నాదల్‌ నిష్క్రమించె...  | Just a sad day for an injured Rafael Nadal at the Australian Open | Sakshi
Sakshi News home page

నాదల్‌ నిష్క్రమించె... 

Published Wed, Jan 24 2018 1:35 AM | Last Updated on Wed, Jan 24 2018 1:35 AM

Just a sad day for an injured Rafael Nadal at the Australian Open - Sakshi

పోరాట పటిమకు మారుపేరైన స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ ఆట అర్ధంతరంగా ముగిసింది. కెరీర్‌లో రెండో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ దిశగా అడుగులేస్తున్న దశలో అతడిని గాయం ఓడించింది. మారిన్‌ సిలిచ్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ చివరి సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో కుడి కాలిలో నొప్పి కారణంగా ఇక ఆడలేనంటూ నాదల్‌ తప్పుకున్నాడు. మరోవైపు బ్రిటన్‌ ఆశాకిరణం కైల్‌ ఎడ్మండ్‌ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ను బోల్తా కొట్టించి సెమీస్‌లో సిలిచ్‌తో పోరుకు సిద్ధమయ్యాడు.   

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలన ఫలితాలు కొనసాగుతూనే ఉన్నాయి. టోర్నీ తొమ్మిదో రోజు పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)... మూడో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)... మహిళల సింగిల్స్‌లో నాలుగో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించారు. క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ సిలిచ్‌ 3–6, 6–3, 6–7 (5/7), 6–2, 2–0తో ఆధిక్యంలో ఉన్నపుడు అతని ప్రత్యర్థి నాదల్‌ గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో సిలిచ్‌ను విజేతగా ప్రకటించారు. 3 గంటల 47 నిమిషాలపాటు సాగిన ఈ పోరులో ఇద్దరూ పోటాపోటీగా తలపడ్డారు. నాలుగో సెట్‌లో 1–4తో వెనుకబడిన దశలో, ఆ తర్వాత సెట్‌ ముగిశాక నాదల్‌ కుడి కాలిలో నొప్పిని భరించలేక ఫిజియోను రప్పించుకొని కోర్టులోనే చికిత్స చేయించుకున్నాడు. ఐదో సెట్‌లో రెండు గేమ్‌లు కోల్పోయాక నాదల్‌ ఇక తన వల్ల కాదంటూ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. మరో క్వార్టర్‌ ఫైనల్లో అన్‌సీడెడ్, ప్రపంచ 49వ ర్యాంకర్‌ కైల్‌ ఎడ్మండ్‌ (బ్రిటన్‌) 6–4, 3–6, 6–3, 6–3తో దిమిత్రోవ్‌ను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు.  

మెర్‌టెన్స్‌ మెరిసె.. 
మహిళల సింగిల్స్‌ విభాగంలో అన్‌సీడెడ్‌ ఎలీస్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం) తన జైత్రయాత్ర కొనసాగిస్తూ నాలుగో సీడ్‌ స్వితోలినాను మట్టికరిపించింది. 73 నిమిషాలపాటు సాగిన క్వార్టర్‌ ఫైనల్లో మెర్‌టెన్స్‌ 6–4, 6–0తో స్వితోలినాను చిత్తుగా ఓడించింది. తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌ చేరుకున్న మెర్‌టెన్స్‌ ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క సెట్‌ కూడా కోల్పోలేదు. మరోవైపు రెండో సీడ్‌ కరోలైన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) సెమీఫైనల్‌ బెర్త్‌ సంపాదించేందుకు చెమటోడ్చింది. అన్‌సీడెడ్‌ కార్లా సురెజ్‌ నవారో (స్పెయిన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో వొజ్నియాకి 6–0, 6–7 (3/7), 6–2తో గెలుపొంది 2011 తర్వాత ఈ టోర్నీలో రెండోసారి సెమీఫైనల్‌ చేరింది. గురువారం జరిగే సెమీఫైనల్లో మెర్‌టెన్స్‌తో వొజ్నియాకి తలపడనుంది.  

క్వార్టర్స్‌లో బోపన్న జంట 
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న (భారత్‌)–తిమియా బాబోస్‌ (హంగేరి) ద్వయం క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో బోపన్న–బాబోస్‌ జంట 6–4, 6–4తో వానియా కింగ్‌ (అమెరికా)–ఫ్రాంకో స్కుగోర్‌ (క్రొయేషియా) జోడీపై గెలిచింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement