యూఎస్ ఓపెన్ చరిత్రలోనే సుదీర్ఘ మ్యాచ్ ఆడిన ఇవాన్స్, ఖచనోవ్
ఐదు సెట్‌ల పోరులో ఖచనోవ్‌పై ఇవాన్స్ విజయం
సినెర్, అల్‌కరాజ్ శుభారంభం
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఈ టోర్నీ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ నమోదైంది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 184వ ర్యాంకర్ డేనియల్ ఇవాన్స్ (బ్రిటన్) 5 గంటల 35 నిమిషాల్లో 6–7 (6/8), 7–6 (7/2), 7–6 (7/4), 4–6, 6–4తో ప్రపంచ 22వ ర్యాంకర్ కరెన్ ఖచనోవ్ (రష్యా)పై గెలుపొందాడు.
తొలి సెట్ 68 నిమిషాలు, రెండో సెట్ 67 నిమిషాలు, మూడో సెట్ 72 నిమిషాలు, నాలుగో సెట్ 67 నిమిషాలు, ఐదో సెటస్ 61 నిమిషాలు జరిగాయి. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్‌లో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్‌గా ఇవాన్స్, ఖచనోవ్ మ్యాచ్ గుర్తింపు పొందింది. 1992లో స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), మైకేల్ చాంగ్ (అమెరికా) మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ 5 గంటల 26 నిమిషాలు సాగింది.
ఆనాటి మ్యాచ్‌లో చాంగ్‌పై గెలిచిన ఎడ్బర్గ్ ఫైనల్లో పీట్ సంప్రాస్ (అమెరికా)ను కూడా ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఖచనోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్‌లో ఇవాన్స్ ఒకదశలో 0–4తో వెనుకబడి ఓటమికి చేరువయ్యాడు. అయితే పట్టువదలకుండా పోరాడిన ఇవాన్స్ అనూహ్యంగా వరుసగా ఆరు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు విజయాన్ని కూడా అందుకున్నాడు.
సిట్సిపాస్‌కు షాక్
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), మూడో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) శ్రమించి గెలుపొందగా... 11వ సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.
సినెర్ 2–6, 6–2, 6–1, 6–2తో మెకంజీ మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, అల్‌కరాజ్ 6–2, 4–6, 6–3, 6–1తో లీ టు (ఆ్రస్టేలియా)పై, మెద్వెదెవ్ 6–3, 3–6, 6–3, 6–1తో దుసాన్ లాజోవిచ్ (సెర్బియా)పై నెగ్గారు. సిట్సిపాస్ 6–7 (5/7), 6–4, 3–6, 5–7తో కొకినాకిస్ (ఆ్రస్టేలియా) చేతిలో ఓడిపోయాడు.
రాడుకానూ ఓటమి
మహిళల సింగిల్స్‌లో 2021 చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్), రన్నరప్ లేలా ఫెర్నాండెజ్ (కెనడా)... 2019 విజేత బియాంకా ఆండ్రెస్కూ (కెనడా) తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. సోఫియా (అమెరికా) 6–1, 3–6, 6–4తో రాడుకానూపై, పొటపోవా (రష్యా) 2–6, 6–4, 7–5తో లేలా ఫెర్నాండెజ్‌పై, ఐదో సీడ్ పావ్లీని (ఇటలీ) 6–7 (5/7), 6–2, 6–4తో బియాంకాపై గెలుపొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 5–7తో రూస్ (రొమేనియా) చేతిలో ఓడిపోయింది.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)–అల్బానో ఒలివెట్టి (ఫ్రాన్స్)... శ్రీరామ్ బాలాజీ (భారత్)–గిడో ఆండ్రెజి (అర్జెంటీనా) జోడీలు రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాయి. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో యూకీ–ఒలివెట్టి ద్వయం 6–3, 6–4తో రియాన్ సెగర్‌మన్–ప్యాట్రిక్ ట్రహక్ (అమెరికా) జంటపై... బాలాజీ–ఆండ్రెజి జోడీ 5–7, 6–1, 7–6 (12/10)తో డానిల్ (న్యూజిలాండ్)–వరేలా (మెక్సికో) జంటపై గెలుపొందాయి.
Comments
Please login to add a commentAdd a comment