పట్టుదలకు తోడు ఫిట్‌నెస్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా అద్భుతాలు చేయడం సాధ్యమేనని నిరూపించిన స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో రికార్డుపై గురి పెట్టాడు. వరుసగా 20వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొంటున్న అతను ఈసారి గెలిస్తే ఈ టోర్నీని అత్యధికంగా ఏడుసార్లు నెగ్గిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతాడు. అంతేకాకుండా తన ఖాతాలో 100వ టైటిల్‌ను జమ చేసుకుంటాడు. గత రెండేళ్లుగా ఈ టోర్నీలో విజేతగా నిలుస్తోన్న ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి గట్టిపోటీ లభించనుంది.
మెల్‌బోర్న్: వరుసగా మూడో ఏడాది కొత్త సీజన్‌ను గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌తో మొదలు పెట్టాలనే లక్ష్యంతో స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనున్నాడు. ఇదే వేదికపై 2017, 2018లలో విజేతగా నిలిచిన అతను నేడు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో డెనిస్ ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)తో ఆడనున్నాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో ఇప్పటికే అత్యధికంగా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఫెడరర్‌కు ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) నుంచి సవాల్ ఎదురయ్యే అవకాశముంది.
‘ప్రస్తుతం బాగా ఆడుతున్నాను. నన్ను ఓడించాలంటే నా ప్రత్యర్థులు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది’ అని 37 ఏళ్ల ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఫెడరర్‌తోపాటు ఇప్పటికే ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జొకోవిచ్ కూడా రికార్డుస్థాయిలో ఏడో టైటిల్‌పై గురి పెట్టాడు. ఈ ఇద్దరిలో టైటిల్ సాధించినవారు ఎమర్సన్ (ఆస్ట్రేలియా–6 సార్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తారు. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచి ఫామ్‌లోకి వచ్చిన జొకోవిచ్ మంగళవారం తన తొలి రౌండ్ మ్యాచ్‌ను క్వాలిఫయర్ క్రుగెర్ (అమెరికా)తో ఆడనున్నాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ గెలిస్తే రెండో రౌండ్‌లో 2008 రన్నరప్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురయ్యే అవకాశముంది.
‘2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ రూపంలో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాను. నాటి విజయం నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. కెరీర్‌లో నేనూ గొప్ప టైటిల్స్ సాధించగలననే నమ్మకం ఇచ్చింది’ అని 31 ఏళ్ల జొకోవిచ్ అన్నాడు. మరోవైపు ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్న మాజీ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ తొలి రౌండ్ పోరులో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ డక్‌వర్త్‌తో తలపడనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా బ్రిస్బేన్ టోర్నీలో ఆడాల్సిన 32 ఏళ్ల నాదల్ చివరి నిమిషంలో గాయం కారణంగా తప్పుకున్నాడు. ‘ప్రస్తుతం ఫిట్‌గా ఉన్నాను. లేకుంటే ఇక్కడకు వచ్చేవాణ్ని కాదు’ అని 32 ఏళ్ల నాదల్ తెలిపాడు.
ముర్రే... చివరిసారిగా...
కొన్నాళ్లుగా తుంటి గాయంతో బాధపడుతున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే చివరిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడనున్నాడు. నేడు జరిగే తొలి రౌండ్‌లో అతను 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ‘ఢీ’ కొంటాడు. ప్రస్తుతం 230వ ర్యాంక్‌లో ఉన్న ముర్రే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదుసార్లు (2010, 2011, 2013, 2015, 2016) ఫైనల్‌కు చేరి ఐదుసార్లూ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకోవడం గమనార్హం.
టైటిల్ రేసులో వీరూ ఉన్నారు...
గత రికార్డు, ఫామ్ దృష్ట్యా ఫెడరర్, జొకోవిచ్, నాదల్ టైటిల్ ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నా... యువ ఆటగాళ్లు అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), థీమ్ (ఆస్ట్రియా), కొరిచ్ (క్రొయేషియా), ఖచనోవ్ (రష్యా), సిలిచ్ (క్రొయేషియా), అండర్సన్ (దక్షిణాఫ్రికా), వావ్రింకా (స్విట్జర్లాండ్) సంచలన ప్రదర్శన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోటీపడనున్నాడు. క్వాలిఫయింగ్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. నేడు తొలి రౌండ్‌లో 39వ ర్యాంకర్ టియాఫో (అమెరికా)తో ప్రజ్నేశ్ ఆడనున్నాడు.
సెరెనా సాధించేనా?
మహిళల సింగిల్స్ విభాగంలో ఎప్పటిలాగే కచ్చితమైన ఫేవరెట్స్ కనిపించడం లేదు. ఏడుసార్లు చాంపియన్, మాజీ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) మరో టైటిల్ సాధిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24) సరసన నిలుస్తుంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన సెరెనాకు గతేడాది రెండుసార్లు ఈ అవకాశం వచ్చినా ఆమె చేజార్చుకుంది.
వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లలో సెరెనా రన్నరప్ ట్రోఫీలతో సంతృప్తి పడింది.డిఫెండింగ్ చాంపియన్ వొజ్నియాకి (డెన్మార్క్), టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ (రొమేనియా), మాజీ విజేత షరపోవా (రష్యా), ముగురుజా (స్పెయిన్), నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఒస్టాపెంకో (లాత్వియా), స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), మాడిసన్ కీస్ (అమెరికా) టైటిల్ రేసులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment