కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : కడప గడపలో ఆలిండియా సబ్ జూనియర్ ర్యాంకింగ్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గత అక్టోబర్‌లో నిర్వహించాల్సిన ఈ పోటీలు సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం టోర్నమెంట్ నిర్వహణకు జిల్లా ఉన్నతాధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 4 నుంచి 10 వరకు టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దీంతో మరో 30 రోజుల్లో జిల్లాలో క్రీడాసందడి నెలకొననుంది. ఇందులో భాగంగా రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య చౌదరి శనివారం కడప నగరంలోని వైఎస్‌ఆర్ ఇండోర్ స్టేడియంను సందర్శించారు. జాతీయ స్థాయి పోటీల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులను సూచించారు.
అనంతరం జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులకు టోర్నమెంట్ నిర్వహణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను, మార్గదర్శకాలను వివరించారు. దాదాపు 700 మందికిపైగా క్రీడాకారులు హాజరయ్యే ఈ టోర్నమెంట్‌కు ఏర్పాట్లను చక్కగా చేయాలని చెప్పారు. అనంతరం అక్కడే బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చిన ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, డీఎస్‌డీఓ బాషామొహిద్దీన్‌లను కలిసి టోర్నమెంట్‌పై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కార్యదర్శి జిలానీబాషా, కోశాధికారి నాగరాజు, సభ్యులు మారుతీమోహన్‌రెడ్డి, రెడ్డిప్రసాద్, మునికుమార్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, సుదర్శన్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్, ఎస్పీల సంపూర్ణ సహకారం..
జాతీయస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతం చేసేందుకు సహకరించాలని రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి పున్నయ్య, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఏజేసీ సుదర్శన్‌రెడ్డిలను వేర్వేరుగా కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడుతూ కడపలో నిర్వహించే టోర్నమెంట్‌కు అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
కడపలో క్రీడా సందడి
Published Sun, Jan 5 2014 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement