మూడో రౌండ్‌లోకి టాప్ సీడ్
మెద్వెదెవ్, జ్వెరెవ్ కూడా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ వరుసగా 19వ ఏడాది మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 6–4, 6–1, 6–2తో రొబెర్టో కార్బెలస్ బేనా (స్పెయిన్)పై విజయం సాధించాడు.
2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన జొకోవిచ్ 43 విన్నర్స్ కొట్టడంతోపాటు నెట్ వద్ద 20 పాయింట్లు సాధించాడు. మరోవైపు నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా), ఎనిమిదో సీడ్ హుర్కాజ్ (పోలాండ్) కూడా మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జ్వెరెవ్ 7–6 (7/4), 6–2, 6–2తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, హుర్కాజ్ 6–7 (2/7), 6–1, 6–3, 7–6 (7/5)తో నకíÙమా (అమెరికా)పై గెలుపొందారు. కెచ్‌మనోవిచ్ (సెర్బియా)తో జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ తొలి సెట్‌ను 6–1తో నెగ్గి, రెండో సెట్‌లో 5–0తో ఆధిక్యంలో ఉన్నపుడు కెచ్‌మనోవిచ్ గాయం కారణంగా వైదొలిగాడు.
సబలెంకా ముందుకు...
మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సబలెంకా 6–2, 6–2తో ఉచిజిమా (జపాన్)పై, రిబాకినా 6–3, 6–4తో అరంటా రుస్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 7–6 (7/1), 1–6, 7–5తో నయోమి ఒసాకా (జపాన్)పై, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–4తో తమారా జిదాన్‌సెక్ (స్లొవేనియా)పై నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment