వొజ్నియాకి అవుట్ | Caroline Wozniacki loses to No. 136 Camila Giorgi at U.S. Open | Sakshi
Sakshi News home page

వొజ్నియాకి అవుట్

Published Mon, Sep 2 2013 2:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

వొజ్నియాకి అవుట్

వొజ్నియాకి అవుట్

న్యూయార్క్: ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకికి కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాలనే కల కలగానే మిగిలిపోయేలా ఉంది. 23 ఏళ్ల ఈ డెన్మార్క్ భామ మరోసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో నిరాశపరిచింది. గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించకుండానే టాప్ ర్యాంక్‌ను అందుకున్న అతికొద్ది మంది క్రీడాకారిణుల్లో ఒకరైన వొజ్నియాకి యూఎస్ ఓపెన్‌లో ఈసారి మూడో రౌండ్‌లోనే నిష్ర్కమించింది. ఇదే టోర్నీలో 2009లో రన్నరప్‌గా నిలిచి, 2010, 2011లో సెమీఫైనల్‌కు చేరిన ఆరో సీడ్ వొజ్నియాకి ఈసారి క్వాలిఫయర్ కామిలా జియార్జి (ఇటలీ) చేతిలో ఓటమి పాలైంది. 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 136వ ర్యాంకర్ కామిలా 4-6, 6-4, 6-3తో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ వొజ్నియాకిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.  
 మరో మూడో రౌండ్ మ్యాచ్‌లో రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) అతికష్టమ్మీద గెలిచింది. అలైజ్ కార్నెట్ (ఫ్రాన్స్)తో 2 గంటల 40 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అజరెంకా 6-7 (2/7), 6-3, 6-2తో నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)తో పోరుకు సిద్ధమైంది. మరో మ్యాచ్‌లో ఇవనోవిచ్ 4-6, 7-5, 6-4తో క్రిస్టినా మెక్‌హాలె (అమెరికా)పై గెలిచింది.
 
 జాన్ ఇస్నెర్‌కు చుక్కెదురు
 పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా ఆశాకిరణం, 13వ సీడ్ జాన్ ఇస్నెర్ మూడో రౌండ్‌లో ఓడిపోయాడు. 22వ సీడ్ కోల్‌ష్రైబర్ (జర్మనీ) 6-4,3-6, 7-5, 7-6 (7/5)తో జాన్ ఇస్నెర్‌ను ఓడించాడు. మరోవైపు మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (అమెరికా) మరో మ్యాచ్‌లో గెలిస్తే తొలిసారి యూఎస్ ఓపెన్‌లో ముఖాముఖిగా తలపడటం ఖాయమవుతుంది. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 6-3, 6-0, 6-2తో మనారినో (ఫ్రాన్స్)పై, నాదల్ 6-4, 6-3, 6-3తో డోడిగ్ (క్రొయేషియా)పై గెలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో టామీ రొబ్రెడో (స్పెయిన్)తో ఫెడరర్; కోల్‌ష్రైబర్‌తో నాదల్ పోటీపడతారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement