సాక్షి, కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా, జీవోఎంకు నిరసనగా వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48గంటల జాతీయరహదారుల దిగ్బంధం రెండోరోజు గురువారం కొనసాగింది. కడపలో రాజంపేట వైఎస్సార్ సర్కిల్‌లో జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు ఆధ్వర్యంలో, ఇర్కాన్‌సర్కిల్‌లో నగరసమన్వయకర్త అంజాద్‌బాషా ఆధ్వర్యంలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ ర హ దారులను దిగ్బంధించారు.
ఇర్కాన్‌సర్కిల్‌లో వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనం చేశారు. కళాకారులు సమైక్యాంధ్ర పాటలు పాడి ఉద్యమకారులను అలరించారు. రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు, చిన్నపిల్లల తల్లులు రోడ్లపక్కన చెట్లకింద సేదతీరారు.
మధ్యాహ్నం 12.30 గంటలకు పోలీసులు నేతలను అరెస్టు చేశారు. జమ్మలమడుగులో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4.30 గంటల నుంచే దారులను దిగ్బంధించారు. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలను రోడ్లకు అడ్డుగా పెట్టి వాహనాల రాకపోకలను నిలిపేశారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సులు బయటకు రాకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. రోజంతా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లలేకపోయారు. చాలా గ్రామాల్లో పాఠశాలలకు అనధికారికంగా సెలవులు ప్రకటించారు. రోడ్లలో చిక్కుకుపోయిన ప్రయాణీకులు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పొలీసులు మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టు చేశారు. అయితే కార్యకర్తలు సాయంత్రం వరకూ దిగ్బంధనాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరులో నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో మధ్యాహ్నం వరకూ ర హదారులను దిగ్బంధించారు. రోడ్లపై ట్రాక్టర్లు, బస్సులు అడ్డుగా పెట్టి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్లపై వంటావార్పు చేసి, సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి అందరినీ అరెస్టు చేశారు.
పులివెందులలో యువజనవిభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైసీపీ జిల్లా మునిసిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6నుంచి సాయంత్రం 5గంటల వరకూ రోడ్లను దిగ్బంధించారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణీకులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. తొండూరులో రోడ్డుపై టెంటు ఏర్పాటు చేసి వంటావార్పు చేపట్టారు. మైదుకూరులో క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి, మైదుకూరు ఇన్‌చార్జ్ శెట్టిపల్లి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నాలుగరోడ్ల కూడలిని దిగ్బంధించారు. టెంటు ఏర్పాటు చేసి వంటవార్పు చేపట్టారు. రైల్వేకోడూరులో రాఘవరాజుపురం వద్ద రోడ్డుపై ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా కంప, మొద్దులు వేశారు. మధ్యాహ్నం 3గంటలకు పోలీసులు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో రోడ్లపై వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. రోడ్డుపైనే వంటావార్పు చేపట్టి సహపంక్తి భోజనం చేశారు. మధ్యాహ్నం 3.30గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. బద్వేలు, పోరుమామిళ్ల, అట్లూరులో పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. మాజీ ఎమ్మెల్యే గోవిందరెడ్డి మూడుచోట్లా పాల్గొన్నారు.
అట్లూరులో గోవిందరెడ్డిని అరెస్టుచేశారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 6.30-11గంటల వరకూ రహదారులను దిగ్బంధించారు. రోడ్డుపై టెంట్లు వేసి కార్యకర్తలు బైఠాయించారు. వాహనాల రాకపోకలను మళ్లించేందుకు పోలీసులు యత్నించగా ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. 11 గంటలకు ఎమ్మెల్యేతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కమలాపురంలో మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి ఆధ్వర్యంలో రహదారిని దిగ్బంధించారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించారు.
దారులన్నీ బంద్
Published Fri, Nov 8 2013 2:51 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement
Advertisement