పారిస్: మట్టి కోర్టులపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 11వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో 10 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ నాదల్ 6–4, 6–1, 6–2తో ఐదో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా)పై అలవోకగా గెలిచాడు. ఈ క్రమంలో రోజర్ ఫెడరర్ (11–వింబుల్డన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రికార్డుస్థాయిలో 11వసారి ఫైనల్ చేరిన రెండో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. ఓవరాల్‌గా నాదల్ కెరీర్‌లో ఇది 24వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్. డెల్‌పొట్రోతో 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో నాదల్‌కు తొలి సెట్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. అయితే అందివచ్చిన అవకాశాలను డెల్‌పొట్రో సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
నాదల్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా డెల్‌పొట్రో వినియోగించుకోలేదు. ఆదివారం జరిగే ఫైనల్లో ఏడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)తో నాదల్ అమీతుమీ తేల్చుకుంటాడు. మరో సెమీఫైనల్లో థీమ్ 7–5, 7–6 (12/10), 6–1తో సెచి నాటో (ఇటలీ)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించిన సెచినాటో అదే జోరును కనబర్చలేకపోయాడు. 1995లో థామస్ ముస్టర్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సాధించాక మరో ఆస్ట్రియా ఆటగాడు ఈ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. థీమ్‌తో ముఖాముఖి రికార్డులో నాదల్ 6–3తో ఆధిక్యం లో ఉన్నాడు. అయితే థీమ్ చేతిలో నాదల్ ఓడిపోయిన మూడు మ్యాచ్‌లూ క్లే కోర్టులపైనే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment