యూఎస్‌ ఓపెన్‌లో కొత్త చరిత్ర | Thiem Beats Alexander Zverev To Lift Maiden Grand Slam Title | Sakshi
Sakshi News home page

వారెవ్వా థీమ్‌.. ఈసారి మాత్రం వదల్లేదు

Published Mon, Sep 14 2020 10:17 AM | Last Updated on Mon, Sep 14 2020 10:27 AM

Thiem Beats Alexander Zverev To Lift Maiden Grand Slam Title - Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌ అవతరించాడు. ఆస్ట్రేలియా స్టార్‌ క్రీడాకారుడు, రెండో సీడ్‌ డొమనిక్‌ థీమ్‌ చాంపియన్‌గా నిలిచాడు.  భారతకాలమాన ప్రకారం ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఫైనల్లో థీమ్‌ 2-6, 4-6, 6-4, 6-3, 7-6(8/6) తేడాతో జర్మనీ ప్లేయర్‌, ఐదో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై గెలిచి యూఎస్‌ ఓపెన్‌ను కైవసం చేసుకున్నాడు. ఇది థీమ్‌కు‌ తొలి గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓడిపోయిన థీమ్‌.. ఈసారి మాత్రం టైటిల్‌ను సాధించే వరకూ వదిలిపెట్టలేదు. తొలి రెండు సెట్లను కోల్పోయినా ఇక మిగతా మూడు సెట్లను తన ఖాతాలో వేసుకుని ట్రోఫీని ముద్దాడాడు.(చదవండి: నమో నయోమి)

ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో  ఫైనల్‌కు చేరిన థీమ్‌.. అంతకుముందు 2018, 2019ల్లో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గానే సరిపెట్టుకున్నాడు. అయితే ఈసారి టైటిల్‌ను సాధించే వరకు థీమ్‌ తన పోరాటాన్ని ఆపలేదు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడ్డ సమయంలో థీమ్‌ ఇరగదీశాడు. ప్రత్యర్థి జ్వెరెవ్‌ నుంచి అద్భుతమైన ఏస్‌లో దూసుకొస్తున్నా ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఒక్కో గేమ్‌ను కైవసం చేసుకుంటూ వరుసగా రెండు సెట్లను గెలిచాడు.ఆపై చివరిసెట్‌ను టైబ్రేక్‌లో గెలిచి టైటిల్‌ సాధించాడు. యూఎస్‌ ఓపెన్‌లో ఒక ఆటగాడు తొలి రెండు సెట్లు కోల్పోయిన తర్వాత తేరుకుని టైటిల్‌ గెలవడం ఆ టోర్నీ ఓపెన్‌ ఎరాలో ఇదే తొలిసారి. ఫలితంగా థీమ్‌ కొత్త చరిత్ర సృష్టించాడు.

ఐదో సెట్‌లో హోరాహోరీ
టైటిల్‌ నిర్ణయాత్మక ఐదో సెట్‌లో ఇరువురి మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఈ ఇద్దరూ ఎక్కడా తగ్గకుండా నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డారు. ఇరువురు సమానంగా గేమ్‌లను గెలుచుకుంటూ స్కోరును కాపాడుకుంటూ వచ్చారు. దాంతో మ్యాచ్‌ ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. ట్రైబ్రేకర్‌లో ఎనిమిది పాయింట్లతో ముందంజ వేసిన థీమ్‌.. జ్వెరెవ్‌ను ఆరు పాయింట్లకు పరిమితం చేసి టైటిల్‌ను ఎగురేసుకుపోయాడు. ఇక తన కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోకి చేరి టైటిల్‌ సాధిద్దామనుకున్న జ్వెరెవ్‌కు ఆశలకు బ్రేక్‌ పడింది. ఇరువురి మధ్య నాలుగు గంటలకు పైగా సాగిన పోరాటంలో చివరకు థీమ్‌ పైచేయి సాధించి ప్రతిష్టాత్మక ట్రోఫీని దక్కించుకున్నాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement