పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ పెను సంచలనంతో ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం పురుషుల సింగిల్స్‌లో రెండుసార్లు రన్నరప్, టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మొదటి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. స్పెయిన్‌కు చెందిన 35 ఏళ్ల పాబ్లో అందుహర్ అసమాన పోరాటపటిమ కనబరిచి 4 గంటల 28 నిమిషాల్లో 4–6, 5–7, 6–3, 6–4, 6–4తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్ థీమ్‌ను బోల్తా కొట్టించాడు. వరుసగా ఎనిమిదో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన 27 ఏళ్ల థీమ్ ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2016, 2017లలో సెమీఫైనల్ చేరిన థీమ్... 2018, 2019లలో రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు.
థీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రెండు సెట్‌లు కోల్పోయిన ప్రపంచ 68వ ర్యాంకర్ పాబ్లో ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన పాబ్లో... థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మ్యాచ్ మొత్తంలో థీమ్ ఏడు డబుల్ ఫాల్ట్‌లు, 61 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం. మరోవైపు కెరీర్‌లో 37వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడుతున్న పాబ్లో తొలి రెండు సెట్‌లు ఓడిపోయాక ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లలో నెగ్గి విజయాన్ని అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 27వ సీడ్ ఫాగ్‌నిని (ఇటలీ), కీ నిషికోరి (జపాన్), 11వ సీడ్ అగుట్ (స్పెయిన్), 12వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) తమ ప్రత్యర్థులపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.
ఒసాకాపై 15 వేల డాలర్ల జరిమానా
మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఒసాకా 6–4, 7–6 (7/4)తో పాట్రిసియా మరియా టిగ్ (రొమేనియా)ను ఓడించింది. అయితే ఫ్రెంచ్ ఓపెన్‌లో మ్యాచ్‌లు ముగిశాక మీడియా సమావేశాలకు హాజరుకానని ప్రకటించిన ఒసాకా అలాగే చేసింది. తొలి రౌండ్‌లో గెలిచిన తర్వాత ఆమె మీడియా సమావేశానికి గైర్హాజరయింది. దాంతో టోర్నీ నిబంధనలు ఉల్లంఘించినందుకు మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఒసాకాపై 15 వేల డాలర్ల (రూ. 10 లక్షల 86 వేలు) జరిమానా విధించారు. ఆమె గెలిచిన ప్రైజ్‌మనీలో నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేస్తారు.
కెర్బర్ ఓటమి
మరోవైపు ప్రపంచ మాజీ నంబర్‌వన్, 26వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్‌లో 2–6, 4–6తో కలినీనా (ఉక్రెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–7 (3/7), 7–6 (7/5), 6–1తో గ్రీట్ మినెన్ (బెల్జియం)పై... మూడో సీడ్ సబలెంకా (బెలారస్) 6–4, 6–3తో అనా కొంజు (క్రొయేషియా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment