డానిల్ మెద్వెదేవ్, రాఫెల్ నాదల్
అద్భుతం ఆ పోరు... అనూహ్యం ఆ పోరాటం... దాదాపు ఐదు గంటల సమరంలో అంతిమ విజేతగా నిలిచేందుకు సాగించిన అసమాన, అసాధారణ ఆట... అపార అనుభవం ఒకరిదైతే, అంతులేని ఆత్మవిశ్వాసం మరొకరిది... ‘బిగ్ 3’లలో ఏ ఇద్దరైనా పోటీ పడినప్పుడు మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ రసవత్తరం, మిగతా మ్యాచ్‌లన్నీ ఏకపక్షం అంటూ తీర్మానించుకున్న అభిమానులు అయ్యో చూడలేకపోయామే అని ఆ తర్వాత వగచిన క్షణం ఇది! ఇలాంటి ఘనాఘన హోరాహోరీ సమరంలో చివరకు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్‌దే పైచేయి అయింది.
యూఎస్ ఓపెన్ టైటిల్‌ను నాలుగోసారి గెలుచుకొని నాదల్ తన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్యను 19కి పెంచుకోగా... చివరి వరకు తలవంచని రష్యా కుర్రాడు మెద్వెదేవ్ రన్నరప్‌గానే ముగించాడు. తొలి రెండు సెట్‌లను స్పెయిన్ బుల్ సొంతం చేసుకున్న తర్వాత ఇక లాంఛనమే అనిపించిన మ్యాచ్‌లో తర్వాతి రెండు సెట్‌లు సాధించి మెద్వెదేవ్ ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ తనదైన పదునైన ఆటతో నాదల్ మళ్లీ లయ అందుకొని విజేతగా మారాడు. ఫెడరర్ ఆల్‌టైమ్ గ్రేట్ 20 గ్రాండ్‌స్లామ్‌ల రికార్డుకు మరో అడుగు దూరంలోనే నిలిచాడు.
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ ప్రపంచ రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) వశమైంది. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన నాదల్ ఈ టోర్నీలోనూ తన సత్తా చాటాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక మొదలై సోమవారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు ముగిసిన ఫైనల్లో నాదల్ 7–5, 6–3, 5–7, 4–6, 6–4 స్కోరుతో ఐదో సీడ్ డానిల్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించాడు.
పోటాపోటీగా సాగిన ఐదు సెట్‌ల ఈ పోరాటం 4 గంటల 49 నిమిషాల పాటు ప్రేక్షకులను కట్టిపడేయడం విశేషం. తాజా విజయంతో నాదల్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సంఖ్య 19కి చేరింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన మెద్వెదేవ్ రన్నరప్‌గా సంతృప్తి పడాల్సి వచ్చింది. నాదల్ గతంలో 2010, 2013, 2017లలో యూఎస్ ఓపెన్ గెలిచాడు. నాదల్ (62)కంటే ఎక్కువ విన్నర్లు (75) కొట్టినా... 57 అనవసర తప్పిదాలు మెద్వెదేవ్ ఓటమికి కారణమయ్యాయి. విజేత నాదల్‌కు 38,50,000 డాలర్లు (రూ. 27 కోట్ల 59 లక్షలు)... రన్నరప్ మెద్వెదేవ్‌కు 19,00,000 డాలర్లు (రూ. 13 కోట్ల 62 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
నాదల్ జోరు...
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన నాదల్‌కు సరైన ఆరంభం లభించలేదు. అతని ఫోర్‌హ్యాండ్‌లలో ధాటి లేకపోవడంతో మెద్వెదేవ్ వాటిని సమర్థంగా ఎదుర్కొన్నాడు. మూడో గేమ్‌ను బ్రేక్ చేసిన రష్యన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. అయితే కోలుకున్న నాదల్ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంలో సఫలమయ్యాడు. తర్వాతి 10 పాయింట్లలో 8 గెలుచుకొని దూసుకుపోగా... స్కోరు 5–5కు చేరిన తర్వాత సర్వీస్‌ను నిలబెట్టుకున్న నాదల్ మళ్లీ బ్రేక్ చేసి సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్ నాదల్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. బేస్‌లైన్ వద్దనుంచే చక్కటి రిటర్న్‌లతో మెద్వెదేవ్‌పై ఒత్తిడి పెంచిన అతను 48 నిమిషాల్లోనే అలవోకగా సెట్‌ను సాధించాడు.
అనూహ్య ప్రతిఘటన...
పరిస్థితి చూస్తే మరో సెట్‌తో పాటు మ్యాచ్ కూడా ఇదే తరహాలో ముగుస్తుందని అనిపించింది. అయితే మెద్వెదేవ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. మరో మూడు గేమ్‌లు గెలిస్తే నాదల్ విజేతగా నిలుస్తాడనగా రష్యన్ ప్రతిఘటించాడు. 2–3తో వెనుకబడి ఉన్న దశ నుంచి తర్వాతి 7 గేమ్‌లలో 5 గెలుచుకొని సెట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరు సుదీర్ఘమైన ర్యాలీలు ఆడారు. నాలుగో సెట్‌లో మెద్వెదేవ్ మరింత దూకుడు ప్రదర్శించాడు. ఆరంభంలోనే బ్రేక్ సాధించిన అతను పదో గేమ్‌లో కూడా మరో రెండు బ్రేక్ పాయింట్లు అందుకొని ముందంజ వేశాడు. బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్ అతని ఖాతాలో చేరింది.
హోరాహోరీ...
64 నిమిషాల పాటు సాగిన చివరి సెట్‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం శ్రమించారు. అయితే అనుభవాన్నంతా రంగరించిన నాదల్ ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా ఆడాడు. ఇద్దరు సర్వీస్‌లు నిలబెట్టుకొని స్కోరు 2–2కు చేరిన తర్వాత నాదల్ రెండు బ్రేక్‌లు సహా వరుసగా మూడు గేమ్‌లు గెలుచుకొని 5–2తో విజయానికి చేరువయ్యాడు. అయితే పోరాటం వదలని మెద్వెదేవ్ కూడా మళ్లీ రెండు గేమ్‌లు సాధించి స్కోరు 4–5కు తీసుకొచ్చాడు. ఉత్కంఠ తారాస్థాయికి పెరిగిపోయిన సమయంలో పదో గేమ్‌లో నాదల్ సర్వీస్ చేశాడు. ఒక దశలో 30–30, 40–40తో మెద్వెదేవ్ పోటీనిచ్చినా... చివరకు నాదల్‌నే విజయం వరించింది. మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్ కోర్టు బయట పడటంతో నాదల్ భావోద్వేగంతో కూలిపోయాడు.
నా టెన్నిస్ కెరీర్‌లో నేను ఎంతో భావోద్వేగానికి లోనైన రోజుల్లో ఇది ఒకటి. చివరి మూడు గంటలు హోరాహోరీగా పోరు సాగింది. ఫైనల్ జరిగిన తీరు, దాదాపు చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ మళ్లీ కష్టంగా మారిపోవడం, మళ్లీ కోలుకోవడం చూస్తే నా దృష్టిలో ఈ విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే గెలవాలంటే ఈ మాత్రం శ్రమించాల్సిందే. స్క్రీన్‌పై నా గత టైటిల్స్‌ను చూడటం, ఆ విజయాలను గుర్తు చేసుకోవడం గర్వంగా, ప్రత్యేకంగా అనిపించింది. అందుకే నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. మెద్వెదేవ్ తన పోరాటంతో మ్యాచ్ దిశను మార్చేసిన తీరు అద్భుతం. మున్ముందు అతను ఎన్నో విజయాలు సాధించడం ఖాయం. భవిష్యత్తులో మరిన్ని గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకోవాలని నేనూ కోరుకుంటున్నా. అయితే అత్యధిక స్లామ్‌లు నెగ్గిన ఆటగాడిగా నిలవకపోయినా నేను ప్రశాంతంగా నిద్రపోగలను.
–నాదల్
విజయం ఖాయమైన క్షణాన... నాదల్ భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment