చత్తీస్‌గడ్ ఒప్పందం రద్దు చేసుకోవాలి
హైదరాబాద్: ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం రాష్ట్ర ప్రజలపై భారం కానున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ తో ఓపెన్ బిడ్ కాకుండా ఎంఓయూ చేసుకోవడం అది కూడా ఎక్కువ ధరకు చేసుకోవడం పొరపాటన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం తక్కువధరకే విదు్యత్ను ఇస్తానని చెప్పింది. మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్నా కూడా ఎక్కువ ధరకు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
ప్రస్తుతం దేశంలో మిగులు విద్యుత్ ఉంది. గత ఒప్పందాల ద్వారానే విద్యుత్ కొనుగోలుకు అవకాశమున్నా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుభవం లేక, అహంకారంతో ఒప్పందం చేయడం వల్లనే ఈ తప్పు జరిగిందన్నారు. గతంలో 2014 లో మాదిరిగా ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు. చత్తీస్‌గఢ్ ఒప్పందం కారణంగా ప్రజలపై ఏడాదికి కోట్లాది రూపాయల భారం పడుతోందన్నారు. వాస్తవాలు ఒక విధంగా ఉంటే టీఆర్‌ఎస్ నాయకులు, మంత్రులు ఈ ఒప్పందాన్ని సమర్థించుకునేందుకు డొంకతిరుగుడు మాటలు చెబుతున్నారని విమర్శించారు.