
పుణే: మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–100 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్(Ramkumar Ramanathan) మెయిన్ ‘డ్రా’కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో రామ్‌కుమార్ సంచలనం సృష్టించాడు. టాప్ సీడ్, ప్రపంచ 267వ ర్యాంకర్ ఇలియాస్ ఇమర్ (స్వీడన్)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 403వ ర్యాంకర్ రామ్‌కుమార్ 5–7, 6–1, 6–4తో గెలుపొందాడు.
ఒక గంట 52 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ తొమ్మిది ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో కిమర్ కాప్‌జాన్స్ (బెల్జియం)తో రామ్‌కుమార్ ఆడతాడు. ఈ మ్యాచ్‌లో నెగ్గిన ప్లేయర్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు.
చైనా జట్టుకు ఇండోనేసియా షాక్
కింగ్‌డావో (చైనా): ఆసియా మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్‌లో ఇండోనేసియా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. డిఫెండింగ్ చాంపియన్ చైనా జట్టుతో జరిగిన ఫైనల్లో ఇండోనేసియా 3–1తో నెగ్గింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో రివాల్డీ–ఫాదియా జంట 21–11, 21–13తో జువాన్–మెంగ్ యింగ్ జోడీని ఓడించడంతో ఇండోనేసియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇక రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో ఫర్హాన్ 21–15, 21–13తో హు జె ఆన్‌ను ఓడించడంతో ఇండోనేసియా ఆధిక్యం 2–0కు పెరిగింది. మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో జు వెన్ జింగ్ 21–12, 21–13తో కుసుమ వర్ధినిపై గెలవడంతో చైనాకు తొలి విజయం దక్కింది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో షోహిబుల్ ఫిక్రి–డానియల్ మారి్టన్ జోడీ 21–15, 21–9తో చెన్ జుజున్–హువాంగ్ ది (చైనా) ద్వయంపై గెలిచి ఇండోనేసియాకు టైటిల్‌ను ఖరారు చేసింది.