విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన | The electrical performance of the contract employees | Sakshi
Sakshi News home page

విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన

Published Thu, Dec 18 2014 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM

The electrical performance of the contract employees

చాలీ చాలని జీతం.. సమయానికి అందని వైనం... విద్యుత్తు శాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వందల మంది ఆవేదన ఇది. తమ కష్టంతో కాంట్రాక్టర్లు, దళారీలు లాభపడుతున్నారంటూ ఆరోపించారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం కడపలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.  
 
 కడప సెవెన్‌రోడ్స్ : అనేక ఏళ్లుగా పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన వీధుల నుంచి సాగిన ఈ ప్రదర్శన కలెక్టరేట్ వరకు కొనసాగింది. అక్కడ కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు మేయర్ సురేష్‌బాబు మద్దతు పలికి మాట్లాడారు. రాష్ట్రాని కి వెలుతురు ప్రసాదిస్తున్న కాంట్రాక్టు వి ద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరించడం విచారకరమన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది జిల్లాల్లోని 341 మంది కాంట్రాక్టు ఉద్యోగులును పర్మినెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో ముందుంటామని హామీనిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు డబ్ల్యు రాము మాట్లాడుతూ ప్రభుత్వ నాన్పుడు ధోరణి కారణంగానే తాము సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 1991లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల కారణంగానే కాంట్రాక్టు వ్యవస్థ అమలులోకి వచ్చిందన్నారు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే కొత్త వారిని నియమించకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఇందువల్ల లాభపడుతోంది కాంట్రాక్టర్లు, దళారీలు మాత్రమేనని  స్పష్టం చేశారు.
 
  సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులకు 8 నుంచి 10 వేల రూపాయలతోనే సరి పెడుతున్నారని విమర్శించారు. వేతనాలు కూడా రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు మారినపుడల్లా పీఎఫ్, ఈఎస్‌ఐ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు ఆహ్వానించకపోతే ప్రజలంతా తాగునీరు, విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement