రామ్‌కుమార్ సంచలనం
ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ డొమినిక్ థీమ్‌పై గెలుపు
అంటాల్యా (టర్కీ): భారత యువ టెన్నిస్ క్రీడాకారుడు రామ్‌కుమార్ రామనాథన్ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. అంటాల్యా ఓపెన్ ఏటీపీ గ్రాస్‌కోర్టు టోర్నమెంట్‌లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్, టాప్ సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)పై రామ్‌కుమార్ గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో ప్రపంచ 222వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6–3, 6–2తో థీమ్‌ను మట్టికరిపించాడు. 59 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు.
సోమవారం రాత్రి జరిగిన తొలి రౌండ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–4తో ప్రపంచ 68వ ర్యాంకర్ రొగెరియో దుత్రా సిల్వా (బ్రెజిల్)ను ఓడించాడు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో లియాండర్ పేస్ (భారత్)–ఆదిల్ షమస్దీన్ (కెనడా) ద్వయం 3–6, 7–5, 11–9తో వెస్లీ కూల్‌హాఫ్–మిడిల్‌కూప్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మరోవైపు లండన్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో జరుగుతున్న ఎగాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం) జంట తమ ప్రత్యర్థి ఒస్టాపెంకో (లాత్వియా)–స్రెబొత్నిక్ (స్లొవేనియా) జోడీకి వాకోవర్ ఇచ్చింది.