Batminton tournment
-
శ్రమించిన శ్రీకాంత్
♦ సింగపూర్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి చేరిక ♦ కశ్యప్, ప్రణయ్ అలవోక విజయం ♦ గురుసాయిదత్, సాయిప్రణీత్ ఓటమి సింగపూర్ : అదే టోర్నీ... అదే ప్రత్యర్థి... అదే ఫలితం... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ శుభారంభం చేశాడు. శ్రీకాంత్‌తోపాటు పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే గురుసాయిదత్, సాయిప్రణీత్, పీసీ తులసి మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో మూడో సీడ్ శ్రీకాంత్ 21-18, 19-21, 21-14తో ప్రపంచ 28వ ర్యాంకర్ తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై గెలుపొందాడు. 51 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ రెండో గేమ్‌లోనే విజయాన్ని ఖాయం చేసుకోవాల్సింది. అయితే 19-18తో ఒక పాయింట్ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ హైదరాబాద్ ప్లేయర్ తన ప్రత్యర్థికి వరుసగా మూడు పాయింట్లు కోల్పోయాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో శ్రీకాంత్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచాడు. ఆరంభంలోనే 11-5తో ముందంజ వేసి అటు నుంచి వెనుదిరిగి చూడలేదు. గతేడాది ఇదే టోర్నీలో రెండో రౌండ్లో తియెన్ మిన్తో తలపడ్డ శ్రీకాంత్ మూడు గేముల్లో విజయం సాధించడం గమనార్హం. ఇతర మ్యాచ్‌ల్లో కశ్యప్ 21-11, 21-13తో లీ హున్ (దక్షిణ కొరియా)పై గెలుపొందగా... ప్రణయ్ 21-15, 21-17తో వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)ను ఓడించాడు. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన గురుసాయిదత్ 21-16, 12-21, 15-21తో నాలుగో సీడ్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో; సాయిప్రణీత్ 11-21, 18-21తో రెండో సీడ్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప ద్వయం 21-12, 21-16తో గో ఆ రా-యు హె వన్ (కొరియా) జంటను ఓడించింది. అయితే సిక్కి రెడ్డి-ప్రద్న్యా గాద్రె జోడీ 17-21, 13-21తో పెబా జెబాదియా-రిజ్కీ అమెలియా (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి పాలైంది. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సిక్కి రెడ్డి-కోనా తరుణ్ జోడీ 15-21, 17-21తో కో సంగ్ హున్-కిమ్ హా నా (కొరియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. -
మలేసియా ఓపెన్ చాంప్స్ చెన్ లాంగ్, మారిన్
కౌలాలంపూర్ : మలేసియా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రపంచ చాంపియన్స్ చెన్ లాంగ్ (చైనా), కరోలినా మారిన్ (స్పెయిన్) వరుసగా పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో చెన్ లాంగ్ 20-22, 21-13, 21-11తో ఐదుసార్లు విశ్వవిజేత లిన్ డాన్ (చైనా)పై నెగ్గగా... కరోలినా మారిన్ 19-21, 21-19, 21-17తో టాప్ సీడ్ జురుయ్ లీ (చైనా)పై విజయం సాధించింది.సెమీఫైనల్లో భారత స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించిన జురుయ్ లీ ఫైనల్లో మాత్రం మారిన్‌కు గట్టిపోటీనిచ్చినా కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. -
కడపలో క్రీడా సందడి
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప గడపలో ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దీంతో మరో 30 రోజుల్లో జిల్లాలో క్రీడాసందడి నెలకొననుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి శనివారం కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులను సూచించారు. అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు టోర్నమెంట్ నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వివరించారు. దాదాపు 700 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లను చక్కగా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడే బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చిన ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, డీఎస్డీఓ బాషామొహిద్దీన్లను కలిసి టోర్నమెంట్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, సభ్యులు మారుతీమోహన్రెడ్డి, రెడ్డిప్రసాద్, మునికుమార్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, సుదర్శన్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్, ఎస్పీల సంపూర్ణ సహకారం.. జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డిలను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ కడపలో నిర్వహించే టోర్నమెంట్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.