మూడో రౌండ్‌లోకి డిఫెండింగ్ చాంపియన్
సబలెంకా, అజరెంకా ముందంజ
న్యూయార్క్: స్వదేశంలో తన జోరు కొనసాగిస్తూ... అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోరీ్నలో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ టోరీ్నలో అడుగుపెట్టిన మూడో సీడ్ కోకో గాఫ్ రెండో రౌండ్‌లో 6–4, 6–0తో ప్రపంచ 99వ ర్యాంకర్ తాత్యానా మరియా (జర్మనీ)పై గెలిచింది.
80 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో కోకో గాఫ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 28 సార్లు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు నెగ్గిన కోకో 25 విన్నర్స్ కొట్టింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–1తో లూసియా బ్రోన్‌జెట్టి (ఇటలీ)పై, మాజీ నంబర్‌వన్ అజరెంకా (బెలారస్) 6–1, 6–4తో క్లారా బురెల్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.
ఏడో సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) వరుసగా మూడో ఏడాది మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్‌లో కిన్‌వెన్ జెంగ్ 6–7 (3/7), 6–1, 6–2తో ఎరికా ఆంద్రీవా (రష్యా)ను ఓడించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో 12వ సీడ్ దరియా కసత్‌కినా (రష్యా) 1–6, 6–7 (3/7)తో పేటన్ స్టెర్న్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయింది.
జొకోవిచ్ ముందుకు...
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) మూడో రౌండ్‌కు చేరుకున్నారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6–4, 6–4, 2–0తో లాస్లో జెరె (సెర్బియా)పై, జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–1తో ముల్లర్ (ఫ్రాన్స్)పై, రూడ్ 6–4, 6–2, 2–6, 7–6 (7/3)తో గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు.
జెరెతో జరిగిన మ్యాచ్‌లో జొకోవిచ్ తొలి రెండు సెట్‌లు గెలిచి, మూడో సెట్‌లో 2–0తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా జెరె వైదొలిగాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 5–7, 6–1, 6–2, 6–2తో రిండర్‌నీచ్ (ఫ్రాన్స్)పై, 13వ సీడ్ షెల్టన్ (అమెరికా) 6–3, 6–4, 6–4తో అగుట్ (స్పెయిన్)పై, తొమ్మిదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6–1, 6–1, 7–6 (7/4)తో హిజికాటా (ఆ్రస్టేలియా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment