కిరణ్ జార్జి, మాళవిక, ఆకర్షి కూడా అవుట్
ఆర్క్‌టిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
వాంటా (ఫిన్‌లాండ్): పారిస్ ఒలింపిక్స్ తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్య సేన్‌కు నిరాశ ఎదురైంది. ఆర్క్‌టిక్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో లక్ష్య సేన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. తొలి రౌండ్‌లో ప్రత్యర్థి రస్‌ముస్ గెమ్కే (డెన్మార్క్) నుంచి ‘వాకోవర్’ దొరకడంతోపాటు లక్ష్య సేన్ నేరుగా ప్రిక్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగాడు.
ఏడో సీడ్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)తో జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్ 21–19, 18–21, 15–21తో ఓడిపోయాడు. 70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో లక్ష్య సేన్ తొలి గేమ్‌ను దక్కించుకున్నా... ఆ తర్వాత ప్రత్యర్థి దూకుడుకు జవాబివ్వలేకపోయాడు. మరో భారత ప్లేయర్ కిరణ్ జార్జి కథ కూడా ముగిసింది.
ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో జరిగిన మ్యాచ్‌లో కిరణ్ జార్జి 17–21, 8–21తో ఓటమి చవిచూశాడు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో మాళవిక బన్సోద్ 15–21, 8–21తో ప్రపంచ మాజీ చాంపియన్ రచనోక్ ఇంతనోన్ (థాయ్‌లాండ్) చేతిలో... ఉన్నతి హుడా 10–21, 19–21తో మిచెల్లి లీ (కెనడా) చేతిలో... ఆకర్షి 9–21, 8–21తో హాన్ యువె (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు.
మిక్స్‌డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆద్యా–సతీశ్ కుమార్ (భారత్) ద్వయం 12–21, 15–21తో చెంగ్ జింగ్–జాంగ్ చి (చైనా) జోడీ చేతిలో.. రుతూపర్ణ–శ్వేతాపర్ణ (భారత్) జంట 8–21, 10–21తో టాప్ సీడ్ లియు షెంగ్ షు–టాన్ నింగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment