
చైనా ఓపెన్ టెన్నిస్ టోర్నీ
బీజింగ్: అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ చైనా ఓపెన్‌లో మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీఏ–1000 సిరీస్ టోర్నీ మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆదివారం గాఫ్ 6–4, 4–6, 7–5తో లేలా ఫెర్నాండెజ్ (కెనడా)పై విజయం సాధించింది. రెండో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ ఈ మ్యాచ్‌లో 4 ఏస్‌లు సంధించి... 6 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 8 బ్రేక్ పాయింట్లు కాచుకున్న గాఫ్... మొత్తం 108 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.
మంగళవారం జరగనున్న మూడో రౌండ్‌లో బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్)తో గాఫ్ తలపడనుంది. ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ 66వ ర్యాంకర్ ఇవా లైస్ (జర్మనీ) 6–3, 1–6, 6–4తో ప్రపంచ పదో ర్యాంకర్ రిబాకినా (కజకిస్తాన్)పై... జాస్మిన్ పావోలిని (ఇటలీ) 6–3, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై విజయాలు సాధించి ముందంజ వేశారు. అమెరికా ప్లేయర్ కెస్లెర్‌తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన చెక్ రిపబ్లిక్ ప్లేయర్ క్రెజికోవా పోటీ నుంచి తప్పుకుంది.
క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్
మరోవైపు ఏటీపీ–500 పురుషుల టోర్నమెంట్ లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్స్‌లో జ్వెరెవ్ 7–5, 3–6, 6–3తో కొరెన్‌టిన్ మౌటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో డానియల్ మెద్వెదెవ్ (రష్యా)తో జ్వెరెవ్ తలపడనున్నాడు. మరో మ్యాచ్‌లో లొరెన్జో ముసెట్టి (ఇటలీ) 6–3, 6–3తో ఆడియన్ మన్నారినో (ఫ్రాన్స్)పై గెలిచి ముందంజ వేశాడు.