల్ తొమ్మిదోసారి చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–0, 4–6, 6–1తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)పై గెలుపొందాడు. ఈ విజయంతో నాదల్ అత్యధికంగా 34 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. విజేత నాదల్కు 9,58,055 యూరోల (రూ. 7 కోట్ల 52 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
నాదల్ ముందంజ
మాడ్రిడ్: క్లే కోర్టు కింగ్ రాఫెల్ నాదల్ మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో ముందంజ వేశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ప్రపంచ నం.2 నాదల్ 6–3, 6–3తో ఫెలిక్స్ అగర్ (కెనడా)పై వరుస సెట్లలో గెలుపొంది ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో డేవిడ్ ఫెర్రర్ 4–6, 1–6తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అనంతరం సొంతగడ్డపై ఫెర్రర్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్లో అత్యత్తమంగా ప్రపంచ నం.3 ర్యాంకుకు చేరిన ఫెర్రర్... ఓవరాల్‌గా 27 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. క్వార్టర్స్‌లో ఫెడరర్ మరోవైపు స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఈ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో ఫెడరర్ 6–0, 4–6, 7–6 (3)తో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. కెరీర్లో ఫెడరర్‌కు ఇది 1200వ విజయం కావడం విశేషం. -
జొకోవిచ్‌కు చుక్కెదురు
మోంటెకార్లో: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన తర్వాత బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా)కు నిరాశ ఎదురైంది. ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయిన ఈ సెర్బియా స్టార్... మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలోనూ సెమీస్ చేరలేకపోయాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 3–6, 6–4, 2–6తో మెద్వెదేవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. సెమీస్‌లో నాదల్ మరోవైపు 11సార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ ఈ టోర్నీలో 14వసారి సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. అర్జెంటీనా ప్లేయర్ గిడో పెల్లాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాదల్ 7–6 (7/1), 6–3తో విజయం సాధించాడు. గతంలో నాదల్ 2004 నుంచి 2012 వరకు వరుసగా ఎనిమిదిసార్లు... 2016 నుంచి 2018 వరకు వరుసగా మూడుసార్లు మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్స్ సాధించాడు. -
క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్, నాదల్
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ ఏటీపీ మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో దిగ్గజాలు రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ (స్పెయిన్) 6–3, 6–4తో సెర్బియన్ క్వాలిఫయర్ ఫిలిప్ క్రాజినొవిక్ను ఇంటిదారి పట్టించా డు. ఆరో టైటిల్ రికార్డుపై కన్నేసిన నాలుగో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)పై అలవోక విజయం సాధించాడు. నాదల్, ఫెడరర్ ఇద్దరు క్వార్టర్స్ మ్యాచ్‌ల్ని గెలిస్తే సెమీస్‌లో ముఖా ముఖీగా తలపడతారు. నేటి క్వార్టర్ ఫైనల్లో నాదల్... ప్రపంచ 13వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)తో, ఫెడరర్... హుబెర్ట్ హర్కజ్ (పొలండ్)తో తలపడతార -
నాదల్ రికార్డుపై జొకోవిచ్ గురి
కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో మేటి టైటిల్‌పై గురి పెట్టాడు. గురువారం మొదలయ్యే సీజన్ తొలి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 32 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్ మరో టైటిల్ నెగ్గితే... అత్యధికంగా 33 మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అయితే మేటి క్రీడాకారులందరూ పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలవాలంటే మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. రాఫెల్ నాదల్, ఫెడరర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నిషికోరి (జపాన్), కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), జాన్ ఇస్నెర్ (అమెరికా), యువతార సిట్సిపాస్ (గ్రీస్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తదితరులు కూడా ఈ టోర్నీ టైటిల్ రేసులో ఉన్నారు. తొలి రౌండ్లో సాకేత్ పరాజయం సాక్షి, హైదరాబాద్: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 6–4, 4–6తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
నాదల్ నిర్దాక్షిణ్యంగా...
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రిక్వార్టర్స్‌లో రోజర్ ఫెడరర్‌నే చిత్తు చేసి సంచలనం సృష్టించిన గ్రీకు వీరుడు సిట్సిపాస్ ఆటలు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ముందు సాగలేదు. ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో సిట్సిపాస్‌కు కొత్త పాఠాలు నేర్పిస్తూ నాదల్ చెలరేగాడు. నిర్దాక్షిణ్యమైన ఆటతో విజయాన్ని అందుకొని పదేళ్ల తర్వాత మరోసారి టైటిల్ వేటలో నిలిచాడు. టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క సెట్ కూడా కోల్పోని నాదల్ భీకర ఫామ్ ముందు సిట్సిపాస్ పూర్తిగా చేతులెత్తేశాడు. మహిళల విభాగంలో పెట్రా క్విటోవా, నయోమి ఒసాకా ఫైనల్ చేరి ఆఖరి సమరానికి సిద్ధమయ్యారు. వీరిద్దరిలో ఎవరి గెలిస్తే వారు హలెప్ స్థానంలో కొత్త వరల్డ్ నంబర్‌వన్‌గా నిలుస్తారు. మెల్బోర్న్: కెరీర్లో ఒకే ఒక్క సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన రాఫెల్ నాదల్ (స్పెయిన్) మరో టైటిల్ విజయానికి మరింత చేరువయ్యాడు. నాలుగు సార్లు ఈ టోర్నీ ఫైనల్లో ఓడిన అతను... మళ్లీ ఇక్కడ విజయం సాధించగలిగితే ఓపెన్ ఎరాలో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లను కనీసం రెండేసి సార్లు నెగ్గిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. నాదల్ అద్భుత ఫామ్‌ను చూపించేలా సెమీ ఫైనల్ సాగింది. ఈ మ్యాచ్‌లో అతను 6–2, 6–4, 6–0తో స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్)ను చిత్తుగా ఓడించాడు. 1 గంటా 46 నిమిషాల్లోనే ముగిసిన పోరులో ఆద్యంతం రాఫెల్ దూకుడు కొనసాగింది. ఫైనల్ చేరే క్రమంలో వరుసగా 63 గేమ్‌లలో నాదల్ తన సర్వీస్‌ను కోల్పోకపోవడం విశేషం. తొలి సెట్ మూడో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన ధాటిని మొదలు పెట్టిన నాదల్ ఏ దశలోనూ ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వలేదు. పదునైన సర్వీస్‌లతో దూసుకుపోయిన అతను 4–2తో ముందంజ వేశాడు. రెండు డబుల్ ఫాల్ట్‌లతో పాటు పేలవ డ్రాప్షాట్లతో సిట్సిపాస్ తొలి సెట్లో పూర్తిగా వెనుకబడిపోయాడు. రెండో సెట్లో మాత్రం కొంత పోటీనిచ్చిన గ్రీక్ ఆటగాడు 4–4 వరకు సమంగా నిలిచాడు. అయితే బ్రేక్ సాధించిన నాదల్ తన సర్వీస్‌ను నిలబెట్టుకున్నాడు. మూడో సెట్‌లోనైతే తిరుగులేని ఆటతో మూడు సార్లు సర్వీస్ బ్రేక్ చేసిన నాదల్... ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వలేదు. నాదల్ 28 విన్నర్లు కొట్టగా, సిట్సిపాస్ 17కే పరిమితం కావడం ఇద్దరి ఆట మధ్య తేడాను చూపిస్తోంది. ఈ టోర్నీలో హోరాహోరీ మ్యాచ్‌లు ఆడటంతో నాదల్‌తో పోలిస్తే దాదాపు పది గంటలు ఎక్కువగా కోర్టులో గడిపిన సిట్సిపాస్‌పై తీవ్ర అలసట కూడా ప్రభావం చూపించింది. తొలిసారి ఫైనల్‌కు... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కెరీర్లో మొదటి సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సెమీస్‌లో క్విటోవా 7–6 (7/2), 6–0తో డానియెల్ కొలిన్స్‌ను చిత్తు చేసింది. 1 గంటా 34 నిమిషాల పాటు ఈ పోరు సాగింది. తొలి సెట్ ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. 4–4తో స్కోరు సమంగా నిలిచిన స్థితిలో ఉష్ణోగ్రత తీవ్రంగా పెరిగిపోవడంతో రాడ్ లేవర్ ఎరీనా పై కప్పును మూసేశారు. తిరిగొచ్చిన తర్వాత కొలిన్స్ ఆట గతి తప్పింది. సహనం కోల్పోయిన ఆమె రెండో సెట్‌కు ముందు అంపైర్‌తో కూడా వాదనకు దిగింది. రెండో సెట్లో క్విటోవాకు ఎదురు లేకుండా పోయింది. రెండు సార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన క్విటోవా 2016లో కత్తిపోటుకు గురైంది. పునరాగమనం తర్వాత ఆమె అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. మరో సెమీస్‌లో నాలుగో సీడ్, యూఎస్ ఓపెన్ డిఫెండింగ్ చాంపియన్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 4–6, 6–4తో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. క్వార్టర్స్‌లో సెరెనాను కంగు తినిపించిన ప్లిస్కోవా గట్టిగా పోరాడినా జపాన్ స్టార్ ముందు తలవంచక తప్పలేదు. -
నాదల్, ఫెడరర్ ముందంజ
మెల్బోర్న్: టెన్నిస్ దిగ్గజాలు రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ఆస్ట్రేలియా ఓపెన్‌లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నాదల్, మూడో సీడ్ ఫెడరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అయితే వింబుల్డన్ రన్నరప్, ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 39వ ర్యాంకర్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా)... ఆరో ర్యాంకర్ కెవిన్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), మూడో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. అలవోకగా నెగ్గిన నాదల్... పురుషుల సింగిల్స్‌లో బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–3, 6–2, 6–2తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించగా, ఫెడరర్ 7–6 (7/5), 7–6 (7/3), 6–3 క్వాలిఫయర్ డానియెల్ ఎవాన్స్ (ఇంగ్లండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. వింబుల్డన్ ఫైనలిస్ట్ అండర్సన్ 6–4, 4–6, 4–6, 5–7తో అన్‌సీడెడ్ టియాఫో చేతిలో కంగుతిన్నాడు. ఆరో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–5, 6–7 (9/11), 6–4, 6–4తో మెక్‌డోనాల్డ్ (అమెరికా)పై గెలుపొందగా, ఫెబియానోతో పోరాడి ఓడిన మ్యాచ్‌లో ఒపెల్కా (అమెరికా) అదరగొట్టాడు. అతను 67 ఏస్‌లు సంధించడం విశేషం. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరకు థామస్ ఫెబియానో (ఇటలీ) 6–7 (15/17), 6–2, 6–4, 3–6, 7–6, (10/5)తో ఒపెల్కాపై నెగ్గాడు. బెర్టెన్స్ ఔట్ మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)కు 6–3, 3–6, 3–6తో రష్యా క్రీడాకారిణి పల్యుచెంకోవా చేతిలో చుక్కెదురైంది. మిగతా మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కెర్బర్ 6–2, 6–3తో బియట్రిజ్ మైయా (బ్రెజిల్)పై, ఐదో సీడ్ స్టీఫెన్స్ 6–3, 6–1తో టిమియా బబొస్ (హంగేరి)పై, మూడో సీడ్ వోజ్నియాకి 6–1, 6–3తో లార్సన్ (స్వీడెన్)పై 8వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో కెమెలియా బెగు (రుమేనియా)పై, షరపోవా (రష్యా) 6–2, 6–1తో రెబెక్కా పీటర్సన్ (స్వీడెన్)పై గెలుపొందారు. భారత పోరాటం తొలిరౌండ్లోనే... ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో భారత పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. డబుల్స్‌లో భారత జోడీలన్నీ నిరాశపరిచాయి. 15వ సీడ్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట 1–6, 6–4, 5–7తో కెరెనొ బుస్టా–గార్సియా లోపెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో కంగుతినగా, లియాండర్ పేస్– రెయిస్ వరేలా (మెక్సికో) ద్వయం 5–7, 6–7 (4/7)తో క్రాజిసెక్ (అమెరికా)– సిటాక్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. జీవన్ నెడున్‌జెళియాన్–మోన్రో (అమెరికా) జోడీ 6–4, 6–7 (8/10), 5–7తో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–నికొలా మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
ముర్రే ఖేల్ ఖతం
మెల్బోర్న్: ఊహించినట్టే జరిగింది. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)తో జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ముర్రే 4–6, 4–6, 7–6 (7/5), 7–6 (7/4), 2–6తో పోరాడి ఓడిపోయాడు. 4 గంటల 9 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 19 ఏస్‌లు సంధించి, 51 అనవసర తప్పిదాలు చేశాడు. గతంలో ఐదుసార్లు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ముర్రే 2008 తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే ప్రథమం. తుంటి గాయంతో బాధపడుతున్న ముర్రే గతేడాది కేవలం యూఎస్ ఓపెన్‌లో మాత్రమే పాల్గొని రెండో రౌండ్లోనే ఓటమి పాలయ్యాడు. ఈ సీజన్లో తదుపరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఆడాలా వద్దా అనే నిర్ణయాన్ని వచ్చే వారం తీసుకుంటానని ముర్రే వ్యాఖ్యానించాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–4, 6–4తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)పై... రెండో సీడ్ నాదల్ 6–4, 6–3, 7–5తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. అయితే తొమ్మిదో సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. అమెరికాకే చెందిన రీలీ ఒపెల్కా 7–6 (7/4), 7–6 (8/6), 6–7 (4/7), 7–6 (7/5)తో ఇస్నెర్‌ను బోల్తా కొట్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒపెల్కా 40 ఏస్‌లు... ఇస్నెర్ 47 ఏస్‌లు సంధించడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 5–7, 6–2, 6–1తో మనారినో (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6–2, 6–4, 7–6 (7/3)తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ప్రజ్నేశ్ పరాజయం భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తొలి రౌండ్ అడ్డంకిని దాటలేకపోయాడు. ప్రపంచ 39వ ర్యాంకర్ టియాఫో (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–7 (7/9), 3–6, 3–6తో ఓటమి చవిచూశాడు. షరపోవా జోరు... మహిళల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ షరపోవా (రష్యా), డిఫెండింగ్ చాంపియన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్లోకి దూసుకెళ్లారు. తొలి రౌండ్లో షరపోవా 6–0, 6–0తో క్వాలిఫయర్ హారియట్ డార్ట్ (బ్రిటన్)ను చిత్తుగా ఓడించగా... వొజ్నియాకి 6–3, 6–4తో అలీసన్ (నెదర్లాండ్స్)పై, కెర్బర్ 6–2, 6–2తో హెర్కాగ్ (స్లొవేనియా)పై గెలిచారు. ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. స్లోన్ స్టీఫెన్స్ 6–4, 6–2తో టౌన్సెండ్ (అమెరికా)పై, క్విటోవా 6–3, 6–2తో రిబరికోవా (స్లొవేకియా)పై, కికి బెర్టెన్స్ 6–3, 6–3తో అలీసన్ రిస్కీ(అమెరికా)పై నెగ్గారు. 22వ సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) 1–6, 6–3, 2–6తో మరియా సకారి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. -
ఫెడరర్‌ను ఆపేదెవరు!
పట్టుదలకు తోడు ఫిట్నెస్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనని నిరూపించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా 20వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొంటున్న అతను ఈసారి గెలిస్తే ఈ టోర్నీని అత్యధికంగా ఏడుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు. అంతేకాకుండా తన ఖాతాలో 100వ టైటిల్‌ను జమ చేసుకుంటాడు. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో విజేతగా నిలుస్తోన్న ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ లభించనుంది. మెల్బోర్న్: వరుసగా మూడో ఏడాది కొత్త సీజన్‌ను గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌తో మొదలు పెట్టాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇదే వేదికపై 2017, 2018లలో విజేతగా నిలిచిన అతను నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడనున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశముంది. ‘ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. నన్ను ఓడించాలంటే నా ప్రత్యర్థులు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది’ అని 37 ఏళ్ల ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్‌తోపాటు ఇప్పటికే ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ కూడా రికార్డుస్థాయిలో ఏడో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈ ఇద్దరిలో టైటిల్ సాధించినవారు ఎమర్సన్ (ఆస్ట్రేలియా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన జొకోవిచ్ మంగళవారం తన తొలి రౌండ్ మ్యాచ్‌ను క్వాలిఫయర్ క్రుగెర్ (అమెరికా)తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలిస్తే రెండో రౌండ్లో 2008 రన్నరప్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది. ‘2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాను. నాటి విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కెరీర్లో నేనూ గొప్ప టైటిల్స్ సాధించగలననే నమ్మకం ఇచ్చింది’ అని 31 ఏళ్ల జొకోవిచ్ అన్నాడు. మరోవైపు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్న మాజీ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్ పోరులో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ డక్‌వర్త్‌తో తలపడనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా బ్రిస్బేన్ టోర్నీలో ఆడాల్సిన 32 ఏళ్ల నాదల్ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. ‘ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. లేకుంటే ఇక్కడకు వచ్చేవాణ్ని కాదు’ అని 32 ఏళ్ల నాదల్ తెలిపాడు. ముర్రే... చివరిసారిగా... కొన్నాళ్లుగా తుంటి గాయంతో బాధపడుతున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనున్నాడు. నేడు జరిగే తొలి రౌండ్లో అతను 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ‘ఢీ’ కొంటాడు. ప్రస్తుతం 230వ ర్యాంక్‌లో ఉన్న ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు (2010, 2011, 2013, 2015, 2016) ఫైనల్‌కు చేరి ఐదుసార్లూ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం. టైటిల్ రేసులో వీరూ ఉన్నారు... గత రికార్డు, ఫామ్ దృష్ట్యా ఫెడరర్, జొకోవిచ్, నాదల్ టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నా... యువ ఆటగాళ్లు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా), కొరిచ్ (క్రొయేషియా), ఖచనోవ్ (రష్యా), సిలిచ్ (క్రొయేషియా), అండర్సన్ (దక్షిణాఫ్రికా), వావ్రింకా (స్విట్జర్లాండ్) సంచలన ప్రదర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోటీపడనున్నాడు. క్వాలిఫయింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. నేడు తొలి రౌండ్లో 39వ ర్యాంకర్ టియాఫో (అమెరికా)తో ప్రజ్నేశ్ ఆడనున్నాడు. సెరెనా సాధించేనా? మహిళల సింగిల్స్ విభాగంలో ఎప్పటిలాగే కచ్చితమైన ఫేవరెట్స్ కనిపించడం లేదు. ఏడుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24) సరసన నిలుస్తుంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనాకు గతేడాది రెండుసార్లు ఈ అవకాశం వచ్చినా ఆమె చేజార్చుకుంది. వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో సెరెనా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడింది.డిఫెండింగ్ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా), మాజీ విజేత షరపోవా (రష్యా), ముగురుజా (స్పెయిన్), నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఒస్టాపెంకో (లాత్వియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాడిసన్ కీస్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు. -
మళ్లీ నంబర్‌వన్‌గా జొకోవిచ్
సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ సోమవారం ప్రకటించబోయే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరుకోనున్నాడు. కడుపు నొప్పితో పారిస్ మాస్టర్స్ టోర్నీనుంచి రాఫెల్ నాదల్ అనూహ్యంగా తప్పుకోవడంతో సరిగ్గా రెండేళ్ల తర్వాత నొవాక్‌కు నంబర్‌వన్ ఖాయమైంది. 2000లో మారత్ సఫిన్ (38వ ర్యాంక్) తర్వాత సీజన్ ప్రారంభమైనప్పుడు 20కంటే ఎక్కువ ర్యాంక్‌లో ఉండి నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగిస్తున్న తొలి ఆటగాడు జొకోవిచ్ కావడం విశేషం. ఈ ఏడాది ఆరంభంలో అతను 22వ ర్యాంక్‌లో ఉన్నాడు. -
జొకోవిచ్ దూకుడు
ఏడాది క్రితం రాఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న జొకోవిచ్ మాజీ రన్నరప్ నిషికోరిపై అలవోక విజయంతో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. కెరీర్లో 23వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించిన జొకోవిచ్ 14వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం నేడు జరిగే యూఎస్ ఓపెన్ ఫైనల్లో 2009 చాంపియన్ డెల్‌పొట్రోతో అమీతుమీ తేల్చుకుంటాడు. న్యూయార్క్: ఈ సీజన్లో తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్... అర్జెంటీనా ఆజానుబాహుడు డెల్‌పొట్రో యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–2తో 2014 రన్నరప్ నిషికోరి (జపాన్)పై... 2009 విజేత, మూడో సీడ్ డెల్‌పొట్రో 7–6 (7/3), 6–2తో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)పై గెలుపొందారు. డెల్‌పొట్రోతో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్లు ఓడిపోయాక మోకాలి గాయం కారణంగా నాదల్ వైదొలిగాడు. నేటి ఫైనల్లో జొకోవిచ్, డెల్‌పొట్రో ‘ఢీ’కొంటారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 14–4తో డెల్‌పొట్రోపై ఆధిక్యంలో ఉన్నాడు. 2007, 2012లో డెల్‌పొట్రోతో యూఎస్ ఓపెన్‌లో ఆడిన మ్యాచ్‌ల్లో జొకోవిచ్ వరుస సెట్లలో గెలిచాడు. అయితే వీరిద్దరూ గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో తొలిసారి ముఖాముఖిగా తలపడనున్నారు. నిషికోరితో జరిగిన సెమీస్‌లో జొకోవిచ్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. బేస్‌లైన్ వద్దే ఎక్కువగా ఉంటూ శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో చెలరేగిన జొకోవిచ్ తన ప్రత్యర్థికి ఏ దశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. జొకోవిచ్ వ్యూహాత్మక ఆటతీరుకు సమాధానం ఇవ్వలేకపోయిన నిషికోరి ఏకంగా 51 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 22 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో నిషికోరి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను ఒక్కసారీ కోల్పోలేదు. ఈ విజయంతో జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో అత్యధికంగా ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న క్రీడాకారులుగా పీట్ సంప్రాస్ (అమెరికా), ఇవాన్ లెండిల్ (చెకోస్లొవేకియా) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత పొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న పీట్ సంప్రాస్ (14 టైటిల్స్) సరసన చేరుతాడు. ఫెడరర్ (20 టైటిల్స్), రాఫెల్ నాదల్ (17 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 2009లో యూఎస్ ఓపెన్ గెలిచిన డెల్‌పొట్రో ఆ తర్వాత గాయాల కారణంగా 2016 వచ్చేసరికి 1,045వ ర్యాంక్‌కు పడిపోయాడు. 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 97 కేజీల బరువున్న డెల్‌పొట్రో గాయాల నుంచి కోలుకున్నాక గాడిలో పడ్డాడు. ఈ ఏడాది ఇండియన్‌వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను గెలిచి కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. నాదల్‌తో జరిగిన సెమీస్‌లో తొలి సెట్‌ను టైబ్రేక్‌లో నెగ్గిన డెల్‌పొట్రో రెండో సెట్లో రెండుసార్లు నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. మోకాలి నొప్పితోనే ఈ టోర్నీలో ఆడిన రాఫెల్ నాదల్ రెండో సెట్ కూడా కోల్పోయాక ఇక నా వల్ల కాదంటూ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ►నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్ రాత్రి గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
నాదల్ దూకుడు
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండు సార్లు విజేతగా నిలిచిన మారియా షరపోవా మరో టైటిల్ వేటలో ముందంజ వేసింది. ఈ టోర్నీలో ఆమె మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–4 స్కోరుతో డోనా వెకిక్ (క్రొయేషియా)పై విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో షరపోవా, చెక్ రిపబ్లిక్కు చెందిన ఆరో సీడ్ కరోలినా ప్లిస్కోవాతో తలపడుతుంది. 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) కూడా అలవోకగా గెలిచింది. రెండో రౌండ్లో ఆమె 6–4, 6–4తో ఫియోనా ఫెర్రో (ఫ్రాన్స్)ను ఓడించింది. గతంలో రెండు సార్లు ఫైనలిస్ట్‌గా నిలిచిన సిమోనా హలెప్ (రొమేనియా) 6–3, 6–1తో టేలర్ టౌన్సెండ్ (యూఎస్ఏ)ను ఓడించి ముందుకు దూసుకెళ్లింది. మూడోరౌండ్లో సెరెనా అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఫ్రెంచ్ ఓపెన్‌లో మరో విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి ఆష్లీ బర్తితో గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో 36 ఏళ్ల సెరెనా 3–6, 6–3, 6–4తో విజయం సాధించింది. సిలిచ్, థీమ్ శ్రమించి...: పురుషుల వరల్డ్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) కూడా తనదైన శైలిలో చెలరేగి మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. రెండో రౌండ్లో నాదల్ 6–2, 6–1, 6–1తో అర్జెంటీనా కుర్రాడు గిడో పెలాను చిత్తుగా ఓడించాడు. మూడో సీడ్ సిలిచ్ మాత్రం తీవ్రంగా శ్రమించాడు. రెండో రౌండ్లో అతను 6–2, 6–2, 6–7 (3/7), 7–5తో క్వాలిఫయర్ ఆటగాడు హ్యూబర్ట్ హర్కజ్ (పోలండ్)పై విజయం సాధించాడు. ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–3, 6–2తో జూలియన్ బెన్నెట్ (ఫ్రాన్స్)ను చిత్తు చేశాడు. ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రేలియా) 6–2, 2–6, 6–4, 6–4తో స్టెఫెనోస్ స్టిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. రెండో రౌండ్లో యూకీ–శరణ్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి రౌండ్ మ్యాచ్‌లో ఈ జోడి 6–3, 7–5, 6–4 స్కోరుతో ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–çపురవ్ రాజా (భారత్) జంటను ఓడించింది. రెండో రౌండ్లో బాంబ్రీ–శరణ్ ద్వయం ఒలివర్ మరాక్–మేట్ పావిక్‌తో తలపడతారు. -
నాదల్ రికార్డుస్థాయిలో...
మోంటెకార్లో: ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ రికార్డు నెలకొల్పాడు. విజేతగా నిలిచిన నాదల్కు 9,35,385 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ టోర్నీ కాకుండా నాదల్ బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లను 10 సార్లు చొప్పున గెలిచాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్లో ఇది 76వ సింగిల్స్ టైటిల్. మాస్టర్స్ సిరీస్‌లో అతనికి 31వ టైటిల్. నేడు మొదలయ్యే బార్సిలోనా ఓపెన్‌లోనూ నాదల్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. -
నాదల్ నిష్క్రమించె...
పోరాట పటిమకు మారుపేరైన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఆట అర్ధంతరంగా ముగిసింది. కెరీర్లో రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ దిశగా అడుగులేస్తున్న దశలో అతడిని గాయం ఓడించింది. మారిన్ సిలిచ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ చివరి సెట్లో 0–2తో వెనుకబడిన దశలో కుడి కాలిలో నొప్పి కారణంగా ఇక ఆడలేనంటూ నాదల్ తప్పుకున్నాడు. మరోవైపు బ్రిటన్ ఆశాకిరణం కైల్ ఎడ్మండ్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ మూడో సీడ్ దిమిత్రోవ్‌ను బోల్తా కొట్టించి సెమీస్‌లో సిలిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలన ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయి. టోర్నీ తొమ్మిదో రోజు పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)... మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)... మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సిలిచ్ 3–6, 6–3, 6–7 (5/7), 6–2, 2–0తో ఆధిక్యంలో ఉన్నపుడు అతని ప్రత్యర్థి నాదల్ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో సిలిచ్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 47 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. నాలుగో సెట్లో 1–4తో వెనుకబడిన దశలో, ఆ తర్వాత సెట్ ముగిశాక నాదల్ కుడి కాలిలో నొప్పిని భరించలేక ఫిజియోను రప్పించుకొని కోర్టులోనే చికిత్స చేయించుకున్నాడు. ఐదో సెట్లో రెండు గేమ్‌లు కోల్పోయాక నాదల్ ఇక తన వల్ల కాదంటూ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 49వ ర్యాంకర్ కైల్ ఎడ్మండ్ (బ్రిటన్) 6–4, 3–6, 6–3, 6–3తో దిమిత్రోవ్‌ను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. మెర్టెన్స్ మెరిసె.. మహిళల సింగిల్స్ విభాగంలో అన్‌సీడెడ్ ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం) తన జైత్రయాత్ర కొనసాగిస్తూ నాలుగో సీడ్ స్వితోలినాను మట్టికరిపించింది. 73 నిమిషాలపాటు సాగిన క్వార్టర్ ఫైనల్లో మెర్టెన్స్ 6–4, 6–0తో స్వితోలినాను చిత్తుగా ఓడించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరుకున్న మెర్టెన్స్ ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మరోవైపు రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) సెమీఫైనల్ బెర్త్ సంపాదించేందుకు చెమటోడ్చింది. అన్‌సీడెడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో వొజ్నియాకి 6–0, 6–7 (3/7), 6–2తో గెలుపొంది 2011 తర్వాత ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో మెర్టెన్స్తో వొజ్నియాకి తలపడనుంది. క్వార్టర్స్‌లో బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–తిమియా బాబోస్ (హంగేరి) ద్వయం క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో బోపన్న–బాబోస్ జంట 6–4, 6–4తో వానియా కింగ్ (అమెరికా)–ఫ్రాంకో స్కుగోర్ (క్రొయేషియా) జోడీపై గెలిచింది. -
ఫెడరర్, నాదల్ నాలుగోస్సారి...
టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఈ ఏడాది నాలుగోసారి టైటిల్ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ ఇద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో నాదల్ 7–5, 7–6 (7/3)తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై, ఫెడరర్ 3–6, 6–3, 6–3తో డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై గెలిచారు. ఈ ఏడాది నాదల్‌తో ఆడిన మూడు ఫైనల్స్‌లో ఫెడరరే గెలిచాడు. ఓవరాల్‌గా వీరిద్దరు 38వ సారి పోటీపడుతుండగా... ముఖాముఖి రికార్డులో మాత్రం నాదల్ 24–13తో ఫెడరర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. -
రాఫెల్ నాదల్కు మళ్లీ షాక్
సోమవారం మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోనున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో చుక్కెదురైంది. ఆస్ట్రేలియాకు చెందిన నిక్ కిరియోస్తో శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాదల్ 2–6, 5–7తో ఓడిపోయాడు. రెండు వారాల వ్యవధిలో రెండు మాస్టర్స్ టోర్నీల్లో పాల్గొన్న నాదల్ క్వార్టర్ ఫైనల్‌ను దాటలేకపోయాడు. గతవారం రోజర్స్ కప్‌లో నాదల్ కెనడాకు చెందిన 143వ ర్యాంకర్ షపోవలోవ్ చేతిలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయాడు. -
నాదల్ సునాయాసంగా...
మూడో రౌండ్లోకి ప్రవేశం పారిస్: రికార్డుస్థాయిలో పదో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌పై గురి పెట్టిన స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ రెండో రౌండ్‌ను కూడా సాఫీగా దాటాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో నాలుగో సీడ్ నాదల్ 6–1, 6–4, 6–3తో రాబిన్ హాస్ (నెదర్లాండ్స్)ను ఓడించాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్ నాలుగు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేయడంతోపాటు 33 విన్నర్స్ కొట్టాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–4, 6–3తో సుసా (పోర్చుగల్)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6–2, 6–4, 3–6, 6–3తో స్టకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, ఆరో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 7–5, 6–1, 6–3తో బొలెలీ (ఇటలీ)పై, 11వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–3, 6–4, 7–5తో రొబ్రెడో (స్పెయిన్)పై నెగ్గారు. అయితే 12వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 5–7, 4–6, 7–6 (8/6), 4–6తో ప్రపంచ 91వ ర్యాంకర్ రెంజో ఒలివో (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. 2007లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత సోంగా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. శ్రమించిన ముగురుజా: మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ముగురుజా (స్పెయిన్) రెండో రౌండ్లో 6–7 (4/7), 6–4, 6–2తో కొంటావీట్ (ఎస్తోనియా)పై కష్టపడి గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 6–1తో కురుమి నారా (జపాన్)పై, 11వ సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–0, 6–0తో అబాండా (కెనడా)పై గెలిచారు. 15వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (5/7), 6–7 (5/7)తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ని ఓడించిన ఎకతెరీనా మకరోవా రెండో రౌండ్లో 2–6, 2–6తో సురెంకో (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది. -
మరో చరిత్రపై నాదల్ గురి
పదోసారి బార్సిలోనా ఓపెన్‌లో ఫైనల్లోకి బార్సిలోనా (స్పెయిన్): గత వారమే మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను రికార్డుస్థాయిలో పదోసారి గెలిచి చరిత్ర సృష్టించిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ ‘మరో చరిత్ర’కు విజయం దూరంలో ఉన్నాడు. బార్సిలోనా ఓపెన్‌లో నాదల్ పదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫైనల్‌కు చేరుకున్న తొమ్మిదిసార్లూ నాదలే విజేతగా నిలిచాడు. ఈసారీ గెలిస్తే రెండు టోర్నమెంట్లను (మోంటెకార్లో, బార్సిలోనా) పదిసార్లు చొప్పున సొంతం చేసుకున్న ఏకైక క్రీడాకారుడిగా నాదల్ గుర్తింపు పొందుతాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో నాదల్ 6–3, 6–4తో జెబలోస్ (అర్జెంటీనా)పై గెలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో నాదల్ ఆడతాడు. రెండో సెమీఫైనల్లో థీమ్ 6–2, 3–6, 6–4తో ఆండీ ముర్రే (బ్రిటన్)పై నెగ్గాడు.