పన్ను వసూళ్లకు ‘సమైక్య’ పోటు | The burden falls on people united | Sakshi

పన్ను వసూళ్లకు ‘సమైక్య’ పోటు

Nov 11 2013 2:34 AM | Updated on Sep 2 2017 12:30 AM

ప్రజలపై సమైక్య భారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలు మొదటి విడతగా చెల్లించే ఇంటి, నీటి పన్నును సకాలంలో చెల్లించలేకపోయారు.

సాక్షి, కడప: ప్రజలపై సమైక్య భారం పడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలు మొదటి విడతగా చెల్లించే ఇంటి, నీటి పన్నును సకాలంలో చెల్లించలేకపోయారు. ప్రస్తుతం దీనికి అధికారులు వడ్డీ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. వసూళ్ల కోసం నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటి, నీటి పన్ను ఏప్రిల్-సెప్టెంబర్, అక్టోబర్-మార్చి వరకు రెండు విడతలుగా వసూలు చేస్తారు. అయితే ఇప్పటికే మొదటి విడత గడువు దాటి నెలరోజులైంది.
 
 50 శాతం లోపే వసూళ్లు :
 జిలా ్లవ్యాప్తంగా కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో 50శాతం లోపే వసూళ్లు జరిగినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. ఉదాహరణకు కడప కార్పొరేషన్‌ను పరిశీలిస్తే నగరంలో 78,656 గృహాలు, 1094 ప్రభుత్వ భవనాలు ఉన్నాయి.
 
 అయితే దీనికి ఏప్రిల్-సెప్టెంబర్ మొదటి విడతకు ఇంటిపన్ను మొత్తం  8 కోట్ల 55 లక్షల 57 వేల రూపాయలు. కాగా, కేవలం వసూలైంది  4 కోట్ల 23 లక్షల 95 వేల రూపాయలు. అంటే వసూలైన మొత్తం 50 శాతం లోపే ఉంది. 33,413 మంచినీటి కుళాయి కనెక్షన్లు ఉండగా, వీటికి  3 కోట్ల 72 లక్షల 66 వేల రూపాయలు పన్ను వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం రూ. 51.12 లక్షలు మాత్రమే వసూలు కావడం గమనార్హం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పరిశీలిస్తే కోట్ల రూపాయల్లో బకాయిలు ఉన్నాయి.
 
 అధికారులు మాత్రం..
 మొదటి విడత, రెండో విడత బకాయిలను మార్చి లోపల వసూలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదిలా ఉంటే నిర్ణీత సమయంలో ఇంటిపన్ను చెల్లించని వారికి నెలకు 2శాతం అదనంగా వడ్డిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ఇంటిపన్ను, నీటిపన్నుతో సతమతమవుతున్న ప్రజలకు ఇది మరింత భారం కానుంది. సమైక్య సమ్మె నేపథ్యంలో కార్యాలయాలు లేకపోవడంతో తాము పన్నులు చెల్లించలేకపోయామని, ఇప్పుడు ప్రభుత్వం అదనంగా రెండు శాతం చెల్లించమనడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం సమ్మెకాలంలో సైతం మీసేవ కేంద్రాలు పనిచేశాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసే అవకాశమున్నందున పన్ను కట్టుకోవాల్సి ఉందని అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు.
 
 వసూళ్లను వేగవంతం చేశాం :
 కార్పొరేషన్ పరిధిలో నిలిచిపోయిన ఇంటి, నీటి పన్ను బకాయిల వసూళ్లను వేగవంతం చేశాం. మొదటి విడత ఏప్రిల్-సెప్టెంబరుకు సంబంధించి 50శాతం లోపు మాత్రమే పన్నులు వసూలయ్యాయి. పన్నులు సకాలంలో చెల్లించని వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనంగా రెండు శాతం వడ్డీని చెల్లించాల్సిందే.
 - చంద్రమౌళీశ్వరరెడ్డి,
 కమిషనర్, కడప నగర పాలక సంస్థ.
 
 నోటీసులు జారీ చే స్తున్న అధికారులు
 మార్చిలో పన్నులు చెల్లిస్తే గతంలో మాదిరి వడ్డీ మాఫీ జరిగే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. అందువల్ల ఇప్పుడు కట్టేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం సవరించిన విధానం ప్రకారం రెండు శాతం వడ్డీ తప్పక కట్టాల్సిందేనని, మాఫీ కాదని అధికారులు పేర్కొంటున్నారు. కడప కార్పొరేషన్‌తోపాటు అన్ని మున్సిపాలిటీలలో ఇంటి, నీటి పన్ను వసూళ్లకు సంబంధించి డిమాండ్ నోటీసులను జారీచేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement