పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన గ్రీస్ యువ టెన్నిస్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపాస్ నాలుగో ప్రయత్నంలో సఫలమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో 22 ఏళ్ల సిట్సిసాస్ టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్ సిట్సిపాస్ 3 గంటల 37 నిమిషాల్లో 6–3, 6–3, 4–6, 4–6, 6–3తో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి గ్రీస్ ప్లేయర్‌గా సిట్సిపాస్ గుర్తింపు పొందాడు. గతంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో సిట్సిపాస్ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్స్ (2019, 2021 ఆస్ట్రేలియన్ ఓపెన్; 2020 ఫ్రెంచ్ ఓపెన్) కావడం విశేషం.
ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్ చేరిన 24 ఏళ్ల జ్వెరెవ్ ఆరంభంలోనే తడబడ్డాడు. సిట్సిపాస్ ఆటతీరు ముందు ఎదురునిలువలేక వరుసగా రెండు సెట్‌లను కోల్పోయాడు. అయితే మూడో సెట్ నుంచి జ్వెరెవ్ ఆటతీరు గాడిలో పడింది. అనూహ్యంగా సిట్సిపాస్ ఒత్తిడికి లోనయ్యాడు. వరుసగా రెండు సెట్‌లను ఈ గ్రీస్ ప్లేయర్ సమర్పించుకున్నాడు. దాంతో మ్యాచ్ నిర్ణాయక ఐదో సెట్‌కు దారి తీసింది. నాలుగో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకున్న సిట్సిపాస్ 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
ఆ తర్వాత సిట్సిపాస్ తన రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. తొమ్మిదో గేమ్‌లోని తన సర్వీస్‌లో ఏస్ సంధించి సిట్సిపాస్ విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో సిట్సిపాస్ ఎనిమిది ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 24 సార్లు పాయింట్లు సాధించాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి జ్వెరెవ్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు జ్వెరెవ్ 11 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. నెట్‌వద్దకు 35 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. సిట్సిపాస్ 43 అనవసర తప్పిదాలు... జ్వెరెవ్ 47 అనవసర తప్పిదాలు చేశారు.
నాదల్, జొకోవిచ్ హోరాహోరీ
డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా) మధ్య రెండో సెమీఫైనల్ హోరాహోరీగా సాగుతోంది. తొలి సెట్‌ను నాదల్ 6–3తో సొంతం చేసుకున్నాడు. అతను రెండుసార్లు జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. అనంతరం జొకోవిచ్ తేరుకొని రెండో సెట్‌ను 6–3తో గెల్చుకున్నాడు. ఈ సెట్‌లో నాదల్ సర్వీస్‌ను అతను రెండుసార్లు బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment