power contract
-
చత్తీస్గడ్ ఒప్పందం రద్దు చేసుకోవాలి
హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రజలపై భారం కానున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఛత్తీస్‌గఢ్ తో ఓపెన్ బిడ్ కాకుండా ఎంఓయూ చేసుకోవడం అది కూడా ఎక్కువ ధరకు చేసుకోవడం పొరపాటన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తక్కువధరకే విదు్యత్ను ఇస్తానని చెప్పింది. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా కూడా ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉంది. గత ఒప్పందాల ద్వారానే విద్యుత్ కొనుగోలుకు అవకాశమున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుభవం లేక, అహంకారంతో ఒప్పందం చేయడం వల్లనే ఈ తప్పు జరిగిందన్నారు. గతంలో 2014 లో మాదిరిగా ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ఒప్పందం కారణంగా ప్రజలపై ఏడాదికి కోట్లాది రూపాయల భారం పడుతోందన్నారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఈ ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు. -
సమ్మె..సమస్యలు
డిస్కంలో పేరుకపోతున్న విద్యుత్ ఫిర్యాదులు కోతలు, ఓల్టేజ్ హెచ్చతగ్గులతో గ్రేటర్‌వాసులు సతమతం నిలిచిన మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్లు ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్న నేతలు సిటీబ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. కార్మిక సంఘం నేతలు మాత్రం ఇంకా ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్నారు. నేతల దీక్షకు మద్దతుగా సోమవారం ఉదయం మరోసారి మూకుమ్మడిగా టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్‌కో, వివిధ డిస్కంల పరిధిలోని సుమారు 22 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులంతా ఏడు రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఆయా విభాగాల్లో పనులన్ని పూర్తిగా స్తంభించిపోయాయి. లైన్ల పునరుద్ధరణ, కొత్త కనెక్షన్లు, కొత్త లైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తినప్పుడు ఇంట్లో విలువైన గృహోపకరణాలు కాలిపోతున్నాయి. అంతేకాదు సర్వీసు వైర్లు కాలిపోతున్నాయి. అంతటా అంధకారం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్లను పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ఎఫ్ఓసీ కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు కార్మికులు లేక పోవడంతో వినియోగదారులు రోజుల తరబడి అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. ఆసిఫ్‌నగర్ డివిజన్ దత్తాత్రేయనగర్ కాలనీలో సర్వీస్ నెంబర్ 030555 వినియోగ దారుడు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం స్థానిక ఏఈకి ఫిర్యాదు ఇచ్చినా..నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం చాదర్‌ఘట్‌లో డిస్ట్రిబ్యూషన్ వైరు తెగిపడింది. వెంటనే స్థానికులు డిస్కం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్‌లో ఆదివారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం స్థానికులు 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. నిలిచిన మీటర్ రీడింగ్.. మీటర్ రీడింగ్ కార్మికులూ సమ్మెలో పాల్గొనడంతో గ్రేటర్ పరిధిలో రీడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిస్కం పరిధిలో వినియోగదారుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో మీటర్ రీడింగ్ మిషన్లలో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు. సోమవారం వరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. సకాలంలో రీడింగ్ తీయక పోవడంతో శ్లాబురేటు మారి వినియోగదారుని జేబుకు చిల్లుపడుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం మీటర్ రీడింగ్‌పై ప్రత్యామ్నాయ దృష్టి సారించింది. డీఈ, ఏఈ, లైన్మెన్లతో పాటు ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చి బిల్లులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే తమ సమస్యను పరిష్కరించకుండా ఇతరులతో రీడింగ్ తీయిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని కార్మిక సంఘం నాయకుడు సాయిలు హెచ్చరించారు. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన
చాలీ చాలని జీతం.. సమయానికి అందని వైనం... విద్యుత్తు శాఖలో ఏళ్ల తరబడి కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న వందల మంది ఆవేదన ఇది. తమ కష్టంతో కాంట్రాక్టర్లు, దళారీలు లాభపడుతున్నారంటూ ఆరోపించారు. సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం కడపలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కడప సెవెన్‌రోడ్స్ : అనేక ఏళ్లుగా పనిచేస్తున్న తమను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన వీధుల నుంచి సాగిన ఈ ప్రదర్శన కలెక్టరేట్ వరకు కొనసాగింది. అక్కడ కార్మికులు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు మేయర్ సురేష్‌బాబు మద్దతు పలికి మాట్లాడారు. రాష్ట్రాని కి వెలుతురు ప్రసాదిస్తున్న కాంట్రాక్టు వి ద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం విస్మరించడం విచారకరమన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనిమిది జిల్లాల్లోని 341 మంది కాంట్రాక్టు ఉద్యోగులును పర్మినెంట్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి బుద్ది చెప్పాలన్నారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో ముందుంటామని హామీనిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు డబ్ల్యు రాము మాట్లాడుతూ ప్రభుత్వ నాన్పుడు ధోరణి కారణంగానే తాము సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. 1991లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధానాల కారణంగానే కాంట్రాక్టు వ్యవస్థ అమలులోకి వచ్చిందన్నారు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే కొత్త వారిని నియమించకుండా కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పనులు చేయిస్తున్నారని చెప్పారు. ఇందువల్ల లాభపడుతోంది కాంట్రాక్టర్లు, దళారీలు మాత్రమేనని స్పష్టం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికులకు 8 నుంచి 10 వేల రూపాయలతోనే సరి పెడుతున్నారని విమర్శించారు. వేతనాలు కూడా రెండు, మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లు మారినపుడల్లా పీఎఫ్, ఈఎస్ఐ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు చేపడతామన్నారు. ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు ఆహ్వానించకపోతే ప్రజలంతా తాగునీరు, విద్యుత్ లేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మల్లికార్జునరెడ్డి, కేసీ బాదుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఇది అబద్ధాల ప్రభుత్వం
కడప కార్పొరేషన్: అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పటికీ అవే అబద్దాలు చెబుతూ పాలన సాగిస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. శంకరాపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహిస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలకుముందు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయివుంటే ఈపాటికి కార్మికులందరూ పర్మినెంట్ అయి ఉండేవారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో 16 వేల మంది కార్మికులు 18 సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆర్టీసీలో మజ్దూర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 24 వేలమంది కార్మికులను పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. ఈనెల 18వ తేది అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని, ఆ సమావేశాల్లో కార్మికులు డిమాండ్లపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వైఎస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారెడ్డి, కాంట్రాక్టు కార్మికుల యూనియన్ నాయకులు మల్లికార్జున, కిశోర్, కార్మికులు పాల్గొన్నారు.