షరపోవా వంతు...
వొజ్నియాకి సంచలనం
జంకోవిచ్ కూడా ఇంటిముఖం
యూఎస్ ఓపెన్
టెన్నిస్ సీజన్‌లోని చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ ఈసారి మహిళల సీడెడ్ క్రీడాకారిణులకు కలసిరావడంలేదు. ఇప్పటికే రెండో సీడ్ సిమోనా హలెప్, మూడో సీడ్ క్విటోవా, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా, ఆరో సీడ్ కెర్బర్, ఎనిమిదో సీడ్ ఇవనోవిచ్ ఇంటిముఖం పట్టగా... తాజాగా ఈ జాబితాలో మరో ఇద్దరు చేరారు. మాజీ చాంపియన్, ఐదో సీడ్ మరియా షరపోవా (రష్యా), తొమ్మిదో సీడ్ జెలెనా జంకోవిచ్ (సెర్బియా) ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లోనే నిష్ర్కమించారు.
న్యూయార్క్: ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)... కెరీర్‌లో కేవలం నాలుగో గ్రాండ్‌స్లామ్ ఆడుతోన్న అన్‌సీడెడ్ ప్లేయర్ బెలిండా బెన్‌సిక్ (స్విట్జర్లాండ్) యూఎస్ ఓపెన్‌లో సంచలన విజయాలు నమోదు చేశారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో పదో సీడ్ వొజ్నియాకి 6-4, 2-6, 6-2తో షరపోవాపై... బెలిండా 7-6 (8/6), 6-3తో జంకోవిచ్‌పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి చేరారు.
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన షరపోవా మిగతా మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడం గమనార్హం. వొజ్నియాకితో 2 గంటల 37 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో షరపోవా స్వీయ తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. 43 అనవసర తప్పిదాలు, ఎనిమిది డబుల్ ఫాల్ట్‌లు చేసిన ఈ రష్యా బ్యూటీ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా నాలుగుసార్లే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి ఫలితాన్ని అనుభవించింది.
తీవ్రమైన ఎండ, ఉక్కబోత వాతావరణంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రెండో సెట్ పూర్తయ్యాక ఇద్దరు క్రీడాకారిణులకు కాస్త విరామాన్ని ఇచ్చారు. విరామం తర్వాత వొజ్నియాకి తన జోరు కొనసాగించి నాలుగో గేమ్‌లో షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ షరపోవాపై కెరీర్‌లో మూడోసారి గెలిచింది.
ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ ఆడుతోన్న వొజ్నియాకి గతంలో నాలుగో రౌండ్ దాటిన మూడు పర్యాయాల్లో ఒకసారి ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు చేరుకుంది. ఈసారి ఈ డెన్మార్క్ భామ ప్రస్థానం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాలి. క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ ఎరాని (ఇటలీ)తో వొజ్నియాకి తలపడుతుంది.
భళా... బెలిండా
తన ప్రత్యర్థి జంకోవిచ్‌కు ఏకంగా 45 గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లు ఆడిన అనుభవం ఉన్నా... కెరీర్‌లో కేవలం తొమ్మిదో గ్రాండ్‌స్లామ్ మ్యాచ్ ఆడుతోన్న 17 ఏళ్ల బెలిండా బెన్‌సిక్ ఎలాంటి బెదురులేకుండా ఆడింది. వరుసగా మూడో మ్యాచ్‌లో సంచలనం నమోదు చేసింది. రెండో రౌండ్‌లో 31వ సీడ్ కురుమి నారా (జపాన్)పై, మూడో రౌండ్‌లో ఆరో సీడ్ కెర్బర్ (జర్మనీ)పై నెగ్గిన బెలిండా ప్రిక్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ జంకోవిచ్‌ను ఇంటిముఖం పట్టించి క్వార్టర్ ఫైనల్లో షుయె పెంగ్ (చైనా)తో పోరుకు సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో షుయె పెంగ్ 6-3, 6-4తో 14వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్)ను ఓడించింది.
ఫెడరర్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. అయితే 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) మాత్రం మూడో రౌండ్‌లో వెనుదిరిగారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 4-6, 6-1, 6-1, 6-1తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై, బెర్డిచ్ 6-3, 6-2, 6-4తో గబాష్‌విలి (రష్యా)పై, దిమిత్రోవ్ 0-6, 6-3, 6-4, 6-1తో గాఫిన్ (బెల్జియం)పై నెగ్గారు. 20వ సీడ్ మోన్‌ఫిస్ (ఫ్రాన్స్) 6-4, 6-2, 6-2తో గాస్కేను... థియెమ్ (ఆస్ట్రియా) 6-4, 6-2, 6-3తో లోపెజ్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న (భారత్)-స్రెబోత్నిక్ (స్లొవేనియా) 6-3, 6-4తో గారిగెస్ (స్పెయిన్)-క్లాసెన్ (దక్షిణాఫ్రికా)లపై గెలిచారు.
క్వార్టర్స్‌లో సెరెనా, పెనెట్టా
మాజీ చాంపియన్ షరపోవా ఓడిపోయినా... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), 11వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ సెరెనా 6-3, 6-3తో కయి కనెపి (ఎస్తోనియా)పై, పెనెట్టా 7-5, 6-2తో కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)పై గెలిచారు.