grand slam title
-
US Open 2024: సూపర్ సినెర్
ఈ ఏడాది తన అది్వతీయమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఇటలీ టెన్నిస్ స్టార్ యానిక్ సినెర్ మరో గొప్ప విజయం సాధించాడు. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో సినెర్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆద్యంతం తన ఆధిపత్యం చలాయిస్తూ వరుస సెట్లలో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌పై గెలిచాడు. తన కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టోర్నీ ప్రారంభానికి ముందు తెరపైకొచి్చన డోపింగ్ వివాదం తన ఆటతీరుపై ఎలాంటి ప్రభావం చూపలేదని ఇటలీ స్టార్ యానిక్ సినెర్ నిరూపించాడు. ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌కు, టాప్ సీడ్ హోదాకు న్యాయం చేస్తూ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో సినెర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏళ్ల సినెర్ 6–3, 6–4, 7–5తో ప్రపంచ 12వ ర్యాంకర్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో సినెర్‌కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురుకాలేదు. విజేతగా నిలిచిన సినెర్‌కు 36 లక్షల డాలర్లు (రూ. 30 కోట్ల 23 లక్షలు), రన్నరప్ ఫ్రిట్జ్కు 18 లక్షల డాలర్లు (రూ. 15 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. బ్రేక్ పాయింట్‌తో మొదలు... 2003లో ఆండీ రాడిక్ యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచాక మరో అమెరికన్ క్రీడాకారుడు గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ టైటిల్ సాధించలేకపోయాడు. 2009లో ఆండీ రాడిక్ వింబుల్డన్ ఫైనల్లో ఫెడరర్ చేతిలో ఓడిపోయాక మరో అమెరికా ప్లేయర్ మరే గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయాడు. 15 ఏళ్ల తర్వాత టేలర్ ఫ్రిట్జ్ రూపంలో అమెరికా ప్లేయర్ ఒకరు గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఆడుతుండటంతో అందరి కళ్లు ఫ్రిట్జ్పైనే కేంద్రీకృతమయ్యాయి. అయితే సినెర్ మాత్రం అమెరికా అభిమానుల ఆశలను వమ్ము చేశాడు.తొలి సెట్లోని తొలి గేమ్‌లోనే ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 2–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే మూడో గేమ్‌లో సరీ్వస్ కాపాడుకొని, నాలుగో గేమ్‌లో సినెర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫ్రిట్జ్ స్కోరును 2–2తో సమం చేశాడు. కానీ సినెర్ వెంటనే విజృంభించి మరో రెండుసార్లు ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. రెండో సెట్లోనూ సినెర్ దూకుడుకు ఫ్రిట్జ్ జవాబు ఇవ్వలేకపోయాడు. మూడో సెట్లో కాస్త పోటీ ఎదురైనా 12వ గేమ్‌లో ఫ్రిట్జ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ విజయాన్ని అందుకున్నాడు.6: ఈ ఏడాది సినెర్ గెలిచిన టైటిల్స్. ఆ్రస్టేలియన్ ఓపెన్, రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్, యూఎస్ ఓపెన్ టోర్నీల్లో సినెర్ విజేతగా నిలిచాడు. 55: ఈ సంవత్సరం సినెర్ మొత్తం 60 మ్యాచ్‌లు ఆడాడు. 55 మ్యాచ్‌ల్లో గెలుపొందాడు. ఐదింటిలో ఓడిపోయాడు. 3: తన కెరీర్లో ఒకే ఏడాది ఫైనల్ చేరుకున్న తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లోనూ విజేతగా నిలిచిన మూడో ప్లేయర్ సినెర్. గతంలో గిలెర్మో విలాస్ (అర్జెంటీనా; 1977లో ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్), జిమ్మీ కానర్స్ (అమెరికా; 1974లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) మాత్రమే ఈ ఘనత సాధించారు. 4: ఒకే ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్ సినెర్. ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా) మూడుసార్లు చొప్పున... 1988లో మాట్స్ విలాండర్ (స్వీడన్) ఒకసారి ఈ ఘనత సాధించారు. -
Australian Open 2024: విన్నర్ సినెర్...
మెల్బోర్న్: సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, 10 సార్లు చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)పై తాను సాధించిన విజయం గాలివాటమేమీ ఇటలీ యువతార యానిక్ సినెర్ నిరూపించాడు. టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో నాలుగో సీడ్ సినెర్ చాంపియన్‌గా అవతరించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సినెర్ 3–6, 3–6, 6–4, 6–4, 6–3తో ప్రపంచ మూడో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. తద్వారా 1976 తర్వాత పురుషుల సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన ఇటలీ ప్లేయర్ గా, ఆ్రస్టేలియన్ ఓపెన్ సాధించిన తొలి ఇటలీ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 3 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 22 ఏళ్ల సినెర్ తొలి రెండు సెట్లు కోల్పోయినా ఆందోళన చెంద లేదు. మూడో సెట్ నుంచి సినెర్ నెమ్మదిగా లయలోకి వచ్చాడు. కెరీర్లో ఆరోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న మెద్వెదెవ్పై ఒత్తిడి తెచ్చాడు. మూడో సెట్ పదో గేమ్‌లో, నాలుగో సెట్ పదో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌లను బ్రేక్ చేసిన సినెర్ రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లో ఆరో గేమ్‌లో మెద్వెదెవ్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన సినెర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. విజేత సినెర్‌కు 31 లక్షల 50 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు), రన్నరప్ మెద్వెదెవ్కు 17 లక్షల 25 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 42 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
జొకోవిచ్ రికార్డు
పారిస్: కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ రికార్డు సృష్టిస్తూ 17వసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో రాఫెల్ నాదల్ అత్యధికంగా 16 సార్లు క్వార్టర్ ఫైనల్ చేరగా... నాదల్‌తో సమంగా ఉన్న జొకోవిచ్ తాజా విజయంతో ఈ స్పెయిన్ దిగ్గజాన్ని దాటి ముందుకు వెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో యువాన్ పాబ్లో వారిలాస్ (పెరూ)పై గెలుపొందాడు. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏడు ఏస్‌లు సంధించాడు. ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన అతను నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఓవరాల్‌గా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అత్యధికసార్లు క్వార్టర్ ఫైనల్ చేరిన రికార్డు ఫెడరర్ (స్విట్జర్లాండ్; 58 సార్లు) పేరిట ఉంది. జొకోవిచ్ (55 సార్లు) రెండో స్థానంలో, నాదల్ (47 సార్లు) మూడో స్థానంలో, జిమ్మీ కానర్స్ (41 సార్లు) నాలుగో స్థానంలో, రాయ్ ఎమర్సన్ (37 సార్లు) ఐదో స్థానంలో ఉన్నారు. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా)తో జొకోవిచ్ ఆడతాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఖచనోవ్ 1–6, 6–4, 7–6 (9/7), 6–1తో సొనెగో (ఇటలీ)పై నెగ్గాడు. అల్కరాజ్ అలవోకగా... ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) మరో అలవోక విజయంతో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. అల్కరాజ్ 6–3, 6–2, 6–2తో లొరెంజె ముజెట్టి (ఇటలీ)పై గెలిచాడు. ఆరు ఏస్‌లు సంధించిన అల్కరాజ్, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), సెబాస్టియన్ ఆఫ్నర్ (ఆ్రస్టియా) మధ్య ప్రిక్వార్టర్ ఫైనల్ విజేతతో క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు. పావ్లీచెంకోవా ముందంజ... మహిళల సింగిల్స్ విభాగంలో 2021 రన్నరప్ పావ్లీచెంకోవా (రష్యా), ముకోవా (చెక్ రిపబ్లిక్), స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో పావ్లీచెంకోవా 3 గంటల 9 నిమిషాల్లో 3–6, 7–6 (7/3), 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించగా... ముకోవా 6–4, 6–3తో అవనెస్యాన్ (రష్యా)పై గెలిచింది. స్వితోలినా గంటా 56 నిమిషాల్లో 6–4, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా)ను బోల్తా కొట్టించింది. కసత్కినా ఓటమితో ప్రస్తుతం మహిళల సింగిల్స్‌లో టాప్–10లో నలుగురు మాత్రమే బరిలో మిగిలారు. 44 ఏళ్ల తర్వాత... బ్రెజిల్‌కు చెందిన 14వ సీడ్ బీత్రిజ్ హదాద్ మాయ మూడో రౌండ్ మ్యాచ్‌లో 5–7, 6–4, 7–5తో ఎకతెరీనా అలెగ్జాండ్రోవా (రష్యా)పై నెగ్గి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. అంతేకాకుండా 44 ఏళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన బ్రెజిల్ క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. బ్రెజిల్ తరఫున చివరిసారి 1979లో పాట్రిసియా మెద్రాడో ఈ ఘనత సాధించింది. -
Australian Open 2023: ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 28 విన్నర్స్ కొట్టిన అతడు 22 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఐదుసార్లు దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కథ ముగిసింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన ముర్రే మూడో రౌండ్లో మాత్రం పుంజుకోలేకపోయాడు. బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–1, 6–7 (7/9), 6–3, 6–4తో ముర్రేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2004 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా నలుగురు అమెరికా ఆటగాళ్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సబలెంకా, గార్సియా ముందంజ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ ల్లో సబలెంకా 6–2, 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, గార్సియా 1–6, 6–3, 6–3తో లౌరా సీగెముండ్ (జర్మనీ)పై, బెన్‌చిచ్ 6–2, 7–5తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచారు. -
Wimbledon 2022: ముగిసిన సానియా పోరాటం.. సెమీస్‌లో నిష్క్రమణ
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో భారత టెన్నిస్ యోధురాలు సానియా మీర్జా 21 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ఎండ్‌కార్డ్ పడింది.కెరీర్లో ఆఖరి వింబుల్డన్ ఆడుతున్న సానియా.. ఈ గ్రాండ్‌స్లామ్‌లో ఒక్క మిక్స్డ్ డబుల్స్ టైటిల్ కూడా గెలవకుండానే కెరీర్‌కు ముగింపు పలుకనుంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో క్రొయేషియా ఆటగాడు మేట్ పావిచ్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా బుధవారం అర్థరాత్రి జరిగిన ఈ సెమీఫైనల్లో ఆమెరికన్-బ్రిటిష జంట డెసిరే క్రాజిక్, నీల్ స్కుప్స్కీ చేతిలో 6-4, 5-7, 4-6తో పరాజయంపాలైంది. వింబుల్డన్ మినహా సానియా ఖాతాలో మిగిలిన మూడు గ్రాండ్‌స్లామ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ (యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్) ఉన్నాయి. ఓవరాల్‌గా సానియా ఖాతాలో మొత్తం ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ సీజన్ ఆఖరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్ తర్వాత సానియా టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. సానియా గెలిచిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ వివరాలు.. మిక్స్డ్ డబుల్స్: 2009 ఆస్ట్రేలియా ఓపెన్ 2012 ఫ్రెంచ్ ఓపెన్ 2014 యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్: 2015 వింబుల్డన్ 2015 యూఎస్ ఓపెన్ 2016 ఆస్ట్రేలియా ఓపెన్ చదవండి: Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం -
నాదల్ నమోనమః
ఈసారీ ఎలాంటి సంచలనం చోటు చేసుకోలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. ఎర్రమట్టి కోర్టులపై మకుటం లేని మహరాజు తానేనని మరోమారు స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ గుర్తు చేశాడు. 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచాడు. ఫైనల్లో టాప్ సీడ్, నంబర్‌వన్ జొకోవిచ్‌ను చిత్తుగా ఓడించిన నాదల్ కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన ప్లేయర్‌గా స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ పేరిట ఉన్న రికార్డును నాదల్ సమం చేశాడు. పారిస్: సాధారణంగా ప్రతి యేటా ఫ్రెంచ్ ఓపెన్ మే–జూన్ మాసాల్లో జరుగుతుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్–అక్టోబర్‌లో నిర్వహించాల్సి వచ్చింది. తేదీలు మారినా పురుషుల సింగిల్స్ విభాగంలో మాత్రం విజేత మారలేదు. ఫైనల్లో తన అజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ 13వసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 2 గంటల 41 నిమిషాల్లో 6–0, 6–2, 7–5తో జొకోవిచ్‌ను ఓడించాడు. టోర్నీ మొత్తంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా నాదల్ టైటిల్ నెగ్గడం ఇది నాలుగోసారి. విజేతగా నిలిచిన నాదల్కు 16 లక్షల యూరోలు (రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్ జొకోవిచ్‌కు 8,50,500 యూరోలు (రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► ఈ ఏడాది పూర్తిగా ఆడిన మ్యాచ్‌ల్లో ఒక్కసారీ ఓటమి చవిచూడని (యూఎస్ ఓపెన్‌లో తన తప్పిదంతో మ్యాచ్‌ను వదులుకున్నాడు) జొకోవిచ్ ఫ్రెంచ్ ఫైనల్లో మాత్రం తేలిపోయాడు. తొలి సెట్లో ఒక్కసారీ తన సర్వీస్‌ను నిలబెట్టుకోలేకపోయాడు. జొకోవిచ్ సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌నూ మూడుసార్లు నిలబెట్టుకొని నాదల్ 48 నిమిషాల్లో తొలి సెట్‌ను 6–0తో సొంతం చేసుకున్నాడు. ► రెండో సెట్లోనూ పరిస్థితి మారలేదు. నాదల్ తన జోరు పెంచగా... జొకోవిచ్ సమాధానం ఇవ్వలేకపోయాడు. అతికష్టమ్మీద రెండు గేమ్‌లు గెల్చుకున్న సెర్బియా స్టార్ 51 నిమిషాల్లో రెండో సెట్నున కోల్పోయాడు. ► మూడో సెట్లో జొకోవిచ్ తేరుకున్నాడు. తొలి రెండు సర్వీస్‌లను నిలబెట్టుకున్నాడు. కానీ ఐదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 3–2తో ముందంజ వేశాడు. కానీ వెంటనే నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ స్కోరును 3–3తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ వరుసగా రెండు గేముల్లో తమ సర్వీస్‌లను కాపాడుకున్నాడు. పదకొండో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన నాదల్ 6–5తో ఆధిక్యంలోకి వెళ్లాడు. 12వ గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్ సంధించి గేమ్‌తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో నాదల్ సాధించిన విజయాలు. ఫెడరర్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 100 విజయాలు నమోదు చేసిన రెండో ప్లేయర్ నాదల్. ఫెడరర్ రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 102; వింబుల్డన్‌లో 101) వంద కంటే ఎక్కువ విజయాలు సాధించాడు. తన ప్రొఫెషనల్ కెరీర్లో నాదల్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య: 999 ఈ ఏడాది చాలా కఠినంగా ఉంది. 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో ఫెడరర్ రికార్డును సమం చేసినా... అది ఒక అంకె మాత్రమే. నిజాయితీగా చెప్పాలంటే ఫ్రెంచ్ ఓపెన్ నాకెప్పటికీ ప్రత్యేకమే. నా కెరీర్లో గొప్ప క్షణాలన్నీ ఇక్కడే వచ్చాయి. ఫ్రెంచ్ ఓపెన్‌తో, పారిస్ నగరంతో నా ప్రేమానుబంధం చిరస్మరణీయమైనది. –రాఫెల్ నాదల్ -
నాదల్ విజయనాదం
అద్భుతం ఆ పోరు... అనూహ్యం ఆ పోరాటం... దాదాపు ఐదు గంటల సమరంలో అంతిమ విజేతగా నిలిచేందుకు సాగించిన అసమాన, అసాధారణ ఆట... అపార అనుభవం ఒకరిదైతే, అంతులేని ఆత్మవిశ్వాసం మరొకరిది... ‘బిగ్ 3’లలో ఏ ఇద్దరైనా పోటీ పడినప్పుడు మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ రసవత్తరం, మిగతా మ్యాచ్‌లన్నీ ఏకపక్షం అంటూ తీర్మానించుకున్న అభిమానులు అయ్యో చూడలేకపోయామే అని ఆ తర్వాత వగచిన క్షణం ఇది! ఇలాంటి ఘనాఘన హోరాహోరీ సమరంలో చివరకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌దే పైచేయి అయింది. యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నాలుగోసారి గెలుచుకొని నాదల్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోగా... చివరి వరకు తలవంచని రష్యా కుర్రాడు మెద్వెదేవ్ రన్నరప్‌గానే ముగించాడు. తొలి రెండు సెట్లను స్పెయిన్ బుల్ సొంతం చేసుకున్న తర్వాత ఇక లాంఛనమే అనిపించిన మ్యాచ్‌లో తర్వాతి రెండు సెట్లు సాధించి మెద్వెదేవ్ ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ తనదైన పదునైన ఆటతో నాదల్ మళ్లీ లయ అందుకొని విజేతగా మారాడు. ఫెడరర్ ఆల్‌టైమ్ గ్రేట్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు మరో అడుగు దూరంలోనే నిలిచాడు. న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈ టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలై సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ముగిసిన ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 5–7, 4–6, 6–4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు. పోటాపోటీగా సాగిన ఐదు సెట్ల ఈ పోరాటం 4 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేయడం విశేషం. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ రన్నరప్‌గా సంతృప్తి పడాల్సి వచ్చింది. నాదల్ గతంలో 2010, 2013, 2017లలో యూఎస్ ఓపెన్ గెలిచాడు. నాదల్ (62)కంటే ఎక్కువ విన్నర్లు (75) కొట్టినా... 57 అనవసర తప్పిదాలు మెద్వెదేవ్ ఓటమికి కారణమయ్యాయి. విజేత నాదల్కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. నాదల్ జోరు... ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నాదల్కు సరైన ఆరంభం లభించలేదు. అతని ఫోర్హ్యాండ్లలో ధాటి లేకపోవడంతో మెద్వెదేవ్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మూడో గేమ్‌ను బ్రేక్ చేసిన రష్యన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమయ్యాడు. తర్వాతి 10 పాయింట్లలో 8 గెలుచుకొని దూసుకుపోగా... స్కోరు 5–5కు చేరిన తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న నాదల్ మళ్లీ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ నాదల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బేస్‌లైన్ వద్దనుంచే చక్కటి రిటర్న్‌లతో మెద్వెదేవ్పై ఒత్తిడి పెంచిన అతను 48 నిమిషాల్లోనే అలవోకగా సెట్‌ను సాధించాడు. అనూహ్య ప్రతిఘటన... పరిస్థితి చూస్తే మరో సెట్‌తో పాటు మ్యాచ్ కూడా ఇదే తరహాలో ముగుస్తుందని అనిపించింది. అయితే మెద్వెదేవ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మరో మూడు గేమ్‌లు గెలిస్తే నాదల్ విజేతగా నిలుస్తాడనగా రష్యన్ ప్రతిఘటించాడు. 2–3తో వెనుకబడి ఉన్న దశ నుంచి తర్వాతి 7 గేమ్‌లలో 5 గెలుచుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. నాలుగో సెట్లో మెద్వెదేవ్ మరింత దూకుడు ప్రదర్శించాడు. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన అతను పదో గేమ్‌లో కూడా మరో రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని ముందంజ వేశాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్ అతని ఖాతాలో చేరింది. హోరాహోరీ... 64 నిమిషాల పాటు సాగిన చివరి సెట్లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు. అయితే అనుభవాన్నంతా రంగరించిన నాదల్ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకొని స్కోరు 2–2కు చేరిన తర్వాత నాదల్ రెండు బ్రేక్‌లు సహా వరుసగా మూడు గేమ్‌లు గెలుచుకొని 5–2తో విజయానికి చేరువయ్యాడు. అయితే పోరాటం వదలని మెద్వెదేవ్ కూడా మళ్లీ రెండు గేమ్‌లు సాధించి స్కోరు 4–5కు తీసుకొచ్చాడు. ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిపోయిన సమయంలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్ చేశాడు. ఒక దశలో 30–30, 40–40తో మెద్వెదేవ్ పోటీనిచ్చినా... చివరకు నాదల్‌నే విజయం వరించింది. మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ కోర్టు బయట పడటంతో నాదల్ భావోద్వేగంతో కూలిపోయాడు. నా టెన్నిస్ కెరీర్లో నేను ఎంతో భావోద్వేగానికి లోనైన రోజుల్లో ఇది ఒకటి. చివరి మూడు గంటలు హోరాహోరీగా పోరు సాగింది. ఫైనల్ జరిగిన తీరు, దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ మళ్లీ కష్టంగా మారిపోవడం, మళ్లీ కోలుకోవడం చూస్తే నా దృష్టిలో ఈ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గెలవాలంటే ఈ మాత్రం శ్రమించాల్సిందే. స్క్రీన్‌పై నా గత టైటిల్స్‌ను చూడటం, ఆ విజయాలను గుర్తు చేసుకోవడం గర్వంగా, ప్రత్యేకంగా అనిపించింది. అందుకే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మెద్వెదేవ్ తన పోరాటంతో మ్యాచ్ దిశను మార్చేసిన తీరు అద్భుతం. మున్ముందు అతను ఎన్నో విజయాలు సాధించడం ఖాయం. భవిష్యత్తులో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవాలని నేనూ కోరుకుంటున్నా. అయితే అత్యధిక స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా నిలవకపోయినా నేను ప్రశాంతంగా నిద్రపోగలను. –నాదల్ విజయం ఖాయమైన క్షణాన... నాదల్ భావోద్వేగం -
నాదల్ రికార్డుపై జొకోవిచ్ గురి
కాలిఫోర్నియా (అమెరికా): వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించి జోరు మీదున్న ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరో మేటి టైటిల్‌పై గురి పెట్టాడు. గురువారం మొదలయ్యే సీజన్ తొలి మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటికే కెరీర్లో 32 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన ఈ సెర్బియా స్టార్ మరో టైటిల్ నెగ్గితే... అత్యధికంగా 33 మాస్టర్స్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్‌గా రాఫెల్ నాదల్ (స్పెయిన్) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తాడు. అయితే మేటి క్రీడాకారులందరూ పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో జొకోవిచ్ విజేతగా నిలవాలంటే మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. రాఫెల్ నాదల్, ఫెడరర్, అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నిషికోరి (జపాన్), కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా), జాన్ ఇస్నెర్ (అమెరికా), యువతార సిట్సిపాస్ (గ్రీస్), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) తదితరులు కూడా ఈ టోర్నీ టైటిల్ రేసులో ఉన్నారు. తొలి రౌండ్లో సాకేత్ పరాజయం సాక్షి, హైదరాబాద్: జుహై ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 4–6, 6–4, 4–6తో ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్ ఎనిమిది ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సిమోనాహలెప్
-
'వావ్'రింకా
కొన్నేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ వచ్చిందంటే జొకోవిచ్, ఫెడరర్, నాదల్, ముర్రేలను టైటిల్ ఫేవరెట్స్‌గా పరిగణించడం ఆనవాయితీగా వస్తోంది. గత 47 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఈ నలుగురే 43 టైటిల్స్‌ను పంచుకోవడం వారి ఆధిపత్యాన్ని సూచిస్తోంది. ఇక నుంచి ఆ నలుగురితోపాటు వావ్రింకాను కూడా కచ్చితమైన ఫేవరెట్స్ జాబితాలో పరిగణించే సమయం వచ్చేసింది. ఇన్నాళ్లూ ‘ఆ నలుగురి’ ఆధిపత్యంలో ప్రాచుర్యం పొందలేకపోయిన స్విస్ స్టార్ యూఎస్ ఓపెన్ టైటిల్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. జొకోవిచ్‌కు మళ్లీ షాక్ * యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్విస్ స్టార్ * రూ. 23 కోట్ల 41 లక్షల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: కెరీర్లో 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు మరోసారి భంగపాటు ఎదురైంది. గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో తనను ఓడించి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ అవకాశాన్ని అడ్డుకున్న స్టానిస్లాస్ వావ్రింకా(స్విట్జర్లాండ్)నే మరోసారి ఈ సెర్బియా యోధుడికి షాక్ ఇచ్చాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ వావ్రింకా 6-7 (1/7), 6-4, 7-5, 6-3తో టాప్ సీడ్ జొకోవిచ్‌ను ఓడించాడు. తద్వారా వావ్రింకా సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో కొత్త చాంపియన్‌గా అవతరించాడు. విజేతగా నిలిచిన వావ్రింకాకు 35 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 41 లక్షలు), జొకోవిచ్‌కు 17 లక్షల 50 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 70 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఏకంగా 3 గంటల 54 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో వావ్రింకా పోరాటపటిమ ముందు జొకోవిచ్ తలవంచక తప్పలేదు. ఈ టోర్నీలో డానియల్ ఇవా న్స్ (బ్రిటన్)తో జరిగిన మూడో రౌండ్లో వావ్రింకా మ్యాచ్ పారుుంట్‌ను కాపాడుకున్నాడు. ఆఖరికి టోర్నీ విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. ఓవరాల్‌గా వావ్రింకాకిది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను వావ్రింకా గెలిచాడు. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలిచే క్రమంలో క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌ను వావ్రింకా ఓడించాడు. జొకోవిచ్పై గెలిచిన మూడు గ్రాండ్‌స్లామ్స్‌లో వావ్రింకాకు టైటిల్ దక్కడం విశేషం. నెమ్మదిగా మొదలుపెట్టి... వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం నాలుగు సెట్లు ఆడి ఫైనల్‌కు చేరిన వావ్రింకా తుది పోరులోనూ ఆరంభంలో తడబడ్డాడు. ఒకదశలో 2-5తో వెనుకబడ్డాడు. అరుుతే నెమ్మదిగా జోరు పెంచి స్కోరును 5-5తో సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం చలాయించి 58 నిమిషాల్లో తొలి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో వావ్రింకా ఆటతీరు మెరుగైంది. తన ప్రధాన ఆయుధమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లతో ఈ స్విస్ స్టార్ చెలరేగిపోయాడు. నాలుగో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి, ఆ తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకొని 4-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం పదో గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన వావ్రింకా రెండో సెట్‌ను 47 నిమిషాల్లో గెలుపొంది ఫామ్‌లోకి వచ్చాడు. మూడో సెట్లో ఇద్దరూ ప్రతి పారుుంట్ కోసం పోరాడారు. చివరకు 12వ గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన వావ్రింకా ఈ సెట్‌ను 76 నిమిషాల్లో దక్కించుకున్నాడు. నాలుగో సెట్ వచ్చేసరికి ఇద్దరూ అలసిపోరుునట్లు కనిపించారు. జొకోవిచ్ పాదానికి గాయం కావడంతో అతను చురుకుగా కదల్లేకపోయాడు. మరోవైపు వావ్రింకా అలసిపోరుునా పట్టువదలకుండా పోరాడుతూ జొకోవిచ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొమ్మిదో గేమ్‌లో వావ్రింకా సర్వీస్‌లో జొకోవిచ్ కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో ఈ స్విస్ స్టార్‌కు విజయం ఖాయమైంది. బాధను ఆస్వాదించా... ‘‘ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్‌ను ఓడించాలంటే శాయశక్తులా పోరాడాలి. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మ్యాచ్ ముగిశాక నా వద్ద ఎలాంటి శక్తి మిగల్లేదు. అంతా మ్యాచ్‌లోనే ధారపోశాను. ఫైనల్ సందర్భంగా నా బలహీనతలు ప్రదర్శించకూడాదని నిర్ణయించుకున్నాను. కండరాలు పట్టేసినా, నొప్పి ఉన్నా భరించాను. బాధను ఆస్వాదిస్తూ ఆడాను. ఆఖరికి విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది.’’ - వావ్రింకా 11 టెన్నిస్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో మూడింటిని నెగ్గిన 11వ ప్లేయర్ వావ్రింకా. 2 కెన్ రోజ్‌వెల్ (35 ఏళ్లు-1970లో) తర్వాత యూఎస్ ఓపెన్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా వావ్రింకా (31 ఏళ్లు) నిలిచాడు. 5 30 ఏళ్లు దాటాక కనీసం రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఐదో ప్లేయర్ వావ్రింకా. 1 యూఎస్ ఓపెన్‌లో తొలి సెట్ గెలిచాక మ్యాచ్ ఓడిపోవడం జొకోవిచ్‌కిదే తొలిసారి. -
సెరెనాపై ముగురుజా సంచలన విజయం
-
మట్టి కోటలో కొత్త రాణి
► ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా ► ఫైనల్లో సెరెనాపై సంచలన విజయం ► రూ. 15 కోట్ల 18 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ‘ఈ ఓటమి గురించి బాధపడకు. ఏనాటికైనా నీవు గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధిస్తావు’... గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ముగురుజాపై నెగ్గిన తర్వాత సెరెనా విలియమ్స్ తన ప్రత్యర్థి ఆటతీరుపై చేసిన వ్యాఖ్య ఇది. ఏడాది కాకుండానే సెరెనా అంచనా నిజమైంది. స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌గా అవతరించింది. ఎర్ర మట్టి కోర్టులపై జరిగే ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ స్పెయిన్ అమ్మాయి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను బోల్తా కొట్టించిన ముగురుజా కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మరోవైపు 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గి స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేయాలని ఆశించిన సెరెనాకు నిరాశే మిగిలింది. పారిస్: గత తొమ్మిదేళ్లుగా వస్తోన్న ఆనవాయితీ ఈసారీ కొనసాగింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంలో మళ్లీ విఫలమైంది. అంచనాలకు మించి రాణించిన స్పెయిన్ యువతార గార్బిన్ ముగురుజా... అద్వితీయ ఆటతీరుతో అదుర్స్ అనిపించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా అవతరించింది. శనివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ ముగురుజా 7-5, 6-4తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా)పై సంచలన విజయం సాధించింది. ఈ విజయంతో 22 ఏళ్ల ముగురుజా తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా క్లే కోర్టులపై ఆడిన తొలి ఫైనల్లోనే ట్రోఫీని దక్కించుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు 20 లక్షల యూరోలు (రూ. 15 కోట్ల 18 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 10 లక్షల యూరోలు (రూ. 7 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ► రెండేళ్ల క్రితం ఫ్రెంచ్ ఓపెన్ రెండో రౌండ్లో సెరెనాను ఓడించి పెను సంచలనం సృష్టించిన ముగురుజా గతేడాది వింబుల్డన్ ఫైనల్లో ఈ అమెరికా స్టార్ చేతిలో ఓడిపోయింది. అయితే వింబుల్డన్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న ముగురుజా ఈసారి పక్కా ప్రణాళికతో ఆడి సెరెనాకు ఓటమి రుచి చూపించింది. ► నాలుగు ఏస్‌లు సంధించి, తొమ్మిది డబుల్ ఫాల్ట్‌లు చేసిన ముగురుజా కీలకదశల్లో సెరెనా సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయడం తుది ఫలితంపై ప్రభావం చూపింది. ముగురుజా కంటే ఎక్కువ విన్నర్స్ కొట్టినా... తక్కువ అనవసర తప్పిదాలు చేసినా... సెరెనా తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. ► తొలి సెట్ ఐదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌ను కాపాడుకొని 4-2తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఎనిమిదో గేమ్‌లో ముగురుజా సర్వీస్‌ను బ్రేక్ చేసిన సెరెనా స్కోరును 4-4తో సమం చేసింది. 11వ గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ముగురుజా తన సర్వీస్‌నూ కాపాడుకోవడంతో సెట్‌ను దక్కించుకుంది. ► రెండో సెట్లోనూ ముగురుజా నిలకడగా ఆడింది. సెరెనాపై ఒత్తిడిని కొనసాగించింది. దాంతో ఈ సెట్లోనూ సెరెనా రెండుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఈ అమెరికా స్టార్ తేరుకోలేకపోయింది. ► 1998లో అరంటా శాంచెజ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. ► తాజా విజయంతో సోమవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ముగురుజా రెండో స్థానానికి ఎగబాకుతుంది. 2000లో అరంటా శాంచెజ్ తర్వాత మరోసారి ఓ స్పెయిన్ క్రీడాకారిణి రెండో ర్యాంక్‌ను అందుకోవడం ఇదే ప్రథమం. ► చివరి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ముగ్గురు కొత్త విజేతలు రావడం విశేషం. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)... ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఫ్రెంచ్ ఓపెన్‌లో ముగురుజా టైటిల్స్ సాధించారు. ► గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో సెరెనాను ఓడించిన ఆరో క్రీడాకారిణిగా ముగురుజా నిలిచింది. గతంలో వీనస్ (2001 యూఎస్, 2008 వింబుల్డన్), షరపోవా (2004 వింబుల్డన్), సమంతా స్టోసుర్ (2011 యూఎస్ ఓపెన్), ఎంజెలిక్ కెర్బర్ (2016 ఆస్ట్రేలియన్ ఓపెన్) మాత్రమే సెరెనాను గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో ఓడించారు. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకాలం నేను పడిన శ్రమకు ఫలితం వచ్చింది. క్లే కోర్టులపై ఆడుతూనే పెరిగాను. ఈ గెలుపు నాతోపాటు స్పెయిన్‌కు ఎంతో ప్రత్యేకం. వచ్చే ఏడాది మళ్లీ ఇక్కడకు వస్తాను -ముగురుజా -
'పద్మ భూషణ్' ను గౌరవంగా భావిస్తున్నా: సానియా
హైదరాబాద్: ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్స్ ను తన ఖాతాలో వేసుకున్న భారత టెన్నిస్ స్టార్, టాప్ సీడ్ సానియా మీర్జా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సానియాను స్థానిక మీడియా పలకరించింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో మూడోదైన ‘పద్మ భూషణ్’ను సానియాకు ఫ్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సానియా.. పద్మ భూషణ్ లభించడం నాకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. భవిష్యత్ లో మరిన్ని గొప్ప విజయాలు సాధించేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తుందని సానియా అభిప్రాయపడింది. ఒకవైపు మహిళల డబుల్స్ టైటిల్, మరొవైపు పద్మ భూషణ్ సత్కారం.. తనకు లభించడం చాలా సంతోషాన్ని కలిగించిందంటూ సానియా మీర్జా తన మనసులోని అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. -
సెరెనా vs షరపోవా
నేడు మహిళల ఫైనల్ మ. గం. 2.00 నుంచి సోనీ సిక్స్‌లో లైవ్ కెరీర్లో 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొరకు సెరెనా... సెరెనా చేతిలో వరుసగా ఎదురైన 16 పరాజయాల పరంపరకు తెరదించాలనే లక్ష్యంతో షరపోవా... శనివారం జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో బరిలోకి దిగనున్నారు. గతంలో సెరెనా ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరిన ఐదుసార్లూ విజేతగా నిలిచింది. మరోవైపు 2004 నుంచి సెరెనాపై ఏ టోర్నీలోనూ షరపోవా నెగ్గలేకపోయింది. -
మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ గెలవాలి
సానియా ఆకాంక్ష ముంబై: కెరీర్‌కు వీడ్కోలు చెప్పేలోగా మహిళల డబుల్స్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలవాలని భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కోరుకుంటోంది. కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి డబ్ల్యూటీఏ ఫైనల్స్ డబుల్స్ టైటిల్‌ను గెలిచినా... గ్రాండ్‌స్లామ్ ట్రోఫీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘మూడుసార్లు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ గెలిచా. ఇప్పుడు ప్రపంచ చాంపియన్‌షిప్‌నూ గెలిచా. ఇక మిగిలింది మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిలే. అందుకే దీనిపై దృష్టిపెట్టా’ అని సానియా వ్యాఖ్యానించింది. 2011 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎలెనా వెస్నినా (రష్యా)తో కలిసి డబుల్స్ ఫైనల్‌కు చేరుకున్నా... రన్నరప్‌తో సరిపెట్టుకుంది. వచ్చే ఏడాది మహిళల డబుల్స్ భాగస్వామి సు వీ సీహ్ (చైనీస్‌తైపీ)తో కలిసి ఆడటంపై ఉత్సాహంగా ఉన్నానని చెప్పింది. -
యూఎస్ ఓపెన్‌లో సెరెనా ‘హ్యాట్రిక్’
ఒకవైపు వయస్సు మూడు పదులు దాటింది. మరోవైపు తెరపైకి యువ క్రీడాకారిణులు దూసుకొస్తున్నారు. ఇంకోవైపు ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలోనూ కనీసం నాలుగో రౌండ్‌ను దాటలేకపోయింది. ఇంకేముంది... అందరూ సెరెనా విలియమ్స్ పనైపోయిందన్నారు. కానీ ఈ నల్లకలువ మాత్రం కష్టకాలంలో అందరిలా చింతిస్తూ డీలాపడలేదు. అనవసరంగా ఒత్తిడికి లోనై మరింతగా కుంగిపోలేదు. పొరపాట్లను సరిదిద్దుకుని సొంతగడ్డపై నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. అందరి నోళ్లు మూతపడేలా మరోసారి ‘గ్రాండ్’ విజయాన్ని సాధించి నవ్వులు చిందించింది. * ఆరోసారి ప్రతిష్టాత్మక టైటిల్ వశం * కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ హస్తగతం * నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ సరసన చేరిక * రూ. 24 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం న్యూయార్క్: ఈ ఏడాది ఎదురైన అన్ని వైఫల్యాలను ఒక్కసారిగా మరచిపోయేలా అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ అదుర్స్ అనిపించింది. తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్‌లో ఆరోసారి విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 75 నిమిషాల్లో 6-3, 6-3తో పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది చాంపియన్‌గా నిలిచిన సెరెనా ‘హ్యాట్రిక్’ను పూర్తి చేసింది. 32 ఏళ్ల సెరెనాకిది ఓవరాల్‌గా ఆరో యూఎస్ ఓపెన్ టైటిల్‌కాగా... కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్. అదే జోరు... ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీల్లో నాలుగో రౌండ్ దాటలేకపోయిన సెరెనా యూఎస్ ఓపెన్‌లో మాత్రం ఆద్యంతం పూర్తి విశ్వాసంతో ఆడింది. ఫైనల్ చేరుకునే క్రమంలో తన ప్రత్యర్థులకు గరిష్టంగా ఒక్కో సెట్లో మూడు గేమ్‌లు సమర్పించుకున్న సెరెనా అదే ఆనవాయితీని టైటిల్ పోరులో కొనసాగించింది. మ్యాచ్ తొలి గేమ్‌లోనే తన సర్వీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడిన సెరెనా ‘ఏస్’తో కాపాడుకుంది. ఆ తర్వాత రెండో గేమ్‌లో వొజ్నియాకి సర్వీస్‌ను బ్రేక్ చేసి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే రెండోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడుతోన్న వొజ్నియాకి గట్టిపోటీనిచ్చినా సెరెనా అనుభవం ముందు తడబడింది. తొమ్మిదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని సెరెనా తొలి సెట్‌ను 40 నిమిషాల్లో 6-3తో దక్కించుకుంది. సెరెనా రెండో సెట్లోనూ దూకుడుగా ఆడింది. మరోవైపు వొజ్నియాకికి అదృష్టం కూడా కలిసిరాలేదు. 20 షాట్ల ర్యాలీలో వొజ్నియాకి కొట్టిన షాట్ నెట్‌కు తగలడంతో రెండో సెట్లోని తొలి గేమ్‌లోనే సెరెనాకు బ్రేక్ లభించింది. వొజ్నియాకి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సెరెనా జోరుకు కళ్లెం వేయలేకపోయింది. కోర్టులోని అన్ని కోణాల్లో నుంచి సెరెనా పాయింట్లు గెలుస్తుండటంతో ఈ డెన్మార్క్ భామ ఏమీ చేయలేకపోయింది. తొమ్మిదో గేమ్‌లో వొజ్నియాకి కొట్టిన బ్యాక్‌హాండ్ షాట్ కోర్టు బయటకు వెళ్లడంతో సెరెనా విజయం ఖాయమైంది. మ్యాచ్ మొత్తంలో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. నెట్ వద్దకు 15సార్లు దూసుకొచ్చి 13 పాయింట్లు నెగ్గింది. తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. తాజా విజయంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన వారి జాబితాలో సెరెనా (18 టైటిల్స్) ఉమ్మడిగా నాలుగో స్థానానికి చేరుకొని... దిగ్గజాలు మార్టినా నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ (అమెరికా) సరసన చేరింది. ఈ జాబితాలో మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్-ఆస్ట్రేలియా), స్టెఫీ గ్రాఫ్ (22 టైటిల్స్-జర్మనీ), హెలెన్ విల్స్ మూడీ (19 టైటిల్స్-అమెరికా) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. విజేతగా నిలిచిన సెరెనాకు 30 లక్షల డాలర్లు (రూ. 18 కోట్లు)... యూఎస్ ఓపెన్‌కు సన్నాహకంగా నిర్వహించిన టోర్నీల్లో రాణించినందుకు అదనంగా మరో 10 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. టెన్నిస్ చరిత్రలో ఏకకాలంలో ఒక్కరే 40 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకోవడం ఇంతకుముందెప్పుడూ జరగలేదు. రన్నరప్ వొజ్నియాకికి 14 లక్షల 50 వేల డాలర్ల (రూ. 8 కోట్ల 73 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది. చాంపియన్ సెరెనాకు నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ కలిసి విన్నర్స్ ట్రోఫీని అందజేశారు. దాంతోపాటు 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌కు సూచికగా 18 క్యారెట్ల విలువగల గోల్డ్ బ్రేస్‌లెట్‌ను బహూకరించారు. ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోకుండా సెరెనా ఐదోసారి (2002, 2010-వింబుల్డన్‌లో; 2002, 2008, 2014-యూఎస్ ఓపెన్‌లో) గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించి స్టెఫీ గ్రాఫ్, క్రిస్ ఎవర్ట్ సరసన చేరింది. ఈ ఘనతను మార్టినా నవ్రతిలోవా అత్యధికంగా ఆరుసార్లు సాధించింది. ‘వొజ్నియాకికి అభినందనలు. నేను ఎలాంటి కష్టాలు పడ్డానో ఆమెకు తెలుసు. దాదాపు ప్రతిరోజూ మేమిద్దరం మాట్లాడుకుంటాం. త్వరలోనే వొజ్నియాకి కూడా గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అవుతుంది. అది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సాధ్యం కావచ్చు. 18వ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం ఆనందాన్నిస్తోంది. ఈ ఘనత సాధించడానికి ఇంతకంటే మంచి వేదికను ఆశించలేను. ఒకవేళ నా టైటిల్స్ వేట 18తోనే ఆగిపోతే నవ్రతిలోవా, క్రిస్ ఎవర్ట్ బహూకరించిన 18 క్యారెట్ల బ్రేస్‌లెట్‌ను ఎల్లప్పుడూ ధరిస్తాను. టోర్నీ మొత్తం నేను ప్రశాంతంగా ఉన్నాను. ఈ వారంలోనే కాదు గత ఆరు నెలలుగా తీవ్రంగా సాధన చేస్తున్నాను. ఆ శ్రమకు ఇప్పడు ఫలితం కనిపిస్తోంది.’ -సెరెనా -
షరపోవా వంతు...
వొజ్నియాకి సంచలనం జంకోవిచ్ కూడా ఇంటిముఖం యూఎస్ ఓపెన్ టెన్నిస్ సీజన్‌లోని చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ ఈసారి మహిళల సీడెడ్ క్రీడాకారిణులకు కలసిరావడంలేదు. ఇప్పటికే రెండో సీడ్ సిమోనా హలెప్, మూడో సీడ్ క్విటోవా, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా, ఆరో సీడ్ కెర్బర్, ఎనిమిదో సీడ్ ఇవనోవిచ్ ఇంటిముఖం పట్టగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు. మాజీ చాంపియన్, ఐదో సీడ్ మరియా షరపోవా (రష్యా), తొమ్మిదో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్ర్కమించారు. న్యూయార్క్: ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)... కెరీర్లో కేవలం నాలుగో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న అన్‌సీడెడ్ ప్లేయర్ బెలిండా బెన్సిక్ (స్విట్జర్లాండ్) యూఎస్ ఓపెన్‌లో సంచలన విజయాలు నమోదు చేశారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పదో సీడ్ వొజ్నియాకి 6-4, 2-6, 6-2తో షరపోవాపై... బెలిండా 7-6 (8/6), 6-3తో జంకోవిచ్‌పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన షరపోవా మిగతా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం గమనార్హం. వొజ్నియాకితో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో షరపోవా స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 43 అనవసర తప్పిదాలు, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసిన ఈ రష్యా బ్యూటీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా నాలుగుసార్లే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి ఫలితాన్ని అనుభవించింది. తీవ్రమైన ఎండ, ఉక్కబోత వాతావరణంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సెట్ పూర్తయ్యాక ఇద్దరు క్రీడాకారిణులకు కాస్త విరామాన్ని ఇచ్చారు. విరామం తర్వాత వొజ్నియాకి తన జోరు కొనసాగించి నాలుగో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షరపోవాపై కెరీర్లో మూడోసారి గెలిచింది. ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ ఆడుతోన్న వొజ్నియాకి గతంలో నాలుగో రౌండ్ దాటిన మూడు పర్యాయాల్లో ఒకసారి ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈసారి ఈ డెన్మార్క్ భామ ప్రస్థానం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఎరాని (ఇటలీ)తో వొజ్నియాకి తలపడుతుంది. భళా... బెలిండా తన ప్రత్యర్థి జంకోవిచ్కు ఏకంగా 45 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లు ఆడిన అనుభవం ఉన్నా... కెరీర్లో కేవలం తొమ్మిదో గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడుతోన్న 17 ఏళ్ల బెలిండా బెన్సిక్ ఎలాంటి బెదురులేకుండా ఆడింది. వరుసగా మూడో మ్యాచ్‌లో సంచలనం నమోదు చేసింది. రెండో రౌండ్లో 31వ సీడ్ కురుమి నారా (జపాన్)పై, మూడో రౌండ్లో ఆరో సీడ్ కెర్బర్ (జర్మనీ)పై నెగ్గిన బెలిండా ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ జంకోవిచ్‌ను ఇంటిముఖం పట్టించి క్వార్టర్ ఫైనల్లో షుయె పెంగ్ (చైనా)తో పోరుకు సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో షుయె పెంగ్ 6-3, 6-4తో 14వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది. ఫెడరర్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) మాత్రం మూడో రౌండ్లో వెనుదిరిగారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 4-6, 6-1, 6-1, 6-1తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై, బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో గబాష్విలి (రష్యా)పై, దిమిత్రోవ్ 0-6, 6-3, 6-4, 6-1తో గాఫిన్ (బెల్జియం)పై నెగ్గారు. 20వ సీడ్ మోన్ఫిస్ (ఫ్రాన్స్) 6-4, 6-2, 6-2తో గాస్కేను... థియెమ్ (ఆస్ట్రియా) 6-4, 6-2, 6-3తో లోపెజ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) 6-3, 6-4తో గారిగెస్ (స్పెయిన్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా)లపై గెలిచారు. క్వార్టర్స్‌లో సెరెనా, పెనెట్టా మాజీ చాంపియన్ షరపోవా ఓడిపోయినా... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), 11వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో కయి కనెపి (ఎస్తోనియా)పై, పెనెట్టా 7-5, 6-2తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)పై గెలిచారు. -
సంపాదనలో ఫెడరర్ టాప్
ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితా న్యూయార్క్: ఇటీవలి కాలంలో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేకపోయినా స్విస్ థండర్ రోజర్ ఫెడరర్ మాత్రం టెన్నిస్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఫోర్బ్స్ మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో ఫెడరర్ రూ. 337.2 కోట్ల ఆర్జనతో తనకు తిరుగులేదని పించాడు. ఫోర్బ్స్ 2013 జూలై నుంచి 2014 జూన్ వరకు క్రీడాకారుల సంపాదనను పరిగణనలోకి తీసుకున్నారు. రాఫెల్ నాదల్ రూ. 267 కోట్లతో రెం డో స్థానంలో, సెర్బియా స్టార్ జొకోవిచ్ రూ. 198.6 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. షరపోవాకు రూ. 146.4 కోట్లతో నాలుగో స్థానం దక్కగా... మహిళల్లో మాత్రం రష్యా భామ షరపోవాదే అగ్రస్థానం. -
ఫెడరర్ మరో గ్రాండ్‌స్లామ్ గెలుస్తాడు
సంప్రాస్ అభిప్రాయం లండన్: రోజర్ ఫెడరర్‌కు మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచే సత్తా ఉందని మాజీ ఆటగాడు పీట్ సంప్రాస్ అన్నాడు. మార్చి 3న ఆండ్రీ అగస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతున్న సందర్భంగా సంప్రాస్ మాట్లాడుతూ.. ఫెడరర్ మరో నాలుగేళ్లపాటు టెన్నిస్ ఆడగలడని, గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్యను 17కు చేర్చగలడని అభిప్రాయపడ్డాడు. వెన్నునొప్పి కారణంగా ఫెడరర్ 2013లో పూర్తిగా నిరాశపరిచినా.. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరాడు. ఈ క్రమంలో జో విల్ఫ్రెడ్ సోంగా, ఆండీ ముర్రే వంటి వారిని ఓడించాడు. సంప్రాస్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘ప్రస్తుతం ఫెడరర్ చక్కగా ఆడుతున్నాడు. నాదల్‌ను ఎదుర్కొంటున్నప్పుడే ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నాడు. దాన్ని అధిగమించాల్సివుంది. అతడు తన అత్యుత్తమ ఆటతీరును కనబరిస్తే మరో గ్రాండ్‌స్లామ్ సాధించగలడు’ అని అన్నాడు. ఆటను ఆస్వాదిస్తూ ఫిట్నెస్ను కాపాడుకుంటే మరో మూడు, నాలుగేళ్లు ఫెడరర్ ఆటను చూడొచ్చని సంప్రాస్ పేర్కొన్నాడు. -
వొజ్నియాకి అవుట్
న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకికి కెరీర్లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే కల కలగానే మిగిలిపోయేలా ఉంది. 23 ఏళ్ల ఈ డెన్మార్క్ భామ మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో నిరాశపరిచింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించకుండానే టాప్ ర్యాంక్‌ను అందుకున్న అతికొద్ది మంది క్రీడాకారిణుల్లో ఒకరైన వొజ్నియాకి యూఎస్ ఓపెన్‌లో ఈసారి మూడో రౌండ్లోనే నిష్ర్కమించింది. ఇదే టోర్నీలో 2009లో రన్నరప్‌గా నిలిచి, 2010, 2011లో సెమీఫైనల్‌కు చేరిన ఆరో సీడ్ వొజ్నియాకి ఈసారి క్వాలిఫయర్ కామిలా జియార్జి (ఇటలీ) చేతిలో ఓటమి పాలైంది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 136వ ర్యాంకర్ కామిలా 4-6, 6-4, 6-3తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ వొజ్నియాకిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) అతికష్టమ్మీద గెలిచింది. అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)తో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 6-7 (2/7), 6-3, 6-2తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)తో పోరుకు సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో ఇవనోవిచ్ 4-6, 7-5, 6-4తో క్రిస్టినా మెక్‌హాలె (అమెరికా)పై గెలిచింది. జాన్ ఇస్నెర్కు చుక్కెదురు పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ఆశాకిరణం, 13వ సీడ్ జాన్ ఇస్నెర్ మూడో రౌండ్లో ఓడిపోయాడు. 22వ సీడ్ కోల్‌ష్రైబర్ (జర్మనీ) 6-4,3-6, 7-5, 7-6 (7/5)తో జాన్ ఇస్నెర్‌ను ఓడించాడు. మరోవైపు మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (అమెరికా) మరో మ్యాచ్‌లో గెలిస్తే తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ముఖాముఖిగా తలపడటం ఖాయమవుతుంది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 6-3, 6-0, 6-2తో మనారినో (ఫ్రాన్స్)పై, నాదల్ 6-4, 6-3, 6-3తో డోడిగ్ (క్రొయేషియా)పై గెలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టామీ రొబ్రెడో (స్పెయిన్)తో ఫెడరర్; కోల్ష్రైబర్తో నాదల్ పోటీపడతారు.