జొకోవిచ్‌ రికార్డు  | Novak Djokovic reached quarter finals for 17th time in French Open | Sakshi
Sakshi News home page

జొకోవిచ్‌ రికార్డు 

Published Mon, Jun 5 2023 4:20 AM | Last Updated on Mon, Jun 5 2023 4:20 AM

Novak Djokovic reached quarter finals for 17th time in French Open - Sakshi

పారిస్‌: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో జొకోవిచ్‌ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్‌ నాదల్‌ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్‌ తాజా విజయంతో ఈ స్పెయిన్‌ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు.

ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6–3, 6–2, 6–2తో యువాన్‌ పాబ్లో వారిలాస్‌ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఏడు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. 35 విన్నర్స్‌ కొట్టిన అతను నెట్‌ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన రికార్డు ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌; 58 సార్లు) పేరిట ఉంది.

జొకోవిచ్‌ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్‌ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్‌ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్‌ ఎమర్సన్‌ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్‌ ఫైనల్లో 11వ సీడ్‌ ఖచనోవ్‌ (రష్యా)తో జొకోవిచ్‌ ఆడతాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఖచనోవ్‌ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు.  

అల్‌కరాజ్‌ అలవోకగా... 
ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్‌కరాజ్‌ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్‌లు సంధించిన అల్‌కరాజ్, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. ఐదో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌), సెబాస్టియన్‌ ఆఫ్నర్‌ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో అల్‌కరాజ్‌ తలపడతాడు.  

పావ్లీచెంకోవా ముందంజ... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో 2021 రన్నరప్‌ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌), స్వితోలినా (ఉక్రెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్‌ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్‌ కసత్‌కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్‌కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్‌–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 

44 ఏళ్ల తర్వాత...
బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్‌ బీత్రిజ్‌ హదాద్‌ మాయ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరిన బ్రెజిల్‌ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్‌ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement