సాక్షి, కడప: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలేదీక్షలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జీవోఎంకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జాతీయరహదారులను ఎక్కడికక్కడ దిగ్బంధించారు. తెల్లవారుజాము నుంచే కార్యకర్తలు రహదారులపైకి వచ్చి బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. దీంతో ప్రతి రహదారిపై వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
కడపలో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో రాజంపేట బైపాస్‌లో, నగర సమన్వయకర్త అంజాద్‌బాషా, మాసీమబాబు ఆధ్వర్యంలో ఇర్కాన్ సర్కిల్‌లో కార్యకర్తలు ఉదయం 6 గంటలకు బైఠాయించి రాకపోకలు అడ్డుకున్నారు. అలాగే చింతకొమ్మదిన్నె వైఎస్సార్ సర్కిల్‌లో కూడా కడప-రాయచోటి రహదారిపై వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. ఉదయం 10.45 గంటలకు డీఎస్పీ రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి చెన్నూరు, రిమ్స్ పోలీస్‌స్టేషన్ లకు తరలించారు. దీంతో పదినిమిషాల వ్యవధిలో మళ్లీ అఫ్జల్‌ఖాన్‌తో పాటు పలువురు కార్యకర్తలు బైపాస్‌లో బైఠాయించారు. వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
పులివెందులలో ఉదయం 6 గంటలకే పులివెందుల- కదిరి, అనంతపురం, కడప, వీరపునాయునిపల్లి, జమ్మలమడుగు రహదారులను దిగ్బంధించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితో పాటు పలువురు నేతలు మధ్యాహ్నం 12.30 గంటల వరకూ బైఠాయించారు. ఆపై పోలీసులు వచ్చి వారిని అరెస్టు చేశారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. గౌరీ అనే మహిళ చేతికి గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో పోలీసుల అరెస్టుకు నిరసనగా వైఎస్ అవినాష్‌రెడ్డి గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. కార్యకర్తలు మాత్రం అరెస్టులకు బెదరకుండా సాయంత్రం వరకూ దిగ్బంధం కార్యక్రమాన్ని కొనసాగించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 8నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ కడప-రేణిగుంట హైవే దిగ్బంధించారు. 1.30 గంటలకు డీఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో పోలీసులు ఎమ్మెల్యేతో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. సమైక్యాంధ్ర కోసమే వైఎస్సార్‌సీపీ ఉద్యమం చేస్తోందని, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కాదని ఎమ్మెల్యే అన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు-మైదుకూరుతో పాటు జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, చాగలమర్రి రహదారులను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ దిగ్బంధించారు. ఆపై డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వీరిని అరెస్టు చేశారు.
జమ్మలమడుగులో తెల్లవారుజామున 4.30 గంటలకే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. మధ్యాహ్నం 2 గంటల వరకు రాకపోకలు అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు నిలిపేశారు. మధ్యాహ్నం డీఎస్పీ జాన్‌మనోహర్ వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సమైక్యం కోసం పోరాడుతున్న జగన్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే కాంగ్రెస్‌పార్టీ నేతలు అరెస్టులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసే వరకూ ఉద్యమాన్ని విరమించే ప్రసక్తే లేదని వారు తేల్చి చెప్పారు. ఎర్రగుంట్లలో పార్టీ నేతలు రహదారులను దిగ్బంధించారు.
పులివెందుల, రాయచోటి, కడప జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరులో వంటా వార్పు నిర్వహించారు. ప్రొద్దుటూరు, వేములలో రహదారిపై ట్రాక్టర్లు అడ్డుపెట్టి బైఠాయించారు. బద్వేలు, పోరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు-నెల్లూరుతో పాటు పలు రహదారులపై బైఠాయించి వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి-12 గంటల వరకు రహదారులను దిగ్బంధించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఓ వైపు ప్రజలు వందరోజులుగా ఉద్యమిస్తుంటే మరో వైపు జీవోఎం ఏర్పాటు చే సి విభజన ప్రక్రియను వేగవంతం చేసేదిశగా కేంద్రం అడుగులు వేయడం దారుణమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉదయం 7నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాజంపేట-తిరుపతి రహదారిపై బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తర్వాత సాయంత్రం 4.30-5గంటల వరకు మళ్లీ బైఠాయించారు. దీంతో పోలీసులు మళ్లీ వారిని అరెస్టు చేశారు. తమ అరెస్టులతో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని అడ్డుకోలేరని, జగన్ సారథ్యంలో సమైక్యాంధ్రను సాధించుకుంటామని కొరముట్ల అన్నారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్‌చార్జ్ నాగిరెడ్డి ఆధ్వర్యంలో రాకపోకలను అడ్డుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ఎక్కడికక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్లను దిగ్బంధించారు. మధ్యాహ్నం 12 గంటలకు డీఎస్పీ చల్లా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వారిని అరెస్టు చేశారు.
నేటితో ఉద్యమానికి వందరోజులు
సమైక్యాంధ్ర ఉద్యమం గురువారం వందరోజులకు చేరనుంది. జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు రిలేదీక్షలు సాగిస్తున్నారు. బుధవారం బాలవికాస్ ఇంగ్లీషుమీడియం పాఠశాల డెరైక్టర్ గంగయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశనాయకుల వేషధారణలతో వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోటిరెడ్డి సర్కిల్‌లో మానవహారం నిర్వహించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయ నాయకులు నాగమునిరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎలియాస్‌రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. న్యాయవాదుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. బద్వేలులో మహేశ్వరరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు రిలేదీక్షల్లో కూర్చున్నారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగులో పెద్దదండ్లూరు రైతులు దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
దిగ్బంధం
Published Thu, Nov 7 2013 2:37 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement