♦ సింగపూర్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి చేరిక
♦ కశ్యప్, ప్రణయ్ అలవోక విజయం
♦ గురుసాయిదత్, సాయిప్రణీత్ ఓటమి
సింగపూర్ : అదే టోర్నీ... అదే ప్రత్యర్థి... అదే ఫలితం... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే గురుసాయిదత్, సాయిప్రణీత్, పీసీ తులసి మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మూడో సీడ్ శ్రీకాంత్ 21-18, 19-21, 21-14తో ప్రపంచ 28వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలుపొందాడు. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండో గేమ్‌లోనే విజయాన్ని ఖాయం చేసుకోవాల్సింది.
అయితే 19-18తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ హైదరాబాద్ ప్లేయర్ తన ప్రత్యర్థికి వరుసగా మూడు పాయింట్లు కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. ఆరంభంలోనే 11-5తో ముందంజ వేసి అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. గతేడాది ఇదే టోర్నీలో రెండో రౌండ్‌లో తియెన్ మిన్‌తో తలపడ్డ శ్రీకాంత్ మూడు గేముల్లో విజయం సాధించడం గమనార్హం.
ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-11, 21-13తో లీ హున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్ 21-15, 21-17తో వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించాడు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 21-16, 12-21, 15-21తో నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో; సాయిప్రణీత్ 11-21, 18-21తో రెండో సీడ్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు.
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-12, 21-16తో గో ఆ రా-యు హె వన్ (కొరియా) జంటను ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 17-21, 13-21తో పెబా జెబాదియా-రిజ్కీ అమెలియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జోడీ 15-21, 17-21తో కో సంగ్ హున్-కిమ్ హా నా (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది.
శ్రమించిన శ్రీకాంత్
Published Thu, Apr 9 2015 2:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement
Advertisement